సిల్వర్ జూబ్లీ సభతో బీఆర్ఎస్ దశ మారుతుందా ?
x
BRS chief KCR

సిల్వర్ జూబ్లీ సభతో బీఆర్ఎస్ దశ మారుతుందా ?

బహిరంగసభను విజయవంతం చేయటం ద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) తన సత్తాను చాటిచెప్పాలని అనుకుంటున్నారా ?


ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ భవిష్యత్తంతా హనుమకొండ జిల్లాలో జరగబోయే సిల్వర్ జూబ్లీ బహిరంగసభ మీదే ఆధారపడుందా ? బహిరంగసభను విజయవంతం చేయటం ద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) తన సత్తాను చాటిచెప్పాలని అనుకుంటున్నారా ? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇపుడు రాజకీయంగా చక్కర్లు కొడుతున్నాయి. విషయం ఏమిటంటే ఈనెల 27వ తేదీన బీఆర్ఎస్ 25 ఏళ్ళ ప్రస్ధానం పూర్తిచేసుకోబోతోంది. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలని డిసైడ్ చేసిన కేసీఆర్ హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామంలో భారీ బహిరంగసభను నిర్వహించాలని కూడా అనుకున్నారు. అందుకని పార్టీ నేతలతో అవసరమైన కమిటీలను కూడా ఏర్పాటుచేశారు. అనుకున్న పనులను కమిటీలు ఏ విధంగా చేస్తున్నాయో తెలుసుకునేందుకు కేసీఆర్ తరచూ సీనియర్ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామం నేషనల్ హైవే 563-నేషనల్ హైవే 765 డీజీ(Development and Growth)కి మధ్యలో ఉంటుంది. ఈమధ్యలో ఉన్న 1213 ఎకరాల్లో భారీ బహిరంగసభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పార్టీ నేతలు చేస్తున్నారు. బహిరంగసభకు సుమారు 10 లక్షల మందిని సమీకరించాలని టార్గెట్ పెట్టుకున్న పార్టీ సీనియర్ నేతలు 50 వేల వాహనాల్లో జనాలను తరలించబోతున్నారు. 50 వేల వాహనాల పార్కింగ్ కోసం 1059 ఎకరాలను కేటాయించారు. ఇందులోనే ఆర్టీసీ నుండి అద్దెకు తీసుకున్న 3 వేల బస్సులు కూడా ఉంటాయి. 3 వేల బస్సులను అద్దెకు తీసుకుంటున్నందుకు బీఆర్ఎస్(BRS) ఇప్పటికే సంస్ధకు రు. 8 కోట్లు చెల్లించేసింది. 1213 ఎకరాలకు యజమానులైన రైతుల నుండి బహిరంగసభ నిర్వహణకు తమభూములను ఉపయోగించుకునేందుకు అభ్యంతరంలేదని తెలియజేసే లేఖలను కూడా ముందుజాగ్రత్తగా బీఆర్ఎస్ పోలీసులకు అందచేసింది. 1213 ఎకరాల్లో 154 ఎకరాలను వేదికకోసమే కేటాయించింది. వేదికమీద సుమారు 400 మంది సీనియర్ నేతలు కూర్చునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎల్కతుర్తి గ్రామాన్నే పార్టీ ఎందుకు ఎంచుకున్నదంటే ఈ గ్రామానికి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుండి రోడ్డు, రైలు సౌకర్యం ఉందికాబట్టే. 119 నియోజకవర్గాల నుండి ఎల్కతుర్తికి ఆర్టీసీ(TGRTC) బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు చేరుకునేట్లు ప్లాన్ చేస్తున్నారు. ఎండలు మండిపోతున్న రోజుల్లో బహిరంగసభ నిర్వహిస్తున్నారు కాబట్టి సభకు హాజరయ్యే జనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 10 లక్షలకు పైగా మంచినీళ్ళ బాటిళ్ళు, మజ్జిగ ప్యాకెట్లను రెడీగా ఉంచాలని కేసీఆర్ ఆదేశించారు. బహిరంగసభ జరిగే స్ధలంలో పందిళ్ళు వేయాలని, వేలసంఖ్యలో జెయింట్ సైజ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. సభకు వచ్చే జనాలను నియంత్రించేందుకు, ఏ జిల్లా నుండి వచ్చే జనాలను ఆ జిల్లాలకు కేటాయించిన స్ధలంలోనే కూర్చోబెట్టేట్లుగా సుమారు 5 వేలమంది వాలంటీర్లను ఏర్పాటుచేస్తున్నారు. అవసరమైన వైద్యసేవలు అందిచేందుకు వైద్య బృందాలను కూడా సిద్ధంగా ఉంచాలని కేసీఆర్ ఆదేశించారు.

బహిరంగసభ నిర్వహించటం, ఏర్పాట్లు చేయటం బీఆర్ఎస్ చేతిలోనిపని. ఎందుకంటే పార్టీలో గట్టి నేతలున్నారు పైగా పార్టీ ఖాతాలో సుమారు 900 కోట్ల రూపాయలున్నాయి కాబట్టి నిధులకు కూడా ఎలాంటి లోటులేదు. నిధులకు లోటులేక, సమర్ధులైన నేతలున్నపుడు ఏర్పాట్లుచేయటం ఎంతసేపు. కాబట్టి ఎంతటి ఖర్చునైనా భరించి భూమి బద్దలయ్యేంత బహిరంగసభను నిర్వహించగలదు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే పడిపోతున్న కేసీఆర్ గ్రాఫ్ ను బహిరంగసభ తిరిగి నిలబెట్టగలదా ? కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోందని అన్నది ఎందుకంటే ఓడిపోయిన దగ్గర నుండి కేసీఆర్ ఇఫ్పటివరకు ప్రజాక్షేత్రంలోకి తిరిగిందిలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారంచేశారు. అంతే ఆతర్వాత నుండి అధినేత పబ్లిక్ లోకి వచ్చిందిలేదు. పార్టీ నేతలను కూడా కలిసిందిలేదు. ఈనెల 27వ తేదీన బహిరంగసభ నిర్వహిస్తున్నారు కాబట్టి సీనియర్లతో సమీక్షలు చేయాలి కాబట్టి తరచూ నేతలను కలుస్తున్నారంతే.

బహిరంగసభ అవసరమే లేకపోతే ఇపుడు కూడా పార్టీ నేతలను కేసీఆర్ కలిసేది అనుమానమే. పైగా కొందరు నేతలతో సమీక్షలు చేసేసమయంలో విచిత్రమైన వ్యాఖ్యలుచేశారు. ‘కత్తి కాంగ్రెస్ చేతికిచ్చి తనను యుద్ధంచేయమంటే తాను ఎందుకు చేస్తాను’ అన్నారు. ‘బీఆర్ఎస్ ను ఓడించిన జనాలకు తగిన శాస్తి జరగాల్సిందే’ అన్నారు. ఇవేకాకుండా చేయకూడని చాలా వ్యాఖ్యలను కేసీఆర్ కొన్ని సందర్భాల్లో చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలను బట్టిచూస్తే అధికారంలో ఉంటే మాత్రమే తాను ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పినట్లుగా అర్ధంచేసుకోవాలి. కేసీఆర్ వ్యాఖ్యలకు అర్ధమిదే అయితే ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ళు మాత్రం కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉన్నదెప్పుడు అనే సందేహం వస్తుంది. సచివాలయంకు కూడా వారాల తరబడి వచ్చేవారు కాదు. మంత్రులు, ఎంఎల్ఏలు ఎంతప్రయత్నించినా కలిసేవారు కాదు. ఇపుడు జనాలిచ్చిన ప్రధాన ప్రతిపక్ష నేత హోదాకు కూడా కేసీఆర్ న్యాయంచేయటంలేదు. వారాలతరబడి ఫామ్ హౌస్ లోనే ఉండిపోయేవారు. ఈ విషయంలో కేసీఆర్ తో పోల్చితే రేవంత్ నూరురెట్లు బెటరని జనాలు అనుకుంటున్నారు.

ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గరనుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించిన దాఖలాలు ఒక్కటంటే ఒక్కటికూడా లేదు. మూసీనది ఫ్రక్షాళన(Musi River), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(HCU)లో 400 ఎకరాల వివాదం, ఫార్మాసిటి కోసం భూముల సేకరణ వివాదంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish) క్షేత్రస్ధాయిలో ఆందోళనలకన్నా సోషల్ మీడియాలో కనిపించిందే ఎక్కువ. వివాదాలు లేకుండా వ్యవహారాలు నడపగలిగిన మూసీనది ప్రక్షాళన, హెచ్సీయూ భూములు, లగచర్ల భూసేకరణ విషయాల్లో రేవంత్ సర్కార్ బోర్లాపడింది. గోటితో పోయేదాన్ని రేవంత్(Revanth) ప్రభుత్వం గొడ్డలిదాకా తెచ్చుకున్నది. ఇలాంటి వివాదాల్లో కేటీఆర్, హరీష్ ఎక్కువగా సోషల్ మీడియాలో అయినా కనిపించారు కాని కేసీఆర్ అయితే అసలు మాటమాత్రంగా కూడా మాట్లాడలేదు. ఎంతసేపు జనాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారు..ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ దే ఘనవిజయం అని నేతల సమీక్షల్లో చెప్పుకుని కాలక్షేపం చేస్తున్నారు.

సిల్వర్ జూబ్లీ సంవత్సరం కాబట్టి బహిరంగసభ నిర్వహిస్తున్నారు కాని దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అనే సందేహాలు కూడా పెరిగిపోతోంది. ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఏడాదిన్నర మాత్రమే అయ్యింది. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళుంది. ఇపుడు ఎన్నిలక్షలమందిని సమీకరించినా, బహిరంగసభను ఎంతగ్రాండుగా నిర్వహించినా జనాలకు ఎన్నికల సమయానికి ఇదంతా గుర్తుంటుందా ? అన్నదే అనుమానం. మరి బహిరంగసభలో కేసీఆర్ ఏమి మాట్లాడుతారో ? జనాలకు ఏమి పిలుపిస్తారో చూడాల్సిందే.

బహిరంగసభ వేస్ట్

బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభల వల్ల ఏమీ ఉపయోగం ఉండదని కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తక్కెళ్ళపల్లి కుమార్ రావు అన్నారు. పదేళ్ళు కేసీఆర్ తెలంగాణను భ్రష్టుపట్టించి ఇపుడు బహిరంగసభ పెడితే ఏమి ఉపయోగం అని ప్రశ్నించారు. అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దెబ్బతీసి ప్రతిపక్షంలోకి రాగానే గోలచేయటం వల్ల ఏమి ఉపయోగమో కేసీఆరే చెప్పాలన్నారు. కేసీఆర్ మీదున్న కేసులను తమ ప్రభుత్వం యాక్టివేట్ చేస్తే జన్మలో బయటకు రాలేరని అన్నారు. కూతురు కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంటే బయటకు తీసుకొచ్చే దమ్ము కూడా కేసీఆర్ లో కనబడలేదని ఎద్దేవాచేశారు. కేసీఆర్ లో నీతి, నిజాయితీ లేదని. కేసీఆర్ ఎన్ని సభలు పెట్టినా జనాలు నమ్మరని చెప్పారు. ఫామ్ హౌస్ లో పడుకుంటే జనాలు నమ్ముతారా ? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు మళ్ళీ పూర్వవైభవం వస్తుందని తానైతే నమ్మటంలేదని కుమార్ రావు చెప్పారు.

జనాలు బీఆర్ఎస్ ను నమ్మటంలేదు

బీఆర్ఎస్ ను జనాలెవరూ నమ్మటంలేదని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంఎల్సీ ఎన్ రమచంద్రరావు చెప్పారు. జనాలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఉందికాబట్టే బహిరంగసభను వరంగల్లో పెడుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో పోటీ కాంగ్రెస్-బీజేపీ మధ్య ఉంటుంది కాని బీఆర్ఎస్ ఎక్కడా కనబడదని మాజీ ఎంఎల్సీ అన్నారు. నిజంగానే బీఆర్ఎస్ కు అంత సీనుంటే మొన్ననే జరిగిన మూడు ఎంఎల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీచేయలేదని ప్రశ్నించారు. ప్రధానప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఫెయిలైంది కాబట్టే జనాలంతా బీజేపీ వైపు చూస్తున్నారని రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ బహిరంగసభను ఎందుకు నిర్వహించటంలేదో ముందు చెప్పాలని కేసీఆర్ ను రామచంద్రరావు ప్రశ్నించారు.

Read More
Next Story