
తీర్మానం చేసినంత మాత్రాన బీసీలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడతారా ?
తొందరలోనే జరగబోతున్న స్ధానికసంస్ధల ఎన్నికల్లో లబ్దిపొందటమే. ఏ పార్టీకైనా, ప్రభుత్వానికి అయినా ఎన్నికల్లో లబ్దిపొందటమే కదా అంతిమ లక్ష్యం
ఇపుడీ ప్రశ్నే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ప్రశ్న చూడటానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కాని సమాధానం చెప్పటమే కష్టం. బీసీలకు విద్య, ఉద్యోగ, స్ధానికసంస్ధల్లో 42 శాతం రిజర్వేషన్లు వర్తింపచేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాకరకాల కారణాలతో బిల్లు అన్నీ పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా తీర్మానంపొందింది. అసెంబ్లీలో తీర్మానమైన బిల్లును ఆమోదంకోసం రాష్ట్రప్రభుత్వం కేంద్రంలోని నరేంద్రమోడీ(Narendra Modi) ప్రభుత్వానికి పంపుతుంది. అసెంబ్లీలో తీర్మానం అయినంత మాత్రాన బీసీ రిజర్వేషన్ బిల్లు(BC Reservation Bill) చట్టమైనట్లు కాదు. తమకు అందిన తీర్మానాన్ని కేంద్రం న్యాయసమీక్షకు పంపుతుంది. తర్వాత క్యాబినెట్ లో చర్చిస్తుంది. ఆ తర్వాత పార్లమెంటులో చర్చకు పెట్టి తీర్మానం పొందితే రాష్ట్రపతి సంతకం కోసం పంపుతుంది. రాష్ట్రపతి సంతకం అయినతర్వాతే బీసీ రిజర్వేషన్ బిల్లు చట్టం అయినట్లు లెక్క.
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) తీర్మానం కేంద్రం దగ్గర చట్టం అవ్వాలంటే మామూలు విషయంకాదు. ఇప్పటి పరిస్ధితుల ప్రకారం చూస్తే మోడీ ప్రభుత్వం ఈ తీర్మానానికి సానుకూలంగా స్పందించే అవకాశాలు తక్కువ. ఎందుకంటే రాజకీయ వైరుధ్యాలు, న్యాయపరమైన సమస్యలు, గతంలో సుప్రింకోర్టు తీర్పుల్లాంటి అనేక కారణాలు అవరోధాలుగా నిలబడుతున్నాయి. అయితే ఇవన్నీ తెలీకకాదు రేవంత్(Revanth) ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును టేకప్ చేసింది. తెలిసినా ఎందుకు టేకప్ చేసిందంటే అచ్చంగా రాజకీయ లబ్దికోసమే అనే సమాధానం వినిపిస్తుంది. ‘లాభంలేనిదే వ్యాపారి వరదన కూడా పోడ’నే సామెత అందరికీ తెలిసిందే. అదేపద్దతిలో లాభం ఉంటుందన్న ఆలోచనతోనే రేవంత్ ప్రభుత్వం కూడా ఇపుడు బీసీ రిజర్వేషన్ బిల్లును టేకప్ చేసింది.
రేవంత్ ప్రభుత్వం ఆశిస్తున్న ఉపయోగం ఏమిటి ? ఏమిటంటే, తొందరలోనే జరగబోతున్న స్ధానికసంస్ధల ఎన్నికల్లో లబ్దిపొందటమే. ఏ పార్టీకైనా, ప్రభుత్వానికి అయినా ఎన్నికల్లో లబ్దిపొందటమే కదా అంతిమ లక్ష్యం. అదేపద్దతిలో స్ధానికసంస్ధల ఎన్నికల్లో గెలుపుకోసమే రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్ట్రోక్ కొట్టింది. మరి మాస్టర్ స్ట్రోక్(Master Stroke) తో బాల్ బౌండరీ లైన్ దాటి సిక్సర్ వస్తుందా ? లేకపోతే బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ అవుట్ అవుతుందా అన్నది చూడాలి. ఈ నేపధ్యంలోనే కొందరు బీసీ సంఘాల నేతలు, బీసీ అంశాలపై పోరాటాలు చేస్తున్న మేథావులతో తెలంగాణ ఫెడరల్ మాట్లాడింది. వాళ్ళ అభిప్రాయాలు, మాటలు క్లుప్తంగా...
చిరంజీవులు తొగరాల..బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు బీసీలు కాంగ్రెస్ కు ఫేవర్ గా ఉంటారని అభిప్రాయాపడ్డారు. ఎంఎల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయిందంటే ఆ పరిస్ధితులు వేరని చెప్పారు. తెలంగాణ నుండి పంపిన బిల్లును కేంద్రం ఏమిచేస్తుందనేది చూడాలి. ఎవరు అయితే మద్దతివ్వరో వాళ్లకు బీసీలు వ్యతిరేకం అవుతారు. రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీసీలు మద్దతుగా నిలబడతారని చిరంజీవులు అభిప్రాయపడ్డారు.
మధుసూదనాచారి..నవసంఘర్షణ సమితి, ఆల్ ఇండియా కోఆర్డినేటర్
బీసీలు కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటారు. తెలంగాణ అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని కేంద్రం 9వ షెడ్యూల్ లో చేర్చి వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ లో పెట్టకపోతే రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న నిబంధన అడ్డుపడుతుందని చెప్పారు. బిల్లుకు కేంద్రం సహకరించకపోతే బీసీలు వ్యతిరేకం అవుతారని హెచ్చరించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పాత్ర నామమాత్రమే కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరంలేదన్నారు.
మేకపోతుల నరేంద్రగౌడ్..తెలంగా బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు
అసెంబ్లీ చేసిన తీర్మానం రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ కు కచ్చితంగా ఉపయోగపడుతుందన్నారు. గతంలో ఎవ్వరూ పట్టించుకోని బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని ఇపుడు కాంగ్రెస్ పట్టించుకుంది కాబట్టి బీసీలు మద్దతుగా నిలబడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్రం 200 శాతం ఆమోదించదన్నారు. రాహుల్ ప్రధానమంత్రి అయితే కాని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమల్లోకి రాదని చెప్పారు. కేంద్రం ఇడబ్ల్యూఎస్ పద్దతిలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని సూచించారు.
కే. కొండల్రావు..హైకోర్టు అడ్వకేట్
విద్య, ఉద్యోగ, స్ధానికసంస్ధల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తీర్మాన్ని అసెంబ్లీ ఆమోదించటం సంతోషంగా ఉందన్నారు. అయితే ఈ బిల్లును కేంద్రం ఆమోదిస్తేనే చట్టంగా మారుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును నరేంద్రమోడీ ప్రభుత్వం ఆమోదిస్తుందని తాను అనుకోవటంలేదన్నారు. తీర్మానం చేయటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేవలం హడావుడి మాత్రమే చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ తీర్మానం న్యాయసమీక్షలో నిలవదని బల్లగుద్ది మరీ చెప్పారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న సుప్రింకోర్టు తీర్పులను బీసీలు ఎందుకు మరచిపోతున్నారో అర్ధంకావటంలేదన్నారు. తీర్మానం చేయటంవరకు ఓకేనే కాని సంబరాలు చేసుకునేందుకు ఇందులో ఏమీలేదన్నారు. కేంద్రం అంగీకరించి పార్లమెంటులో చర్చ జరిపి ఆమోదించి రాష్ట్రపతి సంతకం అయితేనే చట్టం అమల్లోకి వస్తుందని గుర్తుచేశారు. కులగణన తమ విధానం కాదని మోడీ ప్రభుత్వం 2021, 23, సెప్టెంబర్ లో సుప్రిం కోర్టులో అఫిడవిట్ వేసిందని చెప్పారు. అప్పటి అఫిడవిట్ ప్రకారం చూస్తే అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్రం మద్దతిచ్చేది అనుమానమే అన్నారు. కచ్చితంగా అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించదన్నారు. రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో అసెంబ్లీ తీర్మానం నేపధ్యంలో కాంగ్రెస్ కు బీసీలందరు గంపగుత్తగా మద్దుగా ఉంటారనే గ్యారెంటీ లేదని అభిప్రాయపడ్డారు.
బూర నర్సయ్య గౌడ్..మాజీ ఎంపీ
అసెంబ్లీ తీర్మానం చేసిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు నిబద్ధత లేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన బీసీ లెక్కల్లో స్పష్టతలేదని మండిపడ్డారు. 56 శాతం జనాభాను 46 శాతానికి తగ్గించేశారని ఆరోపించారు. అసెంబ్లీలో కులగణన వివరాలు ఇవ్వాలని బీజేపీ ఎంఎల్ఏలు అడిగినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కులగణన సరిగా చేయకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు తీర్మానం చేయటంవల్ల ఎలాంటి ఉపయోగంలేదన్నారు. డిన్నరుకు కొంగను పిలిచి పళ్ళెంలో పాయసం పోసినట్లుంది బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు అని బూర ఎద్దేవాచేశారు. కేవలం రాజకీయ లబ్దికోసమే రిజర్వేషన్ బిల్లు పెట్టినట్లు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమైతే వివిధ సామాజికవర్గాల జనాభా 110 శాతం ఉన్నట్లు వ్యంగ్యంగా అన్నారు. కేంద్రాన్ని బ్లేమ్ చేయటం కోసమే ఈ తీర్మానం చేసినట్లుందని అనుమానం వ్యక్తంచేశారు. అన్నీరంగాల్లోను రేవంత్ విఫలమయ్యారు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్లు ఆరోపించారు. డ్రామాలవల్ల అంతిమంగా నష్టపోయేది తెలంగాణానే అన్నారు. బీసీల్లో నుండి మైనారిటిలను తీసేయాలని మొదటినుండి బీజేపీ చెబుతున్న విషయాన్ని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ కు మద్దతివ్వరని చెప్పారు. అసెంబ్లీ చేసిన తీర్మానం న్యాయసమీక్షలో నిలబడదని బూర నర్సయ్య గౌడ్ కచ్చితంగా చెప్పారు.