ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ పీఠం టీడీపీ లాక్కోనుందా?
ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి ముప్పు పొంచి ఉంది. ఎప్పుడు వైఎస్సార్సీపీ ఆ పదవిని కోల్పోతుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా బూచేపల్లి వెంకాయమ్మ ఉన్నారు. 2021 మార్చిలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో వైఎస్సార్సీపీ గెలిచింది. వెంకాయమ్మను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు. పూర్వపు ప్రకాశం జిల్లాలో 56 మండలాల్లో వైఎస్సార్సీపీ తరపున జడ్పిటీసీలుగా గెలుపొందారు. టీడీపీ నుంచి ఒక్కరు కూడా గెలవలేదు. పూర్తి మెజారిటీ నేటికీ జిల్లా పరిషత్ లో వైఎస్సార్సీపీకి ఉంది. అయినా టీడీపీ ప్రకాశం జిల్లా పరిషత్ పీఠంపై కన్నేసింది. ఎలాగైనా పదవిని లాక్కోవాలనే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ మిగిలిన ఎమ్మెల్యేలతో ఈ విషయమై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ వారు చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే కనీసం 29 మంది జడ్పీటీసీల మద్దతు కావాల్సి ఉంటుంది. ఒక్కో జడ్పీటీసీకి ఎంత మొత్తం డబ్బులు ఇస్తే టీడీపీ వైపు వస్తారు. ఇప్పటికే టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న వారు ఎవరు? వైఎస్సార్సీపీని వీడేందుకు ఎంత మంది ఉన్నారనే లెక్కలు వేసే పనిలో జిల్లా పార్టీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే హోదా అనుభవిస్తున్న లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శిలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. నర్సరావుపేటలో ఉంటున్న గొట్టిపాటి లక్ష్మికి టీడీపీ టిక్కెట్ ఇచ్చి దర్శి నుంచి పోటీకి దింపారు. దర్శి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. ఇక్కడి నుంచి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ సీట్లు ఉంటే దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందింది. మిగిలిన ఆరు సీట్లలో టీడీపీ గెలిచింది. ఇద్దరు మంత్రులు మట్టికరిచారు. పూర్వపు ప్రకాశం జిల్లాలో ఉన్న అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోనూ టీడీపీ వారే గెలిచారు. అందువల్ల ఆయా నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించి జడ్పీటీసీలను ఆకట్టుకుని టీడీపీలోకి తీసుకొచ్చే విషయంలో పూర్తిస్థాయిలో చొరవ తీసుకోవాలని అధిష్టానం చెప్పడంతో ఆ పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం. దర్శి నియోజకవర్గంలో లక్ష్మి నియోజకవర్గ ఇన్చార్జిగా అధికార పార్టీ తరపున ఉండటంతో ఎమ్మెల్యేకంటే పవర్ ఫుల్ గా పనులు చేయించే పనిలో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తనకు ఉన్న ఆర్థిక అంగబలం ఉపయోగించి ఆమెను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న లక్ష్మి మాటలకే విలువ ఇస్తుండటంతో శివప్రసాద్ రెడ్డి ఒకింత అధికారులపై కోపం ప్రదర్శిస్తున్నారని సమాచారం.
తల్లి పవర్ తీసేస్తే కొడుకు డమ్మీ అవుతాడా?
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న బూచేపల్లి వెంకాయమ్మ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి కావడం వల్ల బూచేపల్లి వెంకాయమ్మను ఆ పదవి నుంచి దించితే శివప్రసాద్ రెడ్డి కాస్త వెనుకడుగు వేస్తాడని, పైగా లక్ష్మికి కూడా క్యాబినెట్ హోదా పదవి ఇచ్చినట్లు అవుతుందని టీడీపీ వారు భావిస్తున్నారు. శివప్రసాద్ రెడ్డి వైద్య శాస్త్రం అభ్యసించినందున తెలివి తేటల్లో ఎవ్వరికీ తీసిపోలేదని, అందువల్ల ఆయనను ఢీకొనడం అంత తేలిక కాదని వైఎస్సార్సీపీలోని ఒక వర్గం చెబుతోంది.
వైఎస్సార్సీపీలో విసిగిన వారు టీడీపీలో చేరేందుకు సిద్ధం
వైఎస్సార్సీపీ జడ్పిటీసీల్లో కొందరు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సుమారు పది మంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని, వీరికి తోడు మరో 20 మందిని లాగితే జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా టీడీపీకి అవకాశం వస్తుందనే ఆలోచనలో టీడీపీ వారు ఉన్నారు. వైఎస్సార్సీపీలో గెలిచినా పార్టీ వల్ల మాకు ఒరిగిందేమీ లేదని, కనీసం నా అనుకున్న వాళ్లకు ఒక్క ప్రభుత్వ పథకాన్ని కూడా స్వయంగా అందించలేక పోయామనే ఆవేదన జడ్పీటీసీల్లో ఉంది. వారిలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు టీడీపీ వారు సిద్ధమయ్యారు.
గొట్టిపాటి లక్ష్మికి చైర్ పర్సన్ పదవి
దర్శి టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మికి ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి దక్కేలా అద్దంకి ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పావులు కదుపుతున్నారు. వరుసకు కూతురైన లక్ష్మిని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్థానంలో చూడాలని భావిస్తున్నట్లు రవికుమార్ సన్నిహితులు చెబుతున్నారు. స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసింహారావు కుమార్తె గొట్టిపాటి లక్ష్మి కావడం విశేషం. ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవిని చేజిక్కించుకోవడంలో మాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగే ఆలోచనలో ఉన్నారు.
పర్చూరు నుంచి లక్ష్మిని పోటీ చేయించాలనే ఆలోచన...
గొట్టపాటి లక్ష్మిని పర్చూరు మండల పరిషత్ నుంచి జడ్పిటీసీగా పోటీ చేయించేందుకు టీడీపీ వారు నిర్ణయం తీసుకున్నారు. పర్చూరు జడ్పిటీసీగా ఉన్న మహిళ గుండెపోటుతో ఆరు నెలల క్రితం మరణించారు. అందువల్ల ఆ స్థానం నుంచి లక్ష్మిని పోటీ చేయించి గెలిపించుకోవచ్చని, ప్రస్తుతం జిల్లా పరిషత్ లో వైఎస్సార్సీపీ సభ్యులు మెజారిటీతో ఉన్నందున వారిని తమ వైపు తిప్పుకుంటే సరిపోతుందని నాయకులు అంటున్నారు. అయితే లక్ష్మికి ఓటు నర్సరావు పేటలో ఉంది. ఆ ఓటును పర్చూరుకు మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యూహంలో టీడీపీ విజయం సాధిస్తుందా? వైఎస్సార్సీపీ తన బలగాన్ని కాపాడుకుంటుందా? లేదా? వేచి చూడాల్సి ఉంది.