అనకాపల్లి పార్లమెంటులో మూడు గుర్తులకు ఓట్లు వేయగలరా?
x

అనకాపల్లి పార్లమెంటులో మూడు గుర్తులకు ఓట్లు వేయగలరా?

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మరో చిక్కు వచ్చి పడింది. తమ పార్టీ గుర్తులను ప్రజలు గుర్తుంచుకుంటారా? గుర్తుంచుకుని ఓట్లు వేస్తారా? అన్నది చిక్కుముడిలా మారింది.



(శివరామ్)

బెల్లం కుండగా పేరున్న అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులకు కొత్త గుబులు పట్టుకుంది. సీటు సంపాదించడమే పెద్ద కష్టమైతే ఇప్పుడు ఓటర్లకు మూడు గుర్తులు గుర్తుండేలా చేయడం తలకు మించిన భారంగా కనబడుతోంది.

పొత్తులో భాగంగా అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి. అనకాపల్లి పార్లమెంటు నుంచి బీజేపీ బరిలోకి దిగింది. పెందుర్తి, అనకాపల్లి, యలమంచలి అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల, పాయకరావు పేటల నుంచి తెలుగుదేశం బరిలోకి దిగుతుంది. దీంతో అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ఓటర్లు ఒక ఓటు కమలానికి, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సైకిల్, గాజు గ్లాసు గుర్తులకు మరో ఓటు వేయాలి. అసలే గ్రామీణ ప్రాంతం. ఇంత గందరగోళం మధ్య ఓటర్లు ఏం చేస్తారోనని కూటమి అభ్యర్థులు కంగారు పడుతున్నారు.

కమలం గుర్తు గుర్తుండేనా?

అనకాపల్లి పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్దిగా సీనియర్ నేత సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. గతంలో ఇక్కడ బీజేపీ పోటీ చేసినప్పటికీ నామమాత్రమే. పొత్తులో ఎప్పుడూ ఆ పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థి పోటీ చేయలేదు. దీంతో గ్రామాలతో , గిరిజన గూడేలతో కూడిన మారుమూల ప్రాంతాలకు కమలం గుర్తును చేరవేసేదెలా అనే సంశయం పట్టుకుంది.

3 అసెంబ్లీల పరిధిలోని బ్యాలెట్‌లో సైకిల్ ఉండదు

అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని పెందుర్తి, అనకాపల్లి, యలమంచలి అసెంబ్లీ స్దానాలలో జనసేన పోటీకి దిగుతున్నందున ఇక్కడ బ్యాలెట్ పేపర్‌లలో సైకిల్ గుర్తే కనిపించదు. సంప్రదాయ తెలుగుదేశం ఓటర్లు ఇక్కడ తమ ఓటును గ్లాసు గుర్తుకు, కమలం గుర్తుకు బదిలీ చేయాలి. అది ఎంతవరకు సాధ్యమౌతుందో వేచి చూడాల్సిందే.

అభ్యర్ధికంటే కమలం గుర్తుకే ప్రచారంలో ప్రాధాన్యత..

అనకాపల్లిలో కమలం గుర్తును ప్రజల హృదయాల్లోకి తీసుకువెళ్లకపోతే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయానికి వచ్చిన బీజేపీ నేతలు ప్రస్తుతం ఇక్కడ సీఎం రమేష్ అభ్యర్ధిత్వం కంటే కమలం గుర్తుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రచారంలో సీఎం రమేష్ ఫోటోలు, బీజేపీ జెండాలు తగ్గించి కమలం గుర్తు వున్న ప్లకార్డులను ప్రచారంలోకి దించారు. కమలం గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా మహిళా బృందాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో తిప్పుతున్నారు.

చెరువులో పువ్వు, తామర పువ్వు...

ఇక గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రచారానికి వెళ్లేప్పుడు కమలం అంటే తెలియదన్న అభిప్రాయంతో మన చెరువుల్లో ఉండే పువ్వు గుర్తుకు , తామర పువ్వు గుర్తుకు ఓటు వేయాలంటూ మోటివేట్ చేస్తున్నారు. కమలం గుర్తును ఇంటింటికి తీసుకువెళ్లి చూపుతున్నారు.

కమలం విసనకర్రలు..

కమలం గుర్తును పోలిన విసనకర్రలను గ్రామాల్లో పెద్ద సంఖ్యలో పంచుతున్నారు. కమలం ఆకారంలో కత్తిరించిన ప్లాస్టిక్ షీట్‌లను విసనకర్రలుగా మలిచి పంచుతున్నారు. దీని ద్వారా సింబల్ త్వరగా ప్రజల్లోకి వెళుతుందని నమ్ముతున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్దులు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఫొటోలతో విసనకర్రలు పంచినందున కమలం విసన కర్రల పంపిణీపై అభ్యంతరాలు వ్యక్తం కావడంలేదు.

గ్లాస్ కు ఇబ్బంది లేనట్లే...

జనసేన పోటీ చేసే మూడు నియోజకవర్గాలు విశాఖకు అనుకొని ఉన్నా అవి విశాఖలో కొంత మేర భాగమైన పట్టణ ప్రాంతాలు కావడంతో ఆ పార్టీ అభ్యర్దులకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకావడం లేదు. గత ఎన్నికల్లో జనసేన ఆ నియోజక వర్గాల్లో పోటీ చేసి ఒక్కో నియోజక వర్గంలో సుమారు 20 వేల చొప్పున ఓట్లు సాధించింది. దీంతో గుర్తు బాగానే జనంలోకి వెళ్లింది. వచ్చిన ఇబ్బంది అంతా కమలం గుర్తుతోనే అని బీజేపీ నేతలు భావిస్తున్నారు. గుర్తును జనంలోకి తీసుకువెళ్లేందుకు కుస్తీ పడుతున్నారు.


Read More
Next Story