వైసీపీ మళ్లీ పవర్లోకి రాదని టీడీపీ గ్యారంటీ ఇస్తుందా?
బాండ్ పేపర్‌పై సంతకం పెట్టిస్తేనే పెట్టుబడులు పెడతారా? ఏ ప్రభుత్వమైనా అలాంటి భరోసా ఇస్తుందా? ఆసక్తికర అంశానికి తెరతీసిన ఐటీ మంత్రి లోకేష్.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అధికారం ఒక్కోసారి ఒక్కొక్కరి సొంతం కావడమూ సహజమే. కానీ భవిష్యత్తులో ఫలానా పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? ఇవ్వగలరా? ఇస్తే దానికి నిబద్ధత, చట్టబద్ధత ఉంటుందా? ఇప్పుడు ఇదంతా ఎందుకనుకుంటున్నారా? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మునుపెన్నడూ లేనివిధంగా ఒక ఆసక్తికర చర్చకు తెరతీశారు. అదేమిటంటే? దేశవిదేశాల్లోని పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాదన్న గ్యారంటీ ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి సరికొత్త షరతు పెడుతున్నారట! పైగా బాండు పేపర్ పై సంతకం కూడా పెట్టి ఇవ్వాలట! అలా అయితేనే ఏపీలో పెట్టుబడులకు ముందుకొస్తామని, లేదంటే రాబోమని కుండబద్దలు కొడుతున్నారట! ఇది వినడానికి వింతగాను, విచిత్రంగానూ ఉన్నా ఈ విషయాన్ని వాళ్లూ, వీళ్లూ కాదు.. సాక్షాత్తూ మంత్రి లోకేషే వెల్లడించారు. ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన మీడియా సమక్షంలోనే తేటతెల్లం చేశారు.
ఇంతకీ లోకేష్ ఏమన్నారంటే..
'ఇటీవల నేను వెళ్లి ఓ కంపెనీ వారిని కలిస్తే.. వారు ఒక్కటే అడుగుతున్నారు. మీరు హామీ ఇస్తారా? మళ్లీ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవడని. నన్ను అడిగారు. అదేంటీ ఇట్లా అంటున్నారని ఆశ్చర్యంగా అడిగా. దానికి వారు.. గతంలో ఇబ్బంది పడ్డాం కదా? అని అంటున్నారు. గతంలో రెన్యూవబుల్ ఎనర్జీ పీపీఏలను రద్దు చేశారు. లూలూను, అనేక కంపెనీలను తరిమేశారు. కియా మోటార్స్ను కూడా బాగా ఇబ్బంది పెట్టారు. మీరు గ్యారంటీ ఇస్తారా? మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే వ్యక్తి, ఆ పార్టీ (వైసీపీ) మళ్లీ అధికారంలోకి రాదని.. బాండు పేపర్ మీద కూడా సంతకం పెట్టమంటున్నారు. అప్పుడే మీ రాష్ట్రంలో మేం పెట్టుబడులు పెడతాం అంటున్నారు' అని మంత్రి లోకేష్ వివరించారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని, అన్ని రంగాలను దెబ్బతీసిందని ఆరోపణలు చేస్తూ ఈ పెట్టుబడుదారుల గ్యారంటీ అంశాన్ని లోకేష్ తెరపైకి తెచ్చారు. అందువల్లే ఏపీలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడం లేదన్నది ఆయన అభిప్రాయంగా ఉంది. అయితే వాళ్లు (పెట్టుబడుదారులు, పారిశ్రామికవేత్తలు) అడుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్లోని కూటమి (ఎన్డీయే) ప్రభుత్వం.. భవిష్యత్తులో మరోసారి వైసీపీ ప్రభుత్వం రాదని, వైఎస్ జగన్ సీఎం కాలేరని గ్యారంటీ ఇస్తామని గాని, ఇవ్వలేమని గాని చెప్పారో లేదో లోకేష్ చెప్పకుండానే ఆ మీడియా మీటన్ను ముగించేశారు.
అలా ఎవరైనా అడుగుతారా?
లోకేష్ చెప్పిన మాటలు రాజకీయ విశ్లేషకులను, మేథావి వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక పార్టీ అధికారంలోకి రాదని మరో పార్టీ ఎలా గ్యారంటీ ఇస్తుందని వీరు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్న వారు అలా హామీ ఇవ్వడం గాని, దానిని బాండు పేపరుపై రాసివ్వడం కుదరదని, దానికి నిబద్ధత గాని, చట్టబద్ధత గాని ఉండదని వీరు పేర్కొంటున్నారు. అంతేకాదు.. ఐదేళ్ల తర్వాత కూడా తమ కూటమి ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని వీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? అని నిలదీస్తున్నారు. ఒకవేళ ఇప్పుడేదో పెట్టుబడుల కోసం రాసిస్తే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటి? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు భవిష్యత్తులో తిరిగి అధికారంలోకి రావని, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు ఐదేళ్ల అనంతరం కూడా ప్రభుత్వంలోనే కొనసాగుతామని గ్యారంటీలు ఇవ్వడం, బాండు పేపర్లపై రాసివ్వమని అడగడం రెండూ సరికాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యానాలు రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని అంటున్నారు. పదులు, వందలు, వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే వారు తమ ప్రయోజనాలనే చూసుకుంటారు తప్ప అధికారంలో ఎవరున్నారో చూడరని వీరు పేర్కొంటున్నారు.
'రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఓ వ్యక్తిగా గాని, ఓ పార్టీ గాని అధికారంలోకి రాదని గ్యారంటీ అడగడమే కాదు.. అడుగుతున్నారని చెప్పడమూ తప్పే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఆ ప్రభుత్వాలు పాలసీలను మారుస్తుంటాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు రాలేదనడం సరికాదు. అదానీకి చెందిన పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు, వైజాగ్లో అదానీ డేటా సెంటర్, కడపలో జిందాల్ స్టీల్ ప్లాంట్ వంటి వి వచ్చాయి. మేమే శాశ్వతంగా ప్రభుత్వంలో ఉంటామని లోకేష్ రాసివ్వగలరా?' చట్టాలు, ప్రభుత్వ పాలసీలు సమర్థవంతంగా ఉంటే పెట్టుబడులకు ముందుకొచ్చే పరిస్థితి ఉంటుంది తప్ప పార్టీలను చూసో, వ్యక్తులను చూసో కాదు' అని భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. 'ఫలానా పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు హామీ ఇవ్వడమనేది అత్యంత హాస్యాస్పదం. అలా చెప్పడం పెట్టుబడులు రాకపోవడానికి వేరే కారణాలు వెతుక్కోవడమే. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇన్వెస్టర్లకు భరోసా కలిగించి
పెట్టుబడులను ఆకర్షించాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. పెట్టుబడులు వస్తే తమ ఘనత, రాకపోతే గత ప్రభుత్వ తప్పిదాలనే భావన కలిగించేలా, రాజకీయ అపరిపక్వతలా ఉన్నాయనిపిస్తోంది మంత్రి లోకేష్ మాటలు చూస్తే. ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకే ఇన్వెస్టర్లు గ్యారంటీ అడుగుతున్నారన్న భావన కలుగుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇన్వెస్టర్ల సదస్సులు జరిగాయి.. ఎన్ని లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు జరిగాయి? ఎన్ని కార్యరూపం దాల్చాయి? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి? అని ఏయూ జర్నలిజం విభాగపు పూర్వ అధిపతి ప్రొఫెసర్ బాబీవర్ధన్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు. 'ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే వారు అక్కడ తమకు లాభదాయకంగా ఉంటుందా? లేదా? అని చూస్తారే గాని ఫలానా వారే అధికారంలో ఉండాలని, ఫలానా వారు మళ్లీ పవర్లోకి రాకూడదని హామీలు అడగరు. ప్రజాస్వామ్య దేశాల్లో అది అసంభవం. పెట్టుబడిదార్లు అలా అడిగినట్టు చెప్పడం హాస్యాస్పదమే కాదు.. తప్పు కూడా. మంత్రి లోకేష్ రాజకీయ అపరిపక్వతతో అలా మాట్లాడి ఉంటారనిపిస్తోంది' అని ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ కేఎస్ చలం అభిప్రాయపడ్డారు.