స్ట్రీట్‌ వెండర్లకు తిరిగి స్టాళ్లు కేటాయిస్తారా?
x
విశాఖలో బుధవారం ఆపరేషన్‌ లంగ్స్‌లో వీధి దుకాణాల తొలగింపు

స్ట్రీట్‌ వెండర్లకు తిరిగి స్టాళ్లు కేటాయిస్తారా?

విశాఖలో వివాదాస్పదంగా మారిన వీధి దుకాణాల తొలగింపుపై జీవీఎంసీ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే వారికి వెండర్‌ కార్డులు, హాకర్‌ జోన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.


విశాఖ మహా నగరంలో ఐదు రోజులుగా ఆపరేషన్‌ లంగ్స్‌ అలజడి రేగుతూనే ఉంది. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలో ఫుట్‌ పాత్‌ల పైన, రోడ్ల పక్కన ఇబ్బడి ముబ్బడిగా ఉన్న చిన్న దుకాణాలు, బడ్డీలను తొలగించే ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. అనూహ్యగా చేపట్టిన ఈ ఆపరేషన్‌తో వేలాది మంది వీధి వ్యాపారులు రోడ్డున పడ్డారు.

విశాఖలో బుధవారం ఆపరేషన్‌ లంగ్స్‌లో వీధి దుకాణాల తొలగింపు

వీరిలో అసలు సిసలైన చిరు వ్యాపారులతో పాటు అడ్డదారుల్లో వ్యాపారాలు సాగిస్తున్న వారు, ప్రజా ప్రతినిధుల బినామీలు కూడా ఉన్నారు. మరోవైపు విశాఖ నడిబొడ్డున సెంట్రల్‌ పార్కు వెనక అనధికారికంగా నడుస్తున్న నైట్‌ ఫుడ్‌ కోర్టును కూడా తొలగించారు. ఇప్పటిదాకా 3,500కు పైగా దుకాణాలు/బడ్డీలను తొలగించినట్టు జీవీఎంసీ అధికారులు ప్రకటించారు. ఈ ఆపరేషన్‌ లంగ్స్‌ 2,0ను ఇంకా కొనసాగిస్తున్నారు.

వీధి వ్యాపారులకు మద్దతు తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

కొనసాగుతున్న ఆందోళనలు

జీవీఎంసీ ఆపరేషన్‌ లంగ్స్‌కు వ్యతిరేకంగా బాధిత చిరు వ్యాపారులతో పాటు వారికి అండగా వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అండగా నిలుస్తున్నారు. వారికి మద్దతుగా వీరూ ఆందోళనలు చేస్తున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వీధి వ్యాపారులను ఉన్నపళంగా రోడ్డున పడేసి వారి పొట్ట కొట్టడం అన్యాయమంటూ వీరు రోడ్డెక్కి నిరసనలు చేపడుతున్నారు. దీంతో విశాఖలో చిరు వ్యాపారుల ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి.

యూసీడీ పీడీ సత్యవేణి

ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం : జీవీఎంసీ పీడీ
జీవీఎంసీ పరిధిలో ఫుట్‌పాత్‌లు, రోడ్లు, ప్రధాన జంక్షన్లలో తాత్కాలిక ఆక్రమణలను తొలగించి, ప్రజలకు రక్షణ, సౌకర్యాల కల్పనకు ఆపరేషన్‌ లంగ్స్‌ కార్యక్రమాన్ని చేపట్టామని జీవీఎంసీ తెలిపింది. ఈ మేరకు యూసీడీ పీడీ పీఎం సత్యవేణి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించి వారికి వ్యాపార అవకాశాలు, జీవనోపాధి కల్పిస్తాం. ఏపీ వీధి విక్రయ విధాన మార్గదర్శకాల్లో అర్హులుగా గుర్తింపు పొందిన వారి సంక్షేమానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. హాకర్ల జోన్లను ఏర్పాటు చేసి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. ఇప్పటికే 21 విక్రయ జోన్లను గుర్తించాం. మరిన్ని విక్రయ జోన్లను గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తాం. ఆపరేషన్‌ లంగ్స్‌పై వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మొద్దు.’ అని ఆమె వివరించారు.

ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌

మళ్లీ షాపులు కేటాయిస్తాంః ఎమ్మెల్యే వంశీకృష్ణ
మరోవైపు తొలగించిన షాపుల స్థానంలో వీధి వ్యాపారులకు, నైట్‌ ఫుడ్‌ కోర్టు నిర్వాహకులకు తిరిగి కేటాయిస్తామని జనసేనకు చెందిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ తెలిపారు. ‘ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగియగానే వీరి సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు. ‘ఏళ్ల తరబడి చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని రోడ్డున పడేయడం తగదు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా వీరికి వెండర్‌ కార్డులు జారీ చేస్తాం. స్ట్రీట్‌ వెండర్స్‌ యాక్ట్‌ 2014కు అనుగుణంగా వ్యాపారాలు చేసుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని వంశీకృష్ణ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ

హక్కులను అణగదొక్కడమేః ఈఏఎస్‌ శర్మ
‘కేంద్ర ప్రభుత్వం 2014లో దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల హక్కుల గుర్తింపు, పరిరక్షణకు ఒక ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం మున్సిపాలిటీలు, వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులిచ్చి వ్యాపారానికి వీలు కల్పించాలి. ఆర్థిక సహాయం అందించాలి. కానీ వారిని నిర్వాసితులను చేయకూడదు. అలా చేస్తే మున్సిపల్‌ అధికారులు వీధి వ్యాపారుల హక్కులను అణగదొక్కడం, ఆ చట్టాన్ని ఉల్లంఘించడంగా పరిగణించాలి. రాజ్యాంగంలో 21వ ఆర్టికల్‌ కింద చిరు వ్యాపారులకు జీవనోపాధి పొందే ప్రాథమిక హక్కు ఉంది. విశాఖలో ఐదు రోజులుగా చిన్న షాపులు, బడ్డీలను తొలగిస్తూ నిర్వాసితులను చేయడం బాధాకరం. విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను జీవీఎంసీ అధికారులు ఎందుకు తొలగించరు? ఆక్రమణలకు పాల్పడిన ధనికులపై ఎందుకు చర్యలు తీసుకోరు? రూ.వేల కోట్లు లాభాలను గడిస్తున్న ఐటీ కంపెనీలకు ఎకరం 99 పైసలకే కోట్ల విలువ చేసే భూములను ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వం.. చిరు వ్యాపారుల జీవనోపాధికి కనీస ప్లాట్లను ఎందుకివ్వరు?’ అని ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ ప్రశ్నించారు.

పీవోడబ్లు్య రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి

చిరు వ్యాపారులకు అండగా పోరాడతాంః లక్ష్మి
‘సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఫుట్‌పాత్‌లు, రోడ్ల పక్కన ఉన్న చిరు దుకాణాల వల్ల ఇబ్బందులుంటే ముందుగా నోటీసులివ్వాలి. జీవీఎంసీలో కానీ ఉన్నపళంగా వాటిని తొలగించి చిరు వ్యాపారులను రోడ్డున పడేశారు. ఉపాధి ఇవ్వకపోగా ఉన్న ఉపాధిని తీసేశారు. బాధితుల్లో అనేకమంది పేదలే. మరో చోట వీరికి దుకాణాలు కేటాయిస్తామని అంటున్నారు. ఇప్పుడున్న చోట కాకుండా మరెక్కడైనా ఇస్తే వారి వ్యాపారాలెలా సాగుతాయి? నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసి ఉంటున్న చోటే ఇవ్వాలి. నైట్‌ ఫుడ్‌ కోర్టు వివాదం కోర్టులో పెండింగులో ఉండగా అక్కడ షాపులను ఎలా తొలగిస్తారు? కూటమి ప్రభుత్వం నియంత పాలనను తలపిస్తోంది. విశాఖ వీధి వ్యాపారులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటూ పోరాడతాం’ అని పీవోడబ్లు్య రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.

వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు

కూటమి సర్కారు కక్ష సాధింపుః కేకే రాజు
‘వీధి వ్యాపారులపై కూటమి సర్కారు కక్ష సాధిస్తోంది. గతంలో హాకర్‌ జోన్లు ఏర్పాటు చేసి, ట్రేడ్‌ లైసెన్సులు ఇచ్చి వీరిని ప్రోత్సహించింది జీవీఎంసీ అధికారులే. ఈ షాపులేవీ అక్రమమైనవి కాదు. ఇప్పుడు నోటీసులివ్వకుండా వాటిని జేసీబీలతో కూల్చేస్తున్నారు. అనుమతులిచ్చిన వారే కూల్చేస్తారా? మహిళల స్వయం ఉపాధిని దెబ్బతీస్తున్నారు. వీరంతా ఎక్కడికి పోతారు? వారి కుటుంబాలను ఎలా పోషించుకుంటారు? కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి 40 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మేయర్, ఎంపీ, కూటమి ఎమ్మెల్యేలు బాధిత చిరువ్యాపారులకు క్షమాపణలు చెప్పి నష్టపరిహారం చెల్లించాలి. లేనిపక్షంలో వారిని బయట తిరగనివ్వం. వీధి వ్యాపారులకు తిరిగి షాపులు కేటాయించే వరకు వారి పక్షాన ఉద్యమిస్తాం’ అని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు స్పష్టం చేశారు.
Read More
Next Story