ప్రజలకు మేలైన సేవలు అందిస్తా : పవన్ కల్యాణ్
మంత్రిగా ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలగిందని పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. మంత్రిగా తాను కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వెల్లడించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంయాతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల ముందు ప్రజా పోరాట యాత్ర చేసిన సమయంలో ప్రజల కష్టాలను కళ్ళారా చూశానని, వాటన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. తాను నిర్వర్తించబోయే శాఖలు అన్నీ కూడా తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని, ఈ బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారాయన.
గ్రామాల్లో మౌలిక వసతులు, తాగు నీరు అందించడంపై తాను ప్రధానంగా దృష్టి పెడతానని, ప్రజల కష్టాల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ మేరకు ఆయన తాను చేసే పనులకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల కష్టాలను ప్రజా పోరాట యాత్ర సమయంలోనే లోతుగా పరిశీలించానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంత సమస్యలపై తనకు బలమైన అవగాహన ఉందని, వాటన్నింటి పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.
‘సమస్యలు కళ్ళారా చూశా’
‘‘విశాఖ మన్యంలో పర్యటిస్తున్నపుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీళ్ళ కోసం తాము పడుతున్న అవస్థలను చెబుతూ, అక్కడి బావిలో కలుషితమైన నీటిని చూపించారు. ఆ ప్రాంతంలోనే తోటవలస గ్రామానికి వెళ్లినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆ ఊరివాళ్ళు వివరించారు. గోదావరి జిల్లాలకు వెళ్లినప్పుడు పలు మత్యకార గ్రామాల వాసులు తాగు నీటి కోసం ఎన్ని ప్రయాసలు పడుతున్నామో చెప్పారు. గ్రామీణ అభివృద్ధి - దేశాభివృద్ధి అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోవడాన్ని ఆనాడు నేను గమనించాను. గుక్కెడు మంచి నీటి కోసం మైళ్ళ దూరం వెళ్తున్న ఆడపడుచుల అవస్థలు చూశాను. కాలుష్యమయమైన జల వనరులనే తాగు నీరుగా తప్పని పరిస్థితులలో వాడుకుంటున్న పల్లెవాసులను గమనించాను’’ అని ఆయన తన ప్రకటనలో వివరించారు. ఈ సందర్భంగానే.. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగు నీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు.
జనసేన సిద్ధాంతాల్లో పర్యావరణం ఒక భాగం
‘‘పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. ఒక పక్క పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందాలి అని గట్టిగా కోరుకుంటున్నాను. ఆ అభివృద్ధి పర్యావరణానికి హితంగా జరగాలి. ఆధునిక సాంకేతికత మేళవించిన సురక్షితమైన పారిశ్రామిక అభివృద్ధి ఈ సమాజానికి ఎంతో అవసరం. విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాదాన్ని మనం ఏనాడూ మరచిపోలేము. ప్రజల ఆరోగ్యాలను హరించివేయకుండా పరిశ్రమలు ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకునేలా పరిశ్రమలు ముందుకు వెళ్ళడానికి చేయూతనిస్తాము. భూ తాపాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలుస్తాము. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తాము’’ అని వెల్లడించారాయన.
అటవీ సంపదను కాపాడుకుందాము
‘‘వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తి నా మదిలో ఎప్పుడూ మారుమోగుతుంటుంది. ఒక్క వృక్షాన్ని రక్షించుకుంటేనే మానవ కోటికి ఎంతో మేలు కలుగుతున్నప్పుడు. లక్షలాది వృక్షాలను తన గర్భాన నిలుపుకున్న అడవి తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. అడవుల విధ్వంసమే కరువు కాటకాలకు మూల కారణం. అటువంటి అడవులను కన్నబిడ్డలా కాపాడతాము. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతాము. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్ళాల్సిందే. సామాజిక వనాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. శాస్త్ర, సాంకేతిక విభాగాలు మానవాళి శ్రేయస్సుకు, లోక కళ్యాణానికి అత్యంత అవశ్యం’’ అని అడవుల ప్రాముఖ్యతను గుర్తు చేశారు.
ప్రజలకు సేవ చేయడానికి తాను దక్కిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జార విడుచుకోనని, ప్రజలకు అత్యంత నాణ్యమైన సేవలు అందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. తాను నిర్వర్తిస్తున్న శాఖల పరిధిలో ఎటువంటి అక్రమాలు, అవినీతికి తావు లేకుండా పాలిస్తానని, ఎటువంటి సమస్య ఉన్నా ఎవరైనా నా దృష్టికి తీసుకువచ్చేలా చర్యలు కూడా చేపడతానని తెలిపారు. తప్పు చేసేది ఎవరైనా తప్పకుండా శిక్ష పడేలా చేస్తానని హామీ ఇచ్చారు.