కేసీయార్ చేయలేని పనిని రేవంత్ చేయగలరా ?
x

కేసీయార్ చేయలేని పనిని రేవంత్ చేయగలరా ?

కాంగ్రెస్ ను భూస్ధాపితం చేయాలని ప్రయత్నంచేసినా కేసీయార్ సక్సెస్ కాలేదు. దా


ఇపుడిదే ప్రశ్న తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. కేసీయార్ చేయలేని పని రేవంత్ చేయగలరా ? అంటే ఇదేదో డెవలప్మెంటుకు సంబందించి కాదు. అచ్చంగా రాజకీయానికి సంబంధించిన వ్యవహారమే. అదికూడా ఫిరాయింపులకు సంబంధించిన విషయం. సోమవారం నాడు బీఆర్ఎస్ పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. తాజా చేరికతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎంఎల్ఏ సంఖ్య పదికి చేరుకున్నది.

ఇపుడు విషయం ఏమిటంటే 2014లో ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత కేసీయార్ ముఖ్యమంత్రయ్యారు. ఎప్పుడైతే సీఎంగా కేసీయార్ బాధ్యతలు తీసుకున్నారో వెంటనే ప్రతిపక్షాల మీద దృష్టిసారించారు. టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలను తన పార్టీలోకి లాగేసుకోవటం మొదలుపెట్టారు. అవసరం ఉన్నా లేకపోయినా పదేళ్ళల్లో ప్రతిపక్షాలకు చెందిన నలుగురు ఎంపీలు, 25 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలను బీఆర్ఎస్ లోకి లాక్కున్నారు. ఎవరితోను రాజీనామాలు చేయించలేదు. అప్పట్లో కేసీయార్ ప్లాన్ ఏమిటంటే తెలంగాణాలో తనకు ఎదురన్నదే లేకుండా ఉండకూడదని. అందుకనే ముందు టీడీపీ, తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షాలను బీఆర్ఎస్ లో కలిపేసుకున్నారు. తర్వాత టీడీపీని భూస్ధాపితం చేసేశారు. కాంగ్రెస్ ను బొందపెట్టాలని చాలా ప్రయత్నాలు జరిగాయి కాని సక్సెస్ కాలేదు.

ఈ నేపధ్యంలోనే 2023 ఎన్నికలు జరగటం, బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావటం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అవ్వగానే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. బీఆర్ఎస్ లోని ఒక్కో ఎంఎల్ఏని లాగేస్తున్నారు. ఎంఎల్సీలను గ్రూపులుగా లాక్కుంటున్నారు. రేవంత్ టార్గెట్ ఏమిటంటే అసెంబ్లీ, మండలిలో బీఆర్ఎస్ ఎల్పీని లేకుండా చేయాలని. అలాగే కేసీయార్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని. రేవంత్ తన వ్యూహాన్ని చాలా నింపాదిగా అమలుచేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నరేళ్ళ పదవీకాలముంది. అందుకనే ఎక్కడా తొందరపడకుండా రేవంత్ చాలా ప్లాన్ చేసి కారుపార్టీ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను లాగేసుకుంటున్నారు. అప్పట్లో కేసీయార్ ఏదైతే చేశారో ఇపుడు రేవంత్ అదే బాటలో నడుస్తున్నారు.

ఇక్కడే అందరిలోను మొదలైన ప్రశ్న ఏమిటంటే కాంగ్రెస్ ను భూస్ధాపితం చేయాలని ప్రయత్నంచేసినా కేసీయార్ సక్సెస్ కాలేదు. దాని ఫలితమే కాంగ్రెస్ పుంజుకుని ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావటం. మరిపుడు బీఆర్ఎస్ ను భూస్ధాపితం చేయాలన్న ప్లాన్ లో రేవంత్ సక్సెస్ అవుతారా ? అన్న చర్చ పెరిగిపోతోంది. వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ అత్యంత బలహీనంగా ఉంది. కేసీయార్ నాయకత్వంపై నమ్మకంలేక చాలామంది పార్టీని వదిలేస్తున్నారు. కాంగ్రెస్ మంత్రులు, నేతలు చెబుతున్నదాన్ని బట్టి రేవంత్ ధాటిని కేసీయార్ తట్టుకోలేకపోతున్నారు. తనను తాను కేసుల నుండి రక్షించుకోవటం కోసం, కూతురు కవితను ముందు జైలు నుండి తర్వాత లిక్కర్ స్కా నుండి బయటపడేయటం కోసం బీఆర్ఎస్ ను కేసీయార్ బీజేపీలో విలీనం చేసేస్తారని కాంగ్రెస్ నేతలంటున్నారు.

మార్గమేదైనా తెలంగాణాలో బీఆర్ఎస్ కనిపించకూడదన్నది రేవంత్ టార్గెట్. తానే కారుపార్టీని బొందపెట్టినా, పార్టీని కేసీయార్ బీజేపీలో విలీనం చేసినా బీఆర్ఎస్ అన్నది చరిత్రలో మాత్రమే మిగిలుంటుంది. విషయం ఏమిటంటే అప్పట్లో కేసీయార్ చేసింది తప్పయితే ఇపుడు రేవంత్ చేస్తున్నది కూడా తప్పే అనటంలో సందేహంలేదు. తప్పును తప్పుతోనే ఎదుర్కోవాలని, తప్పుకు తప్పుతోనే సమాధానం చెప్పాలనే ధోరణి ప్రస్తుత రాజకీయాల్లో పెరిగిపోతోంది కాబట్టి ఎవరు ఏమీ చేయలేరంతే. అందుకనే కేసీయార్ చేయలేని పనిని రేవంత్ పూర్తిచేయగలరా ? అనే చర్చ పెరిగిపోతోంది.

Read More
Next Story