కొత్త సంవత్సరంలో అయినా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందా ?
x

కొత్త సంవత్సరంలో అయినా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందా ?

మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, వెల్డర్లు, ఇంటీరియర్ డిజైనర్లు.. ఇలాంటి అనేక రంగాల్లోని వాళ్ళకు చేతినిండా పనిదొరుకుతుంది


కొత్తసంవత్సరంలో అయినా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందా ? ఇపుడిదే ప్రభుత్వాధినేతతో పాటు ఎన్నోరంగాల్లోని నిపుణల మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంపై మరెన్నో రంగాలు ఆధారపడుతున్నాయి కాబట్టే. రియల్ ఎస్టేట్(Real Estate) రంగం ఊపందుకుంటే దీనిపై ఆధారపడి ఉపాధిపొందుతున్న వేలాది మంది బ్రోకర్లు, ఏజెంట్ల జేబులు నిండుతాయి. అలాగే నిర్మాణరంగం జోష్ అందుకుంటుంది. పనిలోపనిగా మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, వెల్డర్లు, ఇంటీరియర్ డిజైనర్లు.. ఇలాంటి అనేక రంగాల్లోని వాళ్ళకు చేతినిండా పనిదొరుకుతుంది. గడచిన ఏడాది అనేక కారణాలతో రియల్ ఎస్టేట్ రంగం మందగించింది. దాంతో నిర్మాణాల జోరుతగ్గి పైన చెప్పిన రంగాల్లోని వృత్తిప వాళ్ళు బాగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

పోయినఏడాది ఏదోలాగ జరిగిపోయింది కాబట్టి కొత్తసంవత్సరంలో అయినా రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుందని ఆశించిన చాలామందికి జనవరి నెల నిరాసనే మిగిల్చింది. 2024, జనవరితో పోల్చుకుని 2025, జనవరిలో నిర్మాణరంగం జోరందుకుంటుందని అనుకుంటే రివర్సులో తగ్గిందనే చెప్పాలి. తాజా నివేదికలను గమనిస్తే 2024 జనవరిలో 5,454 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగితే 2025 జనవరిలో 5,444 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. తగ్గిన రిజిస్ట్రేషన్ల సంఖ్య చాలా తక్కువే అయినా దాని ప్రభావం మాత్రం ఎక్కువగానే ఉంటోంది. తాజా నివేదికల ప్రకారం జరిగిన రిజిస్ట్రేషన్లలో 50 లక్షల రూపాయల విలువైన ప్రాపర్టీల సంఖ్య బాగా పెరిగింది. ఇదే సమయంలో కోటిరూపాయలకు పైగా విలువైన ప్రాపర్టీల కొనుగోళ్ళపై కొనుగోలుదారులు బాగా ఆసక్తిచూపుతున్న విషయం కూడా బయటపడింది. కోటిరూపాయల విలువకు మించిన ప్రాపర్టీల కొనుగోలు 2024 జనవరితో పోల్చుకుంటే 2025 జనవరిలో 12 శాతం ఎక్కువ నమోదైంది.

2024 జనవరిలో రు. 50 లక్షల విలువైన ప్రాపర్టీలు 3,387 రిజిస్ట్రేషన్లు జరిగితే 2025, జనవరిలో జరిగిన రిజిస్ట్రేషన్లు 3,282. ప్రాపర్టీల కొనుగోళ్ళల్లో 50 లక్షల విలువైన ప్రాపర్టీలదే మెజారిటి అయినా 50 లక్షల రూపాయల విలువగల రిజిస్ట్రేషన్లు 3 శాతం తగ్గింది. ఇదే సమయంలో పోయిన ఏడాది జనవరిలో కోటి రూపాయల విలువైన ప్రాపర్టీలు 738 రిజిస్టర్ అయితే ఈఏడాది జనవరిలో 823 ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. రిజిస్ట్రేషన్లు జరిగిన ప్రాపర్టీల్లో 69 శాతం వెయ్యి నుండి 2 వేల చదరవు అడుగుల విస్తీర్ణంలోని ప్రాపర్టీలే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ తర్వాత మేడ్చల్-మల్కాజ్ గిరి, రంగారెడ్డి పరిధిలోనే అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రేవంత్ రెడ్డి ప్రమోట్ చేస్తున్న ఫోర్త్ సిటీ నిర్మాణం పనులు మొదలైతే దాని ఆధారంగా రియల్ ఎస్టేట్ రంగం బాగా ఊపందుకుంటుందని అనుకుంటున్నారు.

ఇదే విషయాన్ని ఎలిఫెంటల్ రియాలిటీ సంస్ధ యాజమాని బద్దం సందీప్ రెడ్డి ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు రియల్ ఎస్టేట్ రంగం ఊపుతగ్గుతుందని ముందుగా అనుకున్నదే అన్నారు. ‘ప్రతి పది, పన్నెండేళ్ళకు రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభానికి గురవుతుంద’ని చెప్పారు. 2008లో ఆర్ధిక రంగం కుదేలైనపుడు వివిధ రంగాలతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా మందగించిన విషయాన్ని బద్దం గుర్తుచేశారు. ‘ఇపుడు రియల్ ఎస్టేట్ ఊపు తగ్గటానికి ముఖ్య కారణం ఆర్ధిక మందగమనమే’ అన్నారు. ‘గడచిన ఏడాదిగా రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న మాట వాస్తవమే’ అని అంగీకరించారు. ‘అయితే ఇలాంటి ఒడిదుడుకులు తాత్కాలికమే అని తొందరలోనే రియల్ ఎస్టేట్ రంగం జోరందుకుంటుంద’న్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

‘హైదరాబాద్(Hyderabad) వెస్ట్ జోన్లోని గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, బాచుపల్లి, మియాపూర్, హైటెక్ సిటి(Hitech City) ప్రాంతాల్లో ప్రామియంప్రాపర్టీల(Premium Properties) అమ్మకాలు ఆశాజనకంగానే ఉంద’న్నారు. ‘అలాగే ఈస్ట్ జోన్ లోని ఉప్పల్, హబ్సిగూడ, ఎల్బీ నగర్, ఆదిబట్ల, దిల్ సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల్లో 2 బెడ్ రూమ్ ఇళ్ళకు గిరాకి ఉంద’న్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా ప్రభావం నామమాత్రమే అన్నారు. హైడ్రా ఏర్పాటును సందీప్ స్వాగతించారు. ‘ప్రాపర్టీలను కోల్పోయిన వాళ్ళకు బాధవుండటం సహజమే అయినా దీర్ఘకాలంలో హైడ్రా వల్ల ప్రాపర్టీల కొనుగోలుదారులకు మంచే జరుగుతుంద’ని సందీప్ రెడ్డి చెప్పారు.

రియల్ ఎస్టేట్ రంగాన్ని మదింపువేసే సంస్ధ ‘నైట్ ఫ్రాంక్ ఇండియా’(Knight Frank India) ఛైర్మన్ శిశిర్ బైజల్ మాట్లాడుతు ‘కోటిరూపాయల విలువైన గృహాల అమ్మకాలు 12 శాతం పెరిగినట్లు’ టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు. ‘ప్రీమియం రకాలైన ఇళ్ళను కొనుగోలు చేయాలని, అన్నీ సౌకర్యాలున్న ఇళ్ళల్లో జీవించాలని ఆలోచించే వాళ్ళ సంఖ్య పెరుగుతున్న కారణంగానే కోటిరూపాయల విలువైన ఇళ్ళు అమ్ముడుపోతున్నా’యని బైజల్ అభిప్రాయపడ్డారు.

Read More
Next Story