తొందరలోనే రామప్ప దేవాలయం కనుమరుగు అయిపోతుందా ?
x

తొందరలోనే రామప్ప దేవాలయం కనుమరుగు అయిపోతుందా ?

తాను మండుతు అందరికీ వెలుగునిచ్చే బొగ్గే ఇపుడు రామప్పదేవాలయం పాలిట మరణశాసనంగా మారుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.


క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మేథావులు, చరిత్రకారులు, స్థానిక ప్రజల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. రామప్పదేవాలయాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని, చారిత్రక వారసత్వ సంపదను భావితరాలకు జాగ్రత్తగా అందించాలన్న చరిత్రకారుల తపన, కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు లాగ అయిపోయేట్లుంది. కారణం ఏమిటంటే రామప్ప దేవాలయంకు దగ్గరలోనే ఉన్న సింగరేణి బొగ్గు గనులే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వెంకటపూర్ మండలం పాలంపేటలో సింగరేణి(Singareni Coal Mines) ఓపెన్ క్యాస్ట్ బొగ్గు గనులున్నాయి. మామూలుగా అయితే తాను మండుతు అందరికీ వెలుగునిచ్చే బొగ్గే ఇపుడు రామప్పదేవాలయం పాలిట మరణశాసనంగా మారుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే బొగ్గుగనులు, రామప్పదేవాలయం(Ramappa Temple)తో పాటు రామప్ప చెరువు కూడా ఒకే ఊరిలో ఉండటమే. దేవాలయం+చెరువుకు ఓపెన్ క్యాస్ట్ బొగ్గుగని మధ్య దూరం సుమారు 5 కిలోమీటర్లు మాత్రమే. అందుకనే రామప్పదేవాలయం, రామప్పచెరువుకు సింగరేణి బొగ్గుగనుల గ్రహణం పట్టేట్లుగా ఉందనే ఆందోళన పెరిగిపోతోంది.



ఇంతకీ విషయం ఏమిటంటే ఓపెన్ క్యాస్ట్ గని నుండి బొగ్గు తవ్వుకోవటానికి సింగరేణి యాజమాన్యం డిసైడ్ అయ్యింది. అందుకు అనుమతులు సాధించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఆ ప్రయత్నాలను పాలంపేట డెవలప్మెంట్ అథారిటి(Palam Peta Development Authority) అడ్డుకుంటున్నది. పాలంపేట డెవలప్మెంట్ అథారిటి అన్నది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో వివిధ రంగాల్లోని నిపుణలు సభ్యులుగా ఉన్నారు. పాలంపేట డెవలప్మెంట్ అథారిటిలో రామప్పదేవాలయం, చెరువు పరిరక్షణకు పాటుపడుతున్న అనేకమంది నిపుణులు, సంస్ధల్లోని వ్యక్తులు సభ్యులున్నారు. అలాంటి సంస్ధల్లో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు(Kakatiya Heritage Trust) కీలకమైనది. ఈ ట్రస్టు సభ్యుడు ప్రొఫెసర్ మండేలా పాండురంగారావు డెవలప్మెంట్ అథారిటిలో సభ్యుడిగా ఉన్నారు. వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో రిటైరయిన ప్రొఫెసర్ మండేలా పాండురాంగారావు దశాబ్దాలుగా రామప్పదేవాలయం, రామప్పచెరువును కాపాడుకునేందుకే పెద్ద పోరాటాలే చేస్తున్నారు. ప్రొఫెసర్ నేతృత్వంలో అనేకమంది చేసిన పోరాటాలు, ప్రయత్నాల ఫలితంగానే రామప్ప దేవాలయంకు వరల్డ్ హెరిటేజ్ సంస్ధ యునెస్కో(UNESCO)లో గుర్తింపు దక్కింది. ఇంతటి చారిత్రక వారసత్వ సంపద హోదా కలిగిన రామప్ప దేవాలయం బొగ్గు తవ్వకాల కారణంగా మసిబారిపోయే ప్రమాదం పొంచి ఉండటాన్ని ప్రొఫెసర్ తో పాటు చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.



బొగ్గు తవ్వకాలు జరగాలంటే అందుకు పాలంపేట డెవలప్మెంట్ అథారిటి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) ఇవ్వాలి. తవ్వకాల కోసం ఏడాదిక్రితం సింగరేణి యాజమాన్యం పెట్టుకున్న దరఖాస్తుపై అథారిటి సమావేశంలో చర్చ జరిగింది. బొగ్గు తవ్వకాలకు అనుమతులు ఇస్తే రామప్పదేవాలయంతో పాటు చెరువు కనుమరుగు అయిపోతుందని, రెండూ చరిత్ర గర్భంలో కలిసిపోతాయని ఆందోళన వ్యక్తంచేసిన ప్రొఫెసర్ బొగ్గు తవ్వకాలకు అభ్యంతరం చెప్పారు. దాంతో బొగ్గు తవ్వకాల ప్రయత్నాలకు స్పీడు బ్రేకులు పడ్డాయి. బొగ్గు తవ్వకాలకు యాజమాన్యం పెట్టుకున్న దరఖాస్తును అథారిటి తోసిపుచ్చింది. అథారిటి దరఖాస్తును రిజెక్టు చేసింది కాబట్టి తవ్వకాలను యాజమాన్యం నిలిపేసిందనే అందరు అనుకున్నారు. అయితే ఈమధ్యనే బొగ్గుతవ్వకాలకు సింగరేణి యాజమాన్యం మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టిందన్న విషయం బయటపడింది.



ఇపుడు జరుగుతున్న ప్రయత్నాలు ఏమిటంటే స్ధానికుల నుండి బొగ్గు తవ్వకాలకు అథారిటి అనుమతులు ఇవ్వాలని జనాలతోనే చెప్పించటం. బొగ్గు తవ్వకాలను అనుమతులు వస్తే గ్రామాల్లో సౌకర్యాలు ఏర్పడతాయి, స్ధానికులకు ఉద్యోగ, ఉపాధి దొరుకుతుంది, తమ గ్రామాలన్నీ కళకళలాడుతాయని జనాల్లో చర్చలు జరిగేట్లుగా కొంతమందిని ముందుపెట్టి యాజమాన్యం వెనుకనుండి ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తోంది. అంటే డెవలప్మెంట్ అథారిటిని బొగ్గు తవ్వకాలకు అనుమతులు ఇచ్చేట్లుగా జనాలతోనే సింగరేణి యాజమాన్యం మైండ్ గేమ్ మొదలుపెట్టింది.

బొగ్గుగనుల వల్ల నష్టం ఏమిటి ?



బొగ్గుగనుల్లో తవ్వకాల వల్ల దేవాలయం, చెరువుకు జరిగే నష్టం ఏమిటి ? ఏమిటంటే చెరువు సాంతం దెబ్బతినేస్తుంది. ఎలాగంటే బొగ్గుగనుల కోసం యాజమాన్యం 300 మీటర్లలోతుకు తవ్వకాలు జరుపుతుంది. చెరువుకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న గనుల్లో 300 మీటర్లు భూమిలోకి తవ్వకాలు జరిపితే దాని ప్రభావంతో చెరువు కింద భూమిలో కదలికలు వచ్చేస్తాయి. ఎప్పుడైతే చెరువుకింద భూమిలో కదలికలు వస్తాయో అప్పుడు భూమిపొరలు డిస్టర్బ్ అవుతాయి. భూమిపొరలు డిస్టర్బ్ అయితే చెరువులోని నీరంతా చుట్టుపక్కల ప్రాంతాల్లోకి లీకవుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలంటే చెరువుకు సుమారు కిలోమీటర్ దూరంలోనే ఉన్న దేవాలయం మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఎప్పుడైతే ప్రభావం మొదలవుతుందో చాలా తొందరలోనే దేవాలయం పునాదుల కిందకు నీరు చేరుతుంది.

చెరువు వల్ల దేవాలయంకు నష్టం



చెరువులోని నీరంతా లీకై దేవాలయం పునాదుల కిందకు చేరితే దేవాలయం మొత్తం కుప్పకూలిపోవటానికి ఎంతోకాలం పట్టదు. ఎలాగంటే దేవాలయం పునాదులకు శాండ్ బాక్స్ టెక్నాలజీ ఉపయోగించారు. 830 సంవత్సరాల క్రితం కాకతీయల కాలంలో గణపతి దేవుడి కాలంలో శాండ్ బాక్స్ టెక్నాలజీ(Sand Box Technology) పునాదులపైన నిర్మించిన దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దేవాలయంకు ఉపయోగించిన ఇటుకలు ఎంత తేలికగా ఉంటాయంటే నీటిలో వేసినా ముణగవు. మామూలు ఇటుకలను నీళ్ళల్లో వేస్తే బరువుకు వెంటనే ముణిగిపోతాయి. కాని కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్పదేవాలయంలో వాడిన ఇటుకలు నీళ్ళల్లో వేస్తే ముణగవు, కరగవు కూడా. ఇదే విషయాన్ని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ రిటైర్డ్ ప్రొఫెసర్ మండెల పాండురంగారావు ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు " ఈ ఇటుకలు స్పాంజ్ లాగా అనేక రంధ్రాలతో తయారయి ఉంటాయి. వాటిని పోరస్ (porus bricks)అంటారు. ఆలయ విమానం (గోపురం) నిర్మాణంలో ఇలాంటి పోరస్ ఇటుకలు వాడారు. అవి నీళ్లలో కూడా తేలుతాయి. ఇది రామప్ప ఆలయ నిర్మాణం ప్రత్యేకత," అని చెప్పారు. చరిత్ర పరిశోధకులు డాక్టర్ శివనాగిరెడ్డి మాట్లాడుతు ‘ఇలాంటి తేలికైన ఇటుకల టెక్నాలజీతో దేవాలయం నిర్మించటం దేశంలో మరక్కెడా కనబడద’న్నారు. అంతటి అద్భుతమైన టాక్నాలజీతో నిర్మించారు కాబట్టే వందల ఏళ్ళయినా ఎండకు, వానకు, తుపాన్లకు కూడా ఇంకా చెక్కుచెదరకుండా నిలబడుందన్నారు. భూకంపాలను కూడా తట్టుకునేంత సామర్ధ్యంతో కాకతీయులు దేవాలయాన్ని నిర్మించారు.



చెరువులోని నీరంతా లీకై దేవాలయం పునాదులన్న భూమిపొరల్లోకి చేరితే ఆ తడి ప్రభావానికి, నిరంతరం వచ్చే నీటితాకిడికి శాండ్ బాక్స్ టెక్నాలజీ దెబ్బతినటం మొదలవుతుంది. చెరువులో నుండి లీకై వస్తున్న నీటి ప్రవాహం ఉధృతికి కొంతకాలానికి పునాదులు పూర్తిగా దెబ్బ తినేస్తుంది. ఎప్పుడైతే నీటి లీకుల కారణంగా శాండ్ బాక్స్ టెక్నాలజీ దెబ్బతింటుందో పునాల్లోకి నీళ్ళు చేరుతాయి. పునాదులు ఎప్పుడైతే బలహీనమవుతుందో తొందరలోనే పునాదుల్లోని పటుత్వం బలహీనపడి కదిలిపోతుంది. పునాదులు బలహీనపడి కదులుతుందో పైనున్న దేవాలయం బరువుకు పునాదులు దెబ్బతినేస్తుంది. పునాదులు దెబ్బతినింది అంటే పైనున్న దేవాలయం నిర్మాణం కూడా దెబ్బతినేస్తుంది. ఎప్పుడైతే పునాదులు దెబ్బతిని, దేవాలయం స్ట్రక్చర్ దెబ్బతింటుందో తొందరలోనే దేవాలయం అంతా కుప్పకూలిపోతుంది. వందల సంవత్సరాల చారిత్రక వారసత్వ సంపదగా యునెస్కోలో విశిష్టమైన స్ధానం సంపాదించుకున్న రామప్పదేవాలయం గొప్పదనమంతా చరిత్ర గర్భంలో కలిసిపోవటం ఖాయం. ఈ మొత్తం జరగటానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.



ఇదే విషయాన్ని ప్రొఫెసర్ మండెలా మాట్లాడుతు బొగ్గు తవ్వకాలకోసం సింగరేణి యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాల వల్ల చారిత్రక వారసత్వ సంపద కలిగిన రామప్ప దేవాలయం ఉనికికే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. బొగ్గుగని తవ్వకాలతో సంబంధంలేకుండా చాలా కాలం క్రితమే రామప్ప దేవాలయం, రామప్ప చెరువు ప్రాంతాల్లోని భూ అమరికల్లో పగుళ్ళు గుర్తించినట్లు చెప్పారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మార్పులను మనం ఏం చేయలేమని, కాని బొగ్గు తవ్వకాల వల్ల జరగబోయే ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. 3 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన రామప్పచెరువు వల్ల సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నట్లు చెప్పారు. చెరువు-దేవాలయంకు మధ్య దూరం కేవలం 1 కిలోమీటర్ మాత్రమే అన్నారు. బొగ్గు తవ్వకాల వల్ల చెరువు డిస్ట్రబ్ అయితే దాని ప్రభావం దేవాలయం మీద పడటం ఖాయమని ప్రొఫెసర్ ఆందోళన వ్యక్తంచేశారు. చెరువు ప్రభావం దేవాలయం మీద పడితే మొత్తం కుప్పకూలిపోవటానికి ఎంతోకాలం పట్టదన్నారు.

రామప్ప దేవాలయంకు చరిత్రలో కూడా ఎంతో విశిష్టమైన స్ధానం ఉందని ప్రతిరోజు దేవాలయాన్ని చూడటానికి విదేశీయులతో కలిపి వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారని ప్రొఫెసర్ చెప్పారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదను పరిరక్షించుకోవటంలో రమప్పదేవాలయంకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన దేవాలయాన్ని రక్షించుకోవాల్సిన బాద్యత అందరిమీదా ఉందని చెప్పారు.



బొగ్గు తవ్వకాలు ఎక్కడైనా చేసుకోవచ్చు

ఇదే విషయమై రామప్ప దేవాలయం పరిరక్షణ కమిటి కన్వీనర్ ఆకిరెడ్డి రామమోహన్ రావు మాట్లాడుతు సింగరేణి బొగ్గుగనుల తవ్వకాల వల్ల రామప్పదేవాలయం, చెరువు దెబ్బతినటం ఖాయమని ఆందోళన వ్యక్తంచేశారు. బొగ్గు తవ్వకాల కోసం సింగరేణి యాజమాన్యం ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఎంతో పేరున్న రామప్ప దేవాలయాన్ని పణంగా పెట్టడం ఎంతమాత్రం మంచిదికాదన్నారు. బొగ్గు తవ్వకాలు ఇక్కడ కాకపోతే మరోచోట చేసుకోవచ్చు కాని దేవాలయం ఇక్కడ తప్ప మరోచోట ఉండదన్నారు. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన రామప్ప దేవాలయాన్ని కుప్పకూల్చయినా బొగ్గు తవ్వకాలు చేయాలన్న యాజమాన్యం ఆలోచనను ఎవరూ సమర్ధించకూడదని ఆకిరెడ్డి చెప్పారు. 22 ఎకరాల్లో విస్తరించిన దేవాలయం, 2,394 ఎకరాల్లో నిర్మించిన రామప్ప చెరువు వరంగల్ జిల్లాకే కాకుండా రెండు తెలుగురాష్ట్రాలకు ఎంతో పేరు సంపాదించిన విషయాన్ని ఆకిరెడ్డి గుర్తుచేశారు. 40 వేల ఎకరాలకు సాగునీటితో పాటు 294 ఆవాసాల్లోని సుమారు 35 వేలమందికి తాగునీటిని చెరువు అందిస్తున్నట్లు చెప్పారు.

Read More
Next Story