రజనీ రాణి అయ్యేనా?
x

రజనీ రాణి అయ్యేనా?

గుంటూరు వెస్ట్‌లో ఇద్దరు బీసీ మహిళలు మధ్య ప్రతిష్టాత్మక పోటీ జరుగుతోంది. మంత్రి విడదల రజనీకి.. చావో రేవో తేల్చుకోవలసిన సమయమిది. ఇక్కడ రాణి ఎవరు?


జి. విజయ కుమార్

గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజక వర్గం ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకంగాను.. అనుకూలంగాను తీర్పులు ఇవ్వడం లేదు. రెండు సార్లు తెలుగుదేశం పార్టీ గెలిస్తే.. మరో రెండు సార్లు కాంగ్రెస్‌ పార్టీ ఇలా గెలుస్తూ వస్తున్నాయి. అధికార వైఎస్‌ఆర్‌సీపీ 2014, 2019లో రెండు సార్లు ఇక్కడ ఓడిపోయింది. విచిత్రం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ వారు ఎమ్మెల్యేగా మద్దాల గిరిని గెలిపిస్తే ఆయన తన స్వార్థం కోసం వైఎస్‌ఆర్‌సీపీలో చేరి టీడీపీ కార్యకర్తలకు అన్యాయం చేశారనే విమర్శ కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కూడా ఒంటెద్దు పోకడలతోనే పోతున్నారని చెప్పొచ్చు. తామనుకున్న వారిని పోటీలో పెడితే గెలిచి తీరాలన్నా ఆలోచనలో సీఎం జగన్‌ ఉన్నారు. ఏమనుకున్నారో ఏమో కానీ అవకాశ వాద రాజకీయాలకు పాల్పడుతూ టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన ఎమ్మెల్యే మద్దాల గిరికి ఈ సారి మొండి చేయి చూపించారు.
చిలకలూరుపేటలో గెలిచి మంత్రి అయిన విడుదల రజనీకి గుంటూరు వెస్ట్‌ టికెట్‌ను ఖరారు చేశారు. దింతో గిరికి దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయింది. ఆయన తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సీఎం జగన్‌ గిరిని పిలిచి సర్థి చెప్పడంతో ప్రస్తుతానికి విన్నట్టుగా నటించినా.. మనస్పూర్తిగా మాత్రం రజనీ అభ్యర్థిత్వాన్ని బలపరచడం లేదు. గుంటూరు మేయర్‌ స్థానంలో కావటి శవనాగమనోహర్‌ నాయుడు ఉండటం వల్ల ఆయన మద్దతును కూడగట్టుకోగలిగారు. చివరకు మనోహర్‌ నాయుడుని చిలకలూరిపేట అభ్యర్థిగా రంగంలోకి దింపడంలో రజనీ సఫలమయ్యారు. దీని వెనుక కుట్ర ఉందని.. అప్పటి వరకు నియోజక వర్గ ఇన్‌చార్జిగా ఉన్న మల్లెల రమేష్‌ నాయుడుకి జులక్‌ ఇచ్చి మనోహర్‌నాయుడిని రగంలోకి దించడంలో ఆంతర్యం అదేనని పలువురు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో చిలకలూరుపేటలో కూడా కథ అడ్డం తిరిగింది. అటు చిలకలూరుపేటలోను.. ఇటు గుంటూరు వెస్ట్‌లోను పరిస్థితులు విడుదల రజనీకి వ్యతిరేకంగా మారాయి. దీంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మనోహర్‌ నాయుడుని చిలకలూరుపేటకు పంపకుండా గుంటూరు మేయగానే ఉంచితే తనకు అండగా ఉండే వాడనే భావన కూడా ఆమెలో ఉన్నట్లు రజనీ సన్నిహితులు చెబుతున్నారు.
రజనీపై టీడీపీ బలమైన అభ్యర్థిని రంగంలోకి...
రజనీపై పోటీకి తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించింది. బిసీ సామాజిక వర్గానికి చెందిన పిడుగురాళ్ల మాధవిని ఎన్నికల బరిలోకి దించింది. పిడుగురాళ్ల మాధవి ఎంసీఏ చదువుకున్నారు. భర్త గళ్లా రామచంద్రరావు ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. మాధవి ప్రస్తుతం గుంటూరులోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన వికాస్‌ ఆసుపత్రికి డైరెక్టురుగా ఉన్నారు. మాధవి పుట్టినిల్లు.. మెట్టినిల్లు గుంటూరు జిల్లానే. శ్రీభమర టౌన్‌షిప్‌ నిర్మాణ సంస్థ ద్వారా ఆమె భర్త రామచంద్రరావు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు.
పశ్చిమలో ముఖ్యనాయకుల మద్దతు
గుంటూరు పశ్చిమ నియోజక వర్గం నుంచి కన్నా లక్ష్మినారాయణ కూడా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక సారి గెలిచారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సత్తెనపల్లి నియోజక వర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజక వర్గంలో కన్నాకు మంచి పట్టుందని చెప్పొచ్చు. టీడీపీ పార్లమెంట్‌ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్‌ రంగంలోకి దిగారు. మంది మార్భలాన్ని కూడగట్టడంలోను.. ఓటర్లకు.. తమ కార్యకర్తలకు తమ అవసరాలను తీర్చడంలోను ముందున్నారు. అటు కన్నా లక్ష్మినారాయణ.. ఇటు పెమ్మసాని చంద్రశేఖర్, సిట్టింగ్‌ ఎంపీ గల్లా జయదేవ్, నియోజక వర్గంలోని ముఖ్య టీడీపీ నాయకుల మద్ధతును కూడగట్టడంలో పిడుగురాళ్ల మాధవి సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు.
రజనీకి ఎదురీతేనా..
మంత్రి విడుదల రజనీ రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ గూంటూరు పశ్చి నియోజక వర్గం నుంచి అనుకున్నంత స్థాయిలో మద్దతు లభించడం లేదనే టాక్‌ ఆ పార్టీలో నడుస్తోంది. పార్టీలోనే ఉంటూ పక్కలో బల్లాలుగా తయారైన పార్టీ ముఖ్య నాయకులను తన వైపునకు తిప్పుకోవడంలో రజనీ ఫెయిల్‌ అవుతారా.. సక్సెస్‌ అవుతారా అనే చర్చ కూడా నియోజక వర్గంలో తీవ్రంగా ఉంది. గత ఎన్నికల్లో చిలకలూరిపేటలో రచించిన వ్యూహాన్నే గుంటూరు వెస్ట్‌లోను రచించే అవకాశం ఉందని.. అదే జరిగితే వైఎస్‌ఆర్‌సీపీకి కొంత వరకు ఊరట కలిగినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
చిలకలూరిపేట నియోజక వర్గంలో రాజకీయ అవగాహన ఉన్న యూత్‌ను తయారు చేసి ఒక్కొక్కరికి ఒక్కో బుల్లెట్‌ కొనిచ్చి.. ఇంటింటికి పంపించి ప్రచారం చేయించారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచన చేసినా రజనీ దానిని ఆచరణలో మాత్రం పెట్ట లేదు. ఎన్నికలు మరో నెల రోజులు మాత్రమే ఉన్నాయి.
ఎత్తులు..పై ఎత్తులు
ఇరు పార్టీల వారు వ్యూహ..ప్రతి వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను తాము గెలవాలంటే.. తాము గెలవాలనే ఆలోచనలతో కావాలసిన ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ముఖ్య కార్యకర్తల ద్వారా ఇంటింటి ప్రచారం చేయిస్తూ వీధుల్లో అభ్యర్థి ద్వారా.. రాత్రుల సమయాల్లో సభులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
Read More
Next Story