రాహుల్ ‘శోక్ నగర్’ కు వెళతారా ?
రాహుల్ హైదరాబాదుకు రావటం బీఆర్ఎస్(BRS) కీలక నేత హరీష్ రావుకు(Harish Rao) ఇష్టం లేనట్లుంది.
రాజకీయాలు సిద్ధాంతాల మీద కాకుండా రాద్ధాంతాల మీదే నడుస్తోంది. ఒకపుడు రాజకీయాల్లో వ్యక్తిగత అసూయ, ధ్వేషాలు అంతగా ఉండేవి కావు. అంశాల వారీగా ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పనితీరును మాత్రమే ప్రతిపక్షాలు విమర్శించేవి. అధికార, ప్రతిపక్షాల సభ్యులు రెగ్యులర్ గా కలుసుకుంటు ఆత్మీయంగానే ఉండేవారు. కారణం ఏమిటంటే అప్పటి తరం నేతల్లోని విలువలు, గెలుపోటములను స్పోర్టివ్ గా తీసుకోవటమే. ఇపుడు వ్యవహారమంతా తల్లకిందులైపోయింది. పొద్దున లేస్తే ఒకళ్ళని మరోకొళ్ళు నోటికొచ్చినట్లు బూతులు తిట్టుకోవటం, అవమానించుకోవటమే కనబడుతోంది. ఇపుడు ఇదంతా ఎందుకంటే మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నగరంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. రాహుల్ హైదరాబాదుకు రావటం బీఆర్ఎస్(BRS) కీలక నేత హరీష్ రావుకు(Harish Rao) ఇష్టం లేనట్లుంది.
అందుకనే రాహుల్ రాకపైన సెటైర్లు పేల్చారు. హైదరాబాద్(Hyderabad) వస్తున్న సందర్భంగా రహుల్ ‘శోక్ నగర్’ కు వెళ్ళాలని హరీష్ సూచించారు. శోక్ నగర్ అంటే ఏమిటయ్యా అంటే అశోక్ నగర్(Ashok Nagar) అట. అశోక్ నగర్ ను హరీష్ శోక్ నగర్ గా మార్చేశారు. ఇంతకీ రాహుల్ శోక్ నగర్ కు ఎందుకు వెళ్ళాలంటే నిరుద్యోగులు, టీజీపీస్సీ(TGPSC) అభ్యర్ధులను పరామర్శించటానికట. ఎందుకు పరామర్శించాలి ? ఎందుకంటే ఈమధ్యనే టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అందులో మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయ్యే అభ్యర్ధుల విషయంలో విధివిధానాలు ఖరారు చేస్తు ప్రభుత్వం జీవో నెంబర్ 29 జారీచేసింది. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం జారీచేసిన జీవో 55 ప్లేసులో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం జీవో 29 విడుదల చేసింది. జీవో 29 వల్ల తమకు చాల అన్యాయం జరుగుతుందని రిజర్వుడు క్యాటగిరీల్లోని అభ్యర్ధులు సరిగ్గా పరీక్షకు ముందు నానా రచ్చచేశారు. వెంటనే జీవో 29 రద్దుచేయాలని డిమాండ్ చేస్తు రోజుల తరబడి నానా గోలచేశారు.
అభ్యర్ధులకు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ(BJP) నేతలు రంగంలోకి దిగి ఎంత గోలచేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. జీవో 29ని ఛాలెంజ్ చేస్తు కొందరు అభ్యర్ధులు హైకోర్టు, సుప్రింకోర్టులో కేసులు వేసినా ఉపయోగం లేకపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడిన కేసులను కోర్టులు కొట్టేశాయి. దాంతో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే మెయిన్స్ పరీక్షలు జరిగిపోయాయి. పరీక్షలను రాసినవాళ్ళు రాశారు వద్దనుకున్నవాళ్ళు రాయలేదు. దాంతో రేవంత్ ప్రభుత్వం మీద అందరిలోను మండిపోతోంది. అభ్యర్ధుల ఆందోళనలకు కేంద్రస్ధానం అశోక్ నగర్. అందుకనే రాహుల్ ను అభ్యర్ధులుండే అశోక్ నగర్ కు పంపించాలన్నది హరీష్ ప్లాన్ గా అర్ధమవుతోంది. ఒకవేళ రాహుల్ గనుక అశోక్ నగర్ కు వెళితే అభ్యర్ధులు హారతులిచ్చి దణ్ణంపెడతారా ? మీదకు ఎగబడి దుమ్ముదులిపేయకుండా ఊరుకుంటారా ? ఆ విషయం తెలిసి, అలా జరగాలనే హరీష్ శోక్ నగర్ కు రాహుల్ వెళ్ళాలని సూచించింది.
అయితే రాహుల్ ఏమైనా పిచ్చోడా ? తెలంగాణాలో మాత్రమే రాజకీయాలు చేసే హరీష్ కే ఇంత తెలివుంటే దేశవ్యాప్తంగా రాజకీయాలు చేస్తున్న రాహుల్ కు ఇంకెంత తెలివుండాలి. తెలంగాణాలోని పరిస్ధితులను తెలుసుకోలేనంత అమాయకుడా రాహుల్ ? అశోక్ నగర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం శోక్ నగర్ గా ఎలా మార్చిందో కళ్ళారా చూడాలని రాహుల్ ను హరీష్ కోరారు. అప్పటికి బీఆర్ఎస్ హయాంలో అశోక్ నగర్ ను ఉద్యోగ్ నగర్ గా మార్చేసినట్లుగా హరీష్ బిల్డప్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.