రఘురామ కల నెరవేరుతుందా?
ఎంపీ రఘురామకృష్ణమరాజు రాజకీయాల్లో ఉండాలనే కల నెరవేరింది. కానీ ప్రజా ప్రతి కావాలనే కల నెరవేరుతుందా?
జి. విజయ కుమార్
గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే గెలిచిన ఆరు నెలల తర్వాత నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో జగడం పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జగడం కొనసాగుతూనే ఉంది. సీఎంపై కోర్టు కేసులు వేయడం.. ఆయన బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టాలని కేసులు వేయడం.. పలు అంశాలపై పోలీసు కేసులు పెట్టడం ఆయనకు సాధారణంగా మారిపోయింది. ఇవన్నీ భరింలేక సీఎం వైఎస్ జగన్ ఏకంగా రాజ ద్రోహం కేసు పెట్టి అరెస్టు చేశారు. అప్పట్లో పోలీసులు ఆయనకు నాలుగు అంటించారనే పుకార్లు కూడా చక్కర్లు కొట్టాయి.
తిరిగి 2024 ఎన్నికలు దగ్గరకు రావడంతో జగన్ మోహన్‌రెడ్డి ఎలాగూ దగ్గరు రానివ్వరు కాబట్టి టీడీపీ అధినేత చంద్రబాబును ఆశ్రయించి.. శుక్రవారం టీడీపీలో చేరారు. చేరిన దగ్గర నుంచి చంద్రబాబుతో పాటే తిరుగుతూ తనకు ఎలాగైనా ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంతెన రామరాజున్నారు. తెలుగుదేశం పార్టీ ఇటీవలే విడుదల చేసిన జాబితాలో మంతెన రామరాజుకే టికెట్ ఖరారు చేసింది. అయితే రఘురామకృష్ణమరాజు పార్టీలో చేరగానే నిప్పు రాజేశారు. ప్రస్తుతం ఉండి నియోజక వర్గంలో ఆ నిప్పు రాజుకుంటోంది. 2014లో ఎన్నికల్లో పోటీ చేసి వేటుకూరి శివరామరాజుకు టికెట్ దక్కక పోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అంటే ఇప్పుడు ఉండి నియోజక వర్గంలో మూడు కుంపట్లు ఏర్పడ్డాయి. రఘురామకృష్ణమరాజుకు చంద్రబాబు ఉండి సీటు ఇస్తారా.. ఇవ్వరా.. అనేది తేలాల్సి ఉంది.
రఘురామ ఎక్కడ ఉన్నా కుంపట్లేనా
రఘురామకృష్ణమరాజు రాజకీయాల్లోకి గత ఎన్నికల ద్వారా మాత్రమే వచ్చారు. అది కూడా వైఎస్ జగన్ ఆయనకు అవకాశం కల్పించడం వల్లే సాధ్యమైంది. అయితే ఈ ఐదేళ్ల కాలంలో బిజెపీ వాళ్లు నా వాళ్లే, తెలుగుదేశం పార్టీ వారు నా వాళ్లే.. జనసేన పవన్ కల్యాణ్‌కూడా నేను ఏది చెబితే అది చేస్తారంటూ దర్పాలు పలుకుతూ వచ్చారు. చివరకు ఏ ఒక్కరు దగ్గరకు రానివ్వలేదు. ఈ దశలో చంద్రబాబును ఎలాగో అలా బుట్టలో వేసిన రఘురామ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు తెర లేపారు.
ప్రచార ఆర్భాటమేనా?
ఉండి టికెట్ రఘురామకు ఖరారు అయ్యిందని పలు వెబ్‌సైట్లు.. సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కొన్ని వెబ్‌సైట్లలో టికెట్ ఖరారు అయిపోయిందనే వార్తలు కూడా వెలువడ్డాయి. ఇది కేవలం ప్రచారం వరకే పరిమితమా.. లేక ఖచ్చితంగా టికెట్ సంసాదిస్తారా.. అనేది ఇంకా రూఢీ అవ్వ లేదు.
చంద్రబాబుతోనైనా సఖ్యతగా ఉంటారా?
తెలుగుదేశం పార్టీలో చేరిన రఘురామ వైఎస్ జగన్‌పై వ్యవహరించినట్లుగా చంద్రబాబుపైన కూడా చేస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆయన చెప్పింది చేయకపోతే తిరుగుబాటు చేయడం ఖాయమనేది పలువురి వాదన. అయితే ఒక సారి రాజకీయాల్లో దెబ్బతిన్న తర్వాత అదే ధోరణితో ముందుకెళ్తే బోర్లా పడుతారని తెలియంది కాదని.. అందుకే సర్థుబాటు ధోరణితో వెళ్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక్కడ సర్థుబాట్ల కంటే రఘురామకు తాను రాజునని.. ఆ హోదాలోనే ఎక్కువగా మోజున్నట్లు పలువురు చెబుతుంటారు. సందిగ్ద రాజకీయ ఊబిలో ఉన్న రఘురామకృష్ణమరాజు రాజకీయ జీవితం రానున్న ఐదేళ్లల్లో సాఫీగా సాగుతుందా.. ఒడిదుడుకులతోనే సాగుతుందా.. వేచి చూడాల్సిందే.
Next Story