రాజకీయ బదిలీ ఎమ్మెల్యేలు గెలిచేనా ?
x

రాజకీయ బదిలీ ఎమ్మెల్యేలు గెలిచేనా ?

సీఎం జగన్‌ రాజకీయ బదిలీల కొత్త ప్రయోగం బెడిసి కొట్టేనా. అభ్యర్థులను వెంటాడుతున్న లోకల్, నాన్‌లోకల్‌ ఫీలింగ్‌.


వైఎస్‌ఆర్‌సీపీలో రాజకీయ బదిలీలకు గురైన అభ్యర్థులు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో వారు ఎదురీదతున్నట్లు చర్చించుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రాజకీయ బదిలీలు అనే కొత్త ప్రయోగం, వ్యూహం కాస్తా బెడిసి కొట్టే చాన్స్‌ ఉందని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఎక్కువుగా ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేలనే రాజకీయ బదిలీలు చేపట్టారనే విమర్శలు కూడా ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాల నుంచి కాకుండా వేరే నియోజక వర్గాలకు మార్చారు. వీరిలో కొంత మందిని అసెంబ్లీ నుంచి పార్లమెంట్‌కు బదిలీ చేయగా మరి కొంత మందిని అసెంబ్లీ నుంచి పార్లమెంట్‌కు పంపారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన అనిల్‌కుమార్‌ యాదవ్, కిలారు రోశయ్య వంటి వారిని ఎంపీ అభ్యర్థులుగా బరిలో దింపారు. సిట్టింగ్‌ ఎంపీలుగా ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వంగ గీత వంటి నేతలను ఎమ్మెల్యేలుగా బరిలో దింపారు. ఇక పదుల సంఖ్యలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్థానాలను మార్చారు.

వెంటాడుతోన్న స్థానికత సమస్య
గతంలో గెలిచిన స్థానాల్లో నుంచే బరిలోకి దింపి ఉండే వైఎస్‌ఆర్‌సీపీకి అడ్వాంటేజీగా ఉండేదని, స్థానాలు మారడంతో వారికి గెలుపు అవకాశాలు తగ్గాయనే టాక్‌ కూడా ఆ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది. అక్కడ కొత్త కావడం, స్థానికల నేతలతో సత్సంబంధాలు లేక పోవడం, స్థానిక సమస్యల పట్ల అవగాహన లేక పోవడం, స్థానిక ప్రజలకు వీరిపైన విశ్వాసం తగ్గడం వంటి పలు సమస్యలు వీరిని వెంటాడుతున్నాయి. వీటన్నింటికంటే స్థానికత పెద్ద సమస్యగా మారింది. నాన్‌ లోకల్, లోకల్‌ అనే ఫీలింగ్‌ ఈ ఎన్నికల్లో అధికమైంది. అభ్యర్థులు లోకలా, నాన్‌ లోకలా అనేది ప్రజలు, స్థానికులు ఆలోచనలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. రాజకీయ బదిలీలకు గురైన వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల గెలుపు ఓటముల్లో లోకల్, నాన్‌ లోకల్‌ ఫ్యాక్టర్‌ ప్రభావం ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.
దీంతో పాటుగా ఆయా నిజయోక వర్గాల్లో టీడీపీ నుంచి గట్టి అభ్యర్థులు రంగంలో ఉండటం కూడా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు మైనస్‌గా మారింది. స్థానికంగా టీడీపీ నేతలు స్ట్రాంగ్‌గా ఉండటం, ఓటర్లు, ప్రజల్లో మంచి హోల్డింగ్‌ కలిగి ఉండటం, స్థానిక సమస్యలపై ఎప్పటి నుంచో ఫైట్‌ చేస్తుండటం, వాటి పరిష్కారాలకు కష్టపడి పని చేసి ఉండటం వంటి అంశాలు టీడీపీ అభ్యర్థులకు ప్లస్‌గాను, రాజకీయ బదిలీలకు గురైన వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల మైనస్‌గాను మారాయనే చర్చ కూడా స్థానికుల్లో జరుగుతోంది.
రాజకీయ బదిలీలకు గురైన అభ్యర్థులు వీరే
తలారి రంగయ్యను అనంతపురం పార్లమెంట్‌ నుంచి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దింపారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబు రంగంలో ఉన్నారు. మార్గాని భరత్‌రామ్‌ను కూడ రాజమండ్రి పార్లమెంట్‌ నుంచి రాజమండ్రి సిటీ అభ్యర్థిగా బరిలో దింపారు. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. చెల్లుబోయిన వేణుగోపాల్‌ను కూడా రాజకీయ బదిలీ చేశారు. ఆయన రాజమండ్రి రూరల్‌ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీలో ఉన్నారు. 2019లో రామచంద్రాపురం నుంచి గెలిచి మంత్రి అయ్యారు. 2014లో రాజమండ్రి రూరల్‌ నుంచి పోటీ చేసి ఓడి పోయారు. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. మరో మంత్రి తానేటి వనితకు కూడా స్థాన మార్పిడి తప్పలేదు. ఆమెను కొవ్వూరు నుంచి గోపాలపురంకు మార్చారు. ఇక్కడ మద్దిపాటి వెంకటరాజు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో గోపాలపురం నుంచి గెలిచిన తలారి వెంకటరవును కొవ్వూరుకు రాజకీయ బదిలీ చేశారు. ఇక్కడ ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు.
మాజీ మంత్రి మేకతోటి సుచరితను కూడా స్థానం మార్చారు. ప్రత్తిపాడు నుంచి రెండు సార్లు గెలిచిన సుచరితను తాడికొండకు పంపారు. ఇక్కడ టీడీపీ సీనియర్‌ నేత తెనాలి శ్రావణ్‌ కుమార్‌ టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. మరో మంత్రి విడదల రజనికి కూడా రాజకీయ బదిలీ తప్ప లేదు. చిలకలూరిపేట నుంచి గెలిచిన ఆమెను గుంటూరు పశ్చిమకు మార్చారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పిడుగురాళ్ల మాధవి రంగంలో ఉన్నారు. మరో మంత్రి జోగి రమేష్‌కు కూడా ఈ సారి నియోజక వర్గం మార్చారు. పెడన నుంచి గెలిచిన ఆయనను పెనమలూరుకు పంపారు. ఇక్కడ బోడె ప్రసాద్‌ టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. మరో మంత్రి మేరుగ నాగార్జునను కూడా రాజకీయ బదిలీ చేశారు. గత ఎన్నికల్లో వేమూరు నుంచి గెలిచారు. అయితే ఈ సారి వేమూరు నుంచి కాకుండా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజక వర్గానికి పంపారు. వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, మంత్రి ఆదిమూలపు సురేష్‌కు కూడా అదే పరిస్థితులు వచ్చాయి. ఎర్రగొండపాలెం నుంచి గెలిచిన ఆయనను కొండపికి బదిలీ చేశారు. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి మరో సారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి అంతకుముందు 2009లో పీఆర్‌పీ నుంచి గెలిచిన అన్నా రాంబాబును ఈ సారి మార్కాపురం పంపారు. 2024 ఎన్నికల్లో మార్కాపురం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి కందుల నారాయణరెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కనిగిరి నుంచి గెలిచిన బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు కూడా రాజకీయ బదిలీ తప్ప లేదు. ఈయన కందుకూరు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. నెల్లూరు సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నెల్లూరు రూరల్‌కు బదిలీ చేశారు. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. మరో సిట్టింగ్‌ ఎంపీని కూడా ఈ సారి రాజకీయ బదిలీ చేశారు. విశాఖ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను అక్కడ నుంచి విశాఖ తూర్పు నియోజక వర్గానికి మార్చారు. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ నుంచి మరో సారి బరిలో ఉన్నారు. మరో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు కూడా స్థాన మార్పిడి తప్ప లేదు. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గెలిచారు. ఈ సారి అక్కడ నుంచి గాజువాకకు మార్చారు. ఇక్కడ పల్లా శ్రీనివాసరావు టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో రాజాం నుంచి గెలిచిన కంబాల జోగులును అక్కడ నుంచి బదిలీ చేశారు. పాయకాపురం నియోజక వర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా బరిలో పెట్టారు. ఇక్కడ టీడీపీ సీనియర్‌ నేత వంగలపూడి అనిత బరిలో ఉన్నారు. కాకినాడ ఎంపీగ ఉన్న వంగ గీతను అసెంబ్లీకి మార్చారు. పిఠాపురం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీలో పెట్టారు. ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రంగంలో ఉన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా అసెంబ్లీ మార్పి తప్ప లేదు. విజయవాడ పశ్చిమ నుంచి విజయవాడ సెంట్రల్‌కు మార్చారు. ఇక్కడ టీడీపీ సీనియర్‌ నేత బొండా ఉమా రంగంలో ఉన్నారు. మరో మంత్రి ఉష శ్రీచరణ్‌ను కూడా రాజకీయ బదిలీ చేశారు. కళ్యాణదుర్గం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఆమెను ఈ సారి పెనుకొండకు మార్చారు. సవిత టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ రంగంలో ఉన్నారు.


Read More
Next Story