
JANASENA | ప్రత్యామ్నాయ గొంతుకగా పవన్ కల్యాణ్ ఎదిగేనా?
జనసేన మార్చి 14న నిర్వహించే 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు కాకినాడ సమీపంలోని చిత్రాడ ముస్తాబైంది. ఈ వేదిక నుంచి పవన్ ఏమి సందేశం ఇస్తారనేది ప్రస్తుత చర్చనీయాంశం..
జనసేన పార్టీ మార్చి 14న నిర్వహించే 12వ ఆవిర్భావ దినోత్సవం, విజయోత్సవ సభకు కాకినాడ సమీపంలోని చిత్రాడ ముస్తాబైంది. 60 ఎకరాల విస్తీర్ణం, సువిశాల వేదిక, ఓ పక్కన సాంస్కృతిక కార్యక్రమాలకు స్టేజీ, మరోపక్క భారీ ఎల్సీడీ, ఎల్ఇడీ స్క్రీన్లు, గ్యాలరీలు, బారికేడ్లు, టెంట్లు, మీడియాకు వేదిక వంటి వాటితో తయారవుతోంది. వేలాది కుర్చీలు ప్రాంగణానికి చేరుతున్నాయి. ట్రాక్టర్లు రేయింబవళ్లు తిరుగుతున్నాయి. ఊళ్లకు ఊళ్లు కదిలేలా బస్సులు సిద్ధమవుతున్నాయి. అన్నపానీయాలు తయారవుతున్నాయి. దాహార్తిని తీర్చేలా అడుగడుగునా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు వచ్చిపోయే వాళ్లకు ఏ సౌకర్యం లేకుండా చిత్రాడకు వచ్చే నలుదిక్కులా రోడ్లపై మంచినీరు, పుచ్చకాయలు, స్వీట్లు, హాట్లు సిద్ధం అవుతున్నాయి. మొత్తం మీద 2016 జనవరి 31న 'హలో కాపు.. చలో తుని' పేరిట ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా ఏ తరహా సందడి నెలకొందో ఇప్పుడు కాకినాడ, పిఠాపురం మధ్య కూడా అంతే సందడి నెలకొంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి గెలిచారో ఆ పిఠాపురంలోనే ఈ చిత్రాడ గ్రామం ఉంది. అందుకే ఈ సభను విజయోత్సవ సభగా, ధన్యవాద సభగా కూడా పిలుస్తున్నారు. తన గెలుపునకు గుర్తుగా పవన్ కళ్యాణ్ అక్కడే సభను పెట్టారు. ఈ సభకు 4 లక్షలకుపైగా పార్టీ కార్యకర్తలు, నాయకులు హాజరవుతారని అంచనా. దీని కోసం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భవిష్యత్ రాజకీయానికి దిశానిర్దేశం!
మార్చి 14, 2025 – జనసేన పార్టీ తన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా జరుపుకోనుంది. 2014లో పవన్ కళ్యాణ్ స్థాపించిన ఈ పార్టీ, ఒక దశాబ్ద కాలంలో ఎన్నో ఉత్కంఠభరితమైన పరిస్థితులను ఎదుర్కొంది. 2019 ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి, 2024లో తిరుగులేని విజయం సాధించడం వరకు జనసేన ఒక విశేషమైన ప్రయాణాన్ని కొనసాగించింది. ఈసారి ఈ సభ 2024లో పార్టీ విజయం అనంతరం, భవిష్యత్తు వ్యూహాలకు కొత్త రూపం ఇచ్చే అత్యంత కీలక వేదికగా మారనుంది.
2024 ఎన్నికల విజయంతో జనసేనకు కొత్త ఊపు...
2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని 100% విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం ద్వారా పవన్ కళ్యాణ్, తన పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రాముఖ్యతను తీసుకురాగలిగారు. జనసేన బలంగా ఎదిగేలా వ్యూహాత్మకంగా పని చేసి, ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా మారింది. ఈ విజయంతో పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, గెలిచిన తరువాత పార్టీ ముందున్న సవాళ్లు, కొత్త లక్ష్యాల గురించి జనసేన శ్రేణులు ఈ సభలో చర్చించబోతున్నారు.
ఈ ఆవిర్భావ సభ ప్రత్యేకత ఏమిటి?
జనసేన పార్టీ తన 12వ ఆవిర్భావ సభను ఎంతో ఘనంగా నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, జనసేన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటించే వేదిక కూడా. ఈ సభలో పార్టీ వ్యవస్థాపక నిర్మాణం, స్థానిక ఎన్నికల వ్యూహం, పాలనలో జనసేన పాత్ర, ప్రభుత్వ విధానాలపై జనసేన పోరాటం, ప్రజా సంక్షేమం కోసం చేపట్టబోయే కార్యక్రమాలు వంటి అనేక కీలక అంశాలు చర్చకు రానున్నాయి.
వాస్తవానికి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ప్లీనరీని కూడా నిర్వహిస్తామని పార్టీ నేతలు గతంలో ప్రకటించారు. అయితే అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ నడుస్తుండడంతో అనివార్య కారణాల వల్ల ఆ ప్లీనరిని వాయిదా వేసి ఆవిర్భావ సభ లేదా విజయోత్సవ సభను నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సభా వేదిక నుంచి పవన్ కల్యాణ్ ఎటువంటి సందేశాన్ని ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ విధివిధానాలతో పాటు భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటిస్తారని భావిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, క్యాడర్‌ను క్రమశిక్షణాయుతంగా నడపడం, పాలనలో పార్టీ బాధ్యతలను మరింత స్పష్టంగా నిర్వచించడం వంటి అంశాలపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
పార్టీ భవిష్యత్ దిశను నిర్ణయించే తీర్మానాలు..
ఈ సభలో జనసేన పార్టీ పలు ముఖ్యమైన తీర్మానాలను ప్రతిపాదించబోతోంది:
1. పార్టీ నిర్మాణ బలోపేతంపై తీర్మానం
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు.
పార్టీ అభ్యర్థుల ఎంపికకు నూతన ప్రమాణాలు రూపొందించడం.
బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం చేయడం.
యువ నాయకులకు అవకాశం కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు రూపొందించడం.
2. స్థానిక ఎన్నికల వ్యూహంపై తీర్మానం
త్వరలో జరిగే పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని అధికారికంగా ప్రకటించే అవకాశం.
టీడీపీ, బీజేపీతో పొత్తు కొనసాగించాలా? లేక స్వతంత్రంగా పోటీ చేయాలా? అనే అంశంపై స్పష్టత.
పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన నూతన మార్గదర్శకాలను రూపొందించడం.
3. పాలనలో జనసేన పాత్రపై తీర్మానం
జనసేన మంత్రుల బాధ్యతలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ.
ప్రభుత్వ విధానాలను సమీక్షించి, లోపాలను సరిదిద్దే విధంగా జనసేన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం.
సంక్షేమ పథకాలను పాలనా సంస్కరణలతో మరింత మెరుగుపరిచే మార్గాలను సూచించడం.
4. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా జనసేన పోరాట తీర్మానం
రైతుల సమస్యలు, నిరుద్యోగుల కోసం ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురి చేయడం.
మహిళా భద్రత, విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక ఫోకస్.
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై స్పష్టమైన డిమాండ్లు.
ప్రభుత్వ అవినీతిని నిరోధించేందుకు పవన్ కళ్యాణ్ కొత్త కార్యక్రమాలు ప్రకటించే అవకాశం.
"జనసేన కాపుల పార్టీ" అనే విమర్శలకు సమాధానం
జనసేనపై తరచుగా వచ్చే విమర్శల్లో ఒకటి "ఇది కేవలం కాపుల పార్టీ" అని. కానీ, గణాంకాలను పరిశీలిస్తే ఇది పూర్తిగా రాజకీయ ఆరోపణ మాత్రమే అని స్పష్టమవుతుంది. ఇటీవలికాలంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన కొన్ని నియామకాలు, ఎమ్మెల్సీ సీటును తన సోదరుడు నాగబాబుకు ఇవ్వడం వంటివి చేశారు. దీనిపై కూడా పవన్ కల్యాణ్ మరింత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారని భావిస్తున్నారు.
2024లో గెలిచిన 21 మంది జనసేన ఎమ్మెల్యేలలో అన్ని వర్గాలకు చెందిన నేతలు ఉన్నారు.
పవన్ కళ్యాణ్ బీసీలకు, ఎస్సీలకు, ముస్లింలకు, ఇతర వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు.
జనసేన 2019లో బీఎస్పీతో పొత్తు పెట్టుకుని దళితుల రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించింది.
కేవలం ఒక వర్గానికి మద్దతుగా కాకుండా, సమస్త వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా జనసేన రాజకీయ యాజమాన్యాన్ని రూపొందిస్తోంది.
ప్రభుత్వంలో ఉన్నప్పటికీ జనసేన పోరాటం ఎలా?
జనసేన ప్రస్తుతం ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పటికీ, ప్రజా సమస్యలపై రాజీపడే పార్టీ కాదు. ప్రభుత్వంలో ఉన్నా, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సమీక్షించి, లోపాలను ఎత్తిచూపే విధంగా జనసేన ప్రత్యేకంగా ముందుకు సాగనుంది.
రైతుల సమస్యలు, నిరుద్యోగుల భరోసా, మహిళా సంక్షేమం, విద్యా రంగ అభివృద్ధి కోసం జనసేన నిరంతరంగా ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేయబోతోంది.
జనసేన మంత్రులు ప్రభుత్వంలో ఉన్నా, ప్రజా సమస్యలపై స్వతంత్రంగా స్పందిస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేయడం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
జనసేన ఆవిర్భావ సభ 2024 అసెంబ్లీ విజయాన్ని అధికారికంగా ప్రకటించే వేదిక మాత్రమే కాదు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు పునాది వేయనున్న సభ కూడా. పార్టీకి ముందున్న సవాళ్లు, విభజన రాజకీయాలపై పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు, ప్రజల ఆకాంక్షలతో పార్టీ ఎలా ముందుకు వెళ్లబోతోందనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ సభలో పవన్ కళ్యాణ్ చేయబోయే కీలక రాజకీయ ప్రకటనలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే విధంగా ఉండబోతున్నాయి. జనసేన భవిష్యత్తు దిశగా నవతరంగ రాజకీయం సాగించబోతోంది!
పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం జరిగిన తొలి సాధారణ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ఈ పార్టీ ప్రారంభమైంది. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2019లో మాత్రం వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే, ఆ ఎన్నికల్లో పార్టీ తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు.
ఈ పరాజయం తర్వాత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా పార్టీ పునర్నిర్మాణం చేపట్టి, 2024లో విశేష విజయాన్ని సాధించేందుకు పార్టీని నడిపించారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా పోటీ చేసిన జనసేన, 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. శాతం 100% విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, బలమైన క్యాడర్ ఉన్నా, జనసేన ఇంకా పునాదిస్థాయిలో బలమైన నేతృత్వాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది.
జనసేన ఆవిర్భావ సభలు ప్రతిసారి కీలక రాజకీయ ప్రకటనల వేదికగా మారుతూ వస్తున్నాయి. 2017లో పవన్ కళ్యాణ్ అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీపై యుద్ధం ప్రకటించగా, 2022లో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలను ఏకత్రితం చేయాలనే సంకల్పాన్ని ప్రకటించారు. ఆ తరువాత, టీడీపీ, బీజేపీతో పొత్తు కుదిరేలా చొరవ తీసుకున్నారు. జనసేనకు కేటాయించిన 24 స్థానాల్లో 3 స్థానాలను బీజేపీకి అప్పగించారు.
ఈసారి, పవన్ కళ్యాణ్ పార్టీ భారీస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నట్లు భావిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. మహిళా కార్యకర్తల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయిలో కమిటీల ఏర్పాటు కూడా త్వరలో చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా జనసేన పొలికేక పెడుతుందా లేక పిఠాపురం వరకే పరిమితం అవుతుందో భవిష్యత్ నిర్ణయిస్తుంది.
Next Story