పాండురంగ హై స్కూల్ ఎన్సీసీ యూనిట్ ఉంటుందా?
x

పాండురంగ హై స్కూల్ ఎన్సీసీ యూనిట్ ఉంటుందా?

ఎన్సీసీ మాస్టారుకు ప్రమోషన్ వచ్చి వేరే స్కూలుకు వెళ్లిపోయారు. ఆయనను తిరిగి తీసుకొచ్చినా, లేక ఎన్సీసీ నుంచి ప్రత్యేకంగా తీసుకున్నా యూనిట్ నడుస్తుంది.


మచిలీపట్నంలోని చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాల ఎన్సీసీ యూనిట్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ స్కూలులో ఎన్సీసీని కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. మంత్రి కొల్లు రవీంద్ర కూడా తల్లిదండ్రుల నుంచి విని మిన్నకుండి పోయారు.

కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మొత్తం తొమ్మిది నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటన్నిటిలో కెల్లా 700 పై చిలుకు విద్యార్థులతో కిటకిటలాడే పాఠశాల చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలలో అడ్మిషన్ దొరకాలంటే ఏడాది ముందు నుంచే ప్రయత్నించడం, రాజకీయ నాయకుల సిఫార్సులు కూడా ఉంటాయంటే ఈ స్కూల్ కి ఉన్న డిమాండ్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఏ ఉన్నతాధికారులైనా, మంత్రులైనా పాఠశాలల్ని సందర్శించాలంటే ముందుగా జిల్లా విద్యాశాఖకు గుర్తొచ్చే పాఠశాల ఇదే. కారణం కలెక్టర్ కార్యాలయానికి, జిల్లా యంత్రాంగానికి కూతవేటు దూరంలో ఉండడమే. రెండేళ్లుగా పదోతరగతి ఫలితాల్లో కూడా నగరంలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రైవేటు పాఠశాల విద్యార్థులు సైతం ఇక్కడికి క్యూ కట్టేలా అక్కడి విద్యా విధానం ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.


విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్ష, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కృషి అప్పటి ఉపాధ్యాయులు, స్థానికుల శ్రమ కారణంగా మూడేళ్లుగా నిర్విరామంగా ప్రయత్నించగా చిలకలపూడి పాఠశాలకు ఎట్టకేలకు ఎన్సీసీ యూనిట్ 2024 లో మంజూరు అయింది. స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇంచార్జి బండి రామకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం, మాజీ కౌన్సిలర్ కొట్టే వెంకట్రావు లచే ఎంతో అట్టహాసంగా యూనిట్ ప్రారంభమైంది. 50 మంది క్యా డేట్లుతో మొదటి బ్యాచ్ ఏడాది పాటు శిక్షణ పూర్తి చేసుకుంది. గత మార్చిలో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు కూడా పాఠశాలను సందర్శించి క్యాడెట్లకు క్యాంప్ కిట్స్ అందజేశారు. యూనిట్ నడపడానికి అప్పట్లో పాఠశాలలో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల్లో ఎన్సీసీ నిబంధనలకు అనుగుణంగా శారీరక ధారుడ్యం, 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు ఎవరూ లేకపోవడంతో అప్పటి ప్రధాన ఉపాధ్యాయుడు కోరికపై ఈ పాఠశాలలో ఎస్జీటీగా ఉన్న ఏవి రామాంజనేయులు ముందుకు వచ్చి అదనంగా ఎన్సీసీ యూనిట్ బాధ్యతలు తీసుకుని కేర్టెకర్ గా వ్యవహరించారు.


మహారాష్ట్ర కామ్టీ లో ఈ ఏడాది ఆగస్టు లో జరిగే మూడు నెలల శిక్షణకు రామాంజనేయులు హాజరవడానికి వీలుగా 16 ఆంధ్రా బెటాలియన్ తరుపున అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ తరుణంలో ఏవి రామాంజనేయులుకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ (పిఎస్) పదోన్నతి లభించింది. దీనికి ముందే బదిలీలు జరగడంతో చిలకలపూడి పాఠశాలలో ఉన్న పిఎస్ పోస్టులు మొత్తం ఖాళీలు చూపించడం వల్ల రామాంజనేయులు ఈ పాఠశాలలో ప్రమోషన్ తీసుకునే అవకాశం లభించలేదు. ఖాళీల్లో వేరే టీచర్లు చేరిపోయారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ఎవరూ అదనంగా ఎన్సీసీ యూనిట్ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాకపోవడం వల్ల యూనిట్ ఆగిపోయే పరిస్థితి దాపురించింది. ఇప్పటి వరకు వంద మంది ఎన్సీసీ విద్యార్థులు ఉంటే ఈ ఏడాది ఈ సంఖ్య వందకు పెరుగుతుందని అంచనా.


ప్రమోషన్ల ప్రక్రియకు ముందే ఇలా జరిగే అవకాశం ఉందనీ, అదే జరిగితే యూనిట్ ఆగిపోతుందని ప్రస్తుతం ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే విషయం పై ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ వారి కార్యాలయం నుంచి కూడా డీఈఓ కి రిక్వెస్ట్ లెటర్ వెళ్ళింది. అయినా జిల్లా విద్యాశాఖ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మచిలీపట్నం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో ఎన్సీసీ ఉన్న ఏకైక పాఠశాల చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాల మాత్రమే. ఎన్సీసీ లో జాయిన్ అయితే చక్కటి క్రమశిక్షణ, మంచి ఆరోగ్యం తో పాటు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ కూడా ఉంటుందన్న కారణంగా దూర భారాల్ని కూడా లెక్క చేయకుండా ఎంతోమంది విద్యార్థులు ఈ ఏడాది ఇక్కడ ప్రవేశం పొందారు. కానీ యూనిట్ ఆగిపోయే పరిస్థితి ఉందని తెలిసి వాళ్లంతా ఇప్పుడు తమ పిల్లల్ని పాఠశాలలో ఉంచాలా.. లేదా అనే సందిగ్ధంలో పడ్డారు.


ఈ ఏడాది రెండో బ్యాచ్ క్యాడెట్ల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా ఈ బాధ్యతలు చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో పాఠశాల విద్యా బృందం చేతులెత్తేసింది. ఈ విషయంపై ప్రస్తుత ఎన్సీసీ క్యాడేట్ల తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ తదితరులు స్థానిక మంత్రి కొల్లు రవీంద్రను కలిసి సమస్యను వివరించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి కూడా ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు. జిల్లా విద్యాశాఖాధికారి రామారావు ను సైతం కలిసి విషయం తీవ్రతను వివరించారు. కానీ రోజులు గడుస్తున్నా సానుకూల ఫలితం రాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉండగా పాండురంగ స్కూల్ ఎన్సీసీ యూనిట్ ఆగిపోతే దాన్ని చేజిక్కించుకోవడానికి నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్ పాఠశాల గోతి కాడ నక్కల కాచుకుని కూర్చుందని, ఒక్కసారి యూనిట్ చేజారిపోతే ఇంకా భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా లేకుండా పాఠశాల బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుందని స్థానికులు కలవరపడుతున్నారు. దీంతో ఇక చేసేది లేక పాఠశాల ప్రతిష్టను, తమ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల పూర్వ విద్యార్థుల సహకారంతో కొంతమంది తల్లిదండ్రుల బృందం వచ్చే వారంలో మంగళగిరి వెళ్లి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలవడానికి సిద్ధమయ్యారంటే ఈ విషయం తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు.

Read More
Next Story