‘మెడికల్‌ కాలేజీలు’ జగన్‌కు మైలేజీ తెస్తాయా?
x
విశాఖ వేపగుంట జంక్షన్లో అభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌

‘మెడికల్‌ కాలేజీలు’ జగన్‌కు మైలేజీ తెస్తాయా?

అధికారాన్ని కోల్పోయాక వైఎస్‌ జగన్‌కు మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మైలేజీని తెచ్చి పెడుతుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను మంజూరు చేసింది. వీటిలో ఐదు కాలేజీల్లో క్లాసులు కూడా మొదలయ్యాయి. కొన్ని కాలేజీలు నిర్మాణాన్ని పూర్తి చేసుకోగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీటి నిర్మాణాన్ని ఆపేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. దీనినే ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అస్త్రంగా మలచుకుంటున్నారు. ఈ మెడికల్‌ కాలేజీల ద్వారా పేదలకు ఉచితంగా మల్టీ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ స్థాయి వైద్యాన్ని అందించాలన్న తన లక్ష్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారంటూ దుయ్యబడుతున్నారు. ఇదే విషయాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి జగన్‌ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇందులోభాగంగా ఆయన తన హయాంలో మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలల సందర్శనకు శ్రీకారం చుట్టారు. ఇందుకు శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం వైద్య కళాశాల సందర్శనకు గురువారం మధ్యాహ్నం విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చారు.


తాళ్లపాలెం జంక్షన్లో వర్షంలో తడుస్తూ..

జన సందోహం నడుమ ప్రయాణం..
విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా మాకవరపాలెం వెళ్లేందుకు బయల్దేరారు. మార్గమధ్యలో ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి, అనకాపల్లి, తాళ్లపాలెం జంక్షన్‌లలో జనం పెద్ద సంఖ్యలో చేరుకుని జగన్‌కు అభివాదం చేశారు. ఆయా ప్రాంతాల్లో జగన్‌ వాహనాన్ని ముందుకు కదలకుండా అభివాదాలు చేస్తూ, జై జగన్‌. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. పెందుర్తి, అనకాపల్లి కొత్తూరు జంక్షన్, తాళ్లపాలెం జంక్షన్లలో జోరున వర్షం కురుస్తున్నా జగన్‌ తడుస్తూనే అక్కడున్న వారికి అభివాదాలు చేస్తూ ముందుకు సాగారు. షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు మాకవరపాలెం మెడికల్‌ కాలేజీకి చేరుకోవలసి ఉండగా మూడు గంటల ఆలస్యంగా :సాయంత్రం 4.30 గంటలకు చేరుకున్నారు. అక్కడ కాలేజీ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు. తన హయాంలో చేపట్టిన మెడికల్‌ కాలేజీల గురించి వివరించారు. సీఎం చంద్రబాబు మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వార్డులు, గ్రామాల్లో రచ్చబండ పేరిట నిరసనలు, సంతకాల సేకరణ, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ర్యాలీలు, ధర్నాలు వంటి కార్యక్రమాలు చేపడ్తానని ప్రకటించారు. ఇది రాజకీయంగా తనకు కలిసొచ్చే అంశంగా జగన్‌ భావిస్తున్నారు.
మార్గమధ్యలో వినతులు స్వీకరిస్తూ..
విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరిన వైఎస్‌ జగన్‌ను కాకానినగర్‌ వద్ద వైజాగ్‌ స్టీల్‌ప్లాంటు కార్మికులు, కార్మిక సంఘాల నేతలు కలిశారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని, కార్మికులకు అండగా నిలవాలని వినతి ప్రత్నాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన జగన్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అంగీకరించబోమని, కార్మికుల పోరాటానికి అండగా నిలుస్తామని, మరోసారి స్టీల్‌ప్లాంట్‌కు వస్తానని, ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని హామీ ఇచ్చారు. ఇందుకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. మార్గమధ్యలో జగన్‌ను అనకాపల్లి జిల్లా చోడవరం సుగర్స్‌ రైతులు, కార్మికులు కలిశారు. రైతులకు చెల్లింపులు, కార్మికుల జీతాల బకాయిలు రూ.35 కోట్లు ప్రభుత్వం చెల్లించక ఇబ్బందులు పడుతున్నామని మొరపెట్టుకున్నారు.
కేజీహెచ్‌లో గిరిజన బాలికలకు పరామర్శ..
మాకవరపాలెంలో మెడికల్‌ కాలేజీ సందర్శన అనంతరం వైఎస్‌ జగన్‌ విశాఖ కేజీహెచ్‌లో పచ్చకామెర్లతో బాధపడుతూ చికిత్స పొందుతున్న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలను పరామర్శించారు. స్కూల్లో ఆహారం నాణ్యత, మంచినీరు, మరుగుదొడ్లు, ఇతర వసతి సదుపాయాలపై ఆరా తీశారు. వారికి ధైర్యం చెప్పారు. బాలికలకు అందుతున్న వైద్యం, వారి ఆరోగ్య పరిస్థితిని కేజీహెచ్‌ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు రూ. 25లక్షలు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని జగన్‌ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
హైడ్రామా నడుమ జగన్‌కు అనుమతి..
మాకవరపాలెం (నర్సీపట్నం) మెడికల్‌ కాలేజీ సందర్శనకు వస్తున్న వైఎస్‌ జగన్‌ పర్యటనకు రోడ్డు మార్గం ద్వారా అనుమతి లేదని అనకాపల్లి ఎస్పీ తుహిన్‌ సిన్హా, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీలు మీడియా సమావేశాలు పెట్టి మరీ స్పష్టం చేశారు. రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్‌లో వెళ్తే తమకు అభ్యంతరం లేదన్నారు. గురువారం విశాఖ నగరంలో అంతర్జాతీయ మహిళా క్రికెట్‌ మ్యాచ్‌ ఉన్నందున విశాఖలో అనుమతించలేదని పోలీస్‌ కమిషనర్‌ చెప్పారు, ఇటీవల తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్‌ పర్యటనలో జరిగిన తొక్కిసలాటో 41 మంది మరణించిన ఘటనను ఉటంకిస్తూ అలాంటి ఘటనలు జరుగుతాయనే ఉద్దేశంతో అనుమతి నిరాకరిస్తున్నట్టు అనకాపల్లి ఎస్పీ వివరించారు. ఇది రాజకీయంగా విమర్శలకు తావివ్వడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌ పర్యటన రోడ్డు మార్గంలోనే ఉంటుందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. దీంతో అదే రోజు రాత్రి జగన్‌ పర్యటన రూటులో స్వల్ప మార్పులతో అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో హైడ్రామా నడుమ జగన్‌ గురువారం నాటి పర్యటనకు లైన్‌ క్లియర్‌ అయింది.
Read More
Next Story