మంగళగిరి స్టేడియం కూలగొడతారా?
x

మంగళగిరి స్టేడియం కూలగొడతారా?

మంగళగిరిలో నిర్మించిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూలగొడతారా? మరమ్మతులు చేస్తారా? ఏమి చేయబోతున్నారు.


ఆంధ్రప్రదేశ్ కు చెప్పుకోదగిన క్రికెట్ స్టేడియం వైజాగ్ మినహా మరెక్కడా లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏసీఏ, బిసిసిఐ కలిసి మంగళగిరికి పై భాగాన నిర్మించిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అమరావతికి తలమానికంగా ఉంటుందని అందరూ భావించారు. అయితే నిర్మాణ లోపాలు ఉన్నట్లు నూతనంగా ఎన్నికైన పాలకవర్గం గుర్తించింది. ఈ నిర్మాణ లోపాలు సరిచేయాలంటే ఎంత ఖర్చవుతుంది. లేదా కొత్త స్టేడియం నిర్మాణానికి ఎంత అవుతుందనే లెక్కలు వేయించే పనిలో పాలకవర్గం ఉంది. ప్రైవేట్ ఇంజనీర్లను రంగంలోకి దించి ఎస్టిమేషన్ లు తయారు చేయిస్తున్నారు.

ఇప్పుడెందుకు ఈ సమస్య

నిర్మించేటప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు వచ్చిందనే అంశంపై కూడా పలువురు క్రికెటర్లు పాలకవర్గాన్ని అడుగుతున్నారని సమాచారం. స్టేడియం నిర్మించేటప్పుడు అప్పటి పాలవర్గం ఇష్టాను రీతిన వ్యవహరించిందని, అందువల్లే వాస్తు దోషాలతో పాటు క్రికెట్ ప్రేక్షకులు ఆట సక్రమంగా చూసేందుకు కూడా స్టేడియం బాగుండటంలేదని పాలకవర్గం చెబుతున్నట్లు సమాచారం. దీంతో క్రీడాకారులు పెద్దగా ఆ వ్యవహారం గురించి పట్టించుకోవడం లేదు. పైగా మూలపాడులో ఉన్న రెండు క్రీడా గ్రౌండ్ లు ఆటలకు ఉపయోగ పడుతున్నందున మంగళగిరిలోని స్టేడియం నిర్మాణం ఎలా చేసుకున్నా తమకెందుకనే ఆలోచనలో క్రీడాకారులు ఉన్నారు. నిర్మాణ లోపాలు సరిదిద్దితే స్టేడియం అందరికీ అనువుగా ఉంటుందని, ఎక్కువ మ్యాచ్ లు జరిగే అవకాశం ఉందని పాలకవర్గం భావిస్తోంది.

నిర్మాణ లోపాలు ఎందుకు జరిగాయి..

మంగళగిరిలోని స్టేడియం నిర్మాణం ఏసీఏ, బిసిసిఐ కలిసి నిర్మించాయి. సుమారు రూ. 70 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. స్టేడియం నిర్మించే సమయంలో ఒక కాంట్రాక్టర్ మారి రెండో వ్యక్తి వచ్చారు. ముందు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ ను మార్చడంతో కోపం వచ్చిన కాంట్రాక్టర్ రెండో కాంట్రాక్టర్ కు స్టేడియం నిర్మాణం అప్పగించేటప్పుడు ఆ ప్లాన్ పైనే అక్కడక్కడ పిల్లర్లు అదనంగా చూసించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అప్పట్లోనే పాలకవర్గం గుర్తించింది. అయితే నిర్మాణం పూర్తయినందున చేయగలిగింది ఏమీ లేదని అలాగే వదిలేశారు. అయితే ప్రస్తుత పాలవర్గం దీనిపై చర్చ జరిపింది.

మరమ్మతులు చేసేందుకు అధిక ప్రయారిటీ..

కూలగొట్టడం అంటే సుమారు రూ. 70 కోట్లు మట్టి పాలవుతాయని, అందువల్ల పిల్లర్ల మార్పు, వాస్తు దోషాలు సరిచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సుమారు రూ. 30 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని, అందుకోసం ప్రత్యేకించి ప్రతిపాదనలు రూపొందించాలని ప్రైవేట్ ఇంజనీర్లను కోరినట్లు సమాచారం.

పట్టించుకోని గత పాలక వర్గం

గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన పాలకవర్గం స్టేడియం నిర్మాణం గురించి పట్టించుకో లేదు. పైగా రాజధాని విశాఖపట్నం మారుతుందనే ధీమాలో ఉన్నారు. విశాఖపట్నంలో ఇప్పటికే స్టేడియం ఉన్నందున మంగళగిరి స్టేడియం గురించి ఆలోచించలేదు. త్వరలో జాతీయ, అంతర్జాతీయ, మ్యాచ్ లు జరిగే అవకాశం ఉన్నందున స్టేడియం రంగురంగుల్లో లైటింగ్ వేసి మరమ్మతులు చేయాలనే ఆలోచనలో ప్రస్తుత పాలవర్గం ఉంది. రెన్నోవేషన్ పేరుతో ఈ మరమ్మతు చేయాలనే ఆలోచనలో పాలక మండలి ఉన్నట్లు తెలిసిది.

Read More
Next Story