భూ కుంభకోణాలు సిసోడియా బయటకు తీస్తారా?
x

భూ కుంభకోణాలు సిసోడియా బయటకు తీస్తారా?

భూ కుంభకోణాలు ఎన్ని జరిగాయి, ఎక్కడెక్కడ జరిగాయి అనే అంశాలను వెలికి తీసేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా నానా పాట్లు పడుతున్నారు.


ఆంధ్రప్రదేశ్ లో భూ కుంభకోణాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, ప్రభుత్వ భూములు స్వాహా చేయడమే కాకుండా ట్రస్ట్, దేవాలయ భూములు కూడా అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని సీఎం చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నారు. కుంభకోణాలు జరిగాయని నిగ్గు తేల్చేందుకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూ కుంభకోణాలు జరిగాయనే అంశంపై దృష్టి పెట్టారు. సిసోడియా 2024 జూలై 12న రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకోగానే మొదటి సారిగా చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు దగ్ధమయ్యాయి. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారు. ప్రత్యేకంగా విచారణకు ఆదేశించారు. డిజిపిని ఆఘమేఘాలపై మదనపల్లి పంపించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయించారు. ఈ ఫైల్స్ దగ్ధానికి కారకులు, ఎవరు? దీని వెనుక ఎవరి హస్తం ఉందనే అంశంపై దృష్టి పెట్టారు. ఒకపక్క పోలీస్, మరో పక్క రెవెన్యూ విచారణ కొనసాగుతూనే ఉంది.

సిసోడియా ప్రత్యేక విచారణ

రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలను వెలికి తీసేందుకు ఆర్పి సిసోడియా ప్రత్యేక విచారణ చేపట్టారు. మదనపల్లి వెళ్లిన సిసోడియా కాలిపోయిన రికార్డులు పరిశీలించి ఇవి యాదృచ్చికంగా కాలలేదని, ఎవరో కావాలనే కాల్చారని తేల్చారు. అందుకు తగిన ఆధారాలను ఆయన తన రిపోర్టులో పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన రిపోర్టులో ఒక్క అంశాన్ని పరిశీలిస్తే కావాలని ఎవరో కాల్చారనేందుకు ఆధారం చూపించారు. ‘సాధారణంగా కాగితాల కట్టలు కలినప్పుడు పెద్ద కట్టలు పూర్తిగా కాలినా లోపల మధ్య భాగంలో కాలవు. కొద్దిగయినా కాగితం కాలకుండానే నిప్పు ఆరిపోతుంది. ఇందుకు చాలా ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో కావాలని ఫైల్స్ కాల్చినందున ప్రతి కాగితం పూర్తిగా కాలి బూడిదైంది’ అంటూ ఆయన రిపోర్టులో పేర్కొనడం పలువురిని ఆలోచింప చేస్తోంది.

చిత్తూరు జిల్లాలో పలు చోట్ల 22ఎ కింద ఉన్న భూములకు పట్టా చేసుకునేందుకు అనుమతులు ఇచ్చి వైఎస్సార్సీపీ నాయకులు స్వాహా చేశారని, దీనిని ఎలాగైనా తేల్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వేల ఎకరాలు వైఎస్సార్సీపీ నాయకుల పరమైనట్లు పాలకులు భావిస్తున్నారు. సిసోడియా మదనపల్లిలో ఇటీవల ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా మంది వైఎస్సార్సీపీ బాధితులు సిసోడియాకు అర్జీలు ఇచ్చారు. తాము ఎప్పటి నుంచో సాగుచేసుకుంటున్న భూములను కూడా లాక్కున్నారనే అర్జీలు కూడా వచ్చాయి. ఈ పిటీషన్ లు స్వీకరించిన సిసోడియా జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు తగు సూచనలు ఇచ్చిన ఫిర్యాదులను నిగ్గు తేల్చాల్సిందిగా ఆదేశించారు. ఈ వ్యవహారం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆరోపిస్తున్నారు. తనపై పరోక్షంగా వస్తున్న ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి ఇటీవల స్పందించారు. అనవసరైన ఆరోపణలు మాని నిబంధనల ప్రకారం తప్పులు ఉంటే తేల్చుకోవచ్చని అన్నారు.

విశాఖలో భూ కుంభకోణాలు జరిగాయని, అక్కడ చోటు చేసుకున్న కుంభకోణాలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేసి దోషులను నిగ్గు తేల్చాలని సిసోడియాను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయన రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రత్యేకించి ఎక్కడెక్కడి భూములు స్వాహా చేశారని ప్రభుత్వం భావిస్తోందో ఆ ప్రాంతాల్లో సిసోడియా పర్యటించారు. మధురవాడ ప్రాంతంలోని హయగ్రీవ, రామానాయుడు స్టుడియో భూముల్లో కుంభకోణాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నందున ఆ భూములను పరిశీలించారు. చుట్టుపక్కల వారి నుంచి వివరాలు సేకరించారు. దస్పల్లా భూములు కూడా ఇందుకు మినహాయింపు కాలేదని భావిస్తున్నారు. ఆనందపురం, భీమిలి మండలాల్లో భీమునిపట్నం బీచ్ ఎర్రదిబ్బల్లో భీమునిపట్నం మ్యూచ్ వల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ, శారదా పీఠానికి భారీగా భూములు కట్టబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఈ భూములను కూడా సిసోడియా పరిశీలించారు. అలాగే 22ఎ కింద ఉన్న భూములు, బంజరు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఆ భూములు ఎలా అన్యాక్రాంతమయ్యాయి అనే విషయమై ప్రత్యేకమైన దర్యాప్తు జరుగుతోంది. రెవెన్యూ వ్యవహారాలన్నీ సిసోడియా చుట్టూనే తిరుగుతున్నాయి.

విశాఖపట్నంలో భూ కుంభకోణాలు చోటు చేసుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బ్రుందం (సిట్) ఏర్పాటు చేసింది. ఈ విచారణ ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు సిట్ దర్యాప్తు కూడా కొనసాగుతూనే ఉంది.

రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. ఈనెల 16 నుంచి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఈ సదస్సుల్లో గత ప్రభుత్వ భూ కుంభకోణాలు బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైన కసరత్తు చేస్తోంది. రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇదేనని, వీటితో పాటు సాధారణ భూ సమస్యలు కూడా ప్రజల నుంచి వస్తే తప్పకుండా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఈ సదస్సుల్లో ఎన్ని భూ కుంభ కోణాలు బయటకు వస్తాయోనని ప్రభుత్వం ఎదురు చూస్కోంది.

సిసోడియాకు నిబద్ధత గల అధికారిగా పేరు ఉంది. చెప్పిన పనిని తూచా తప్పకుండా చేస్తారని ప్రభుత్వంలోని చాలా మంది అధికారులు చెబుతుంటారు. కావాలని ఎవ్వరికీ హాని చేసే వారు కాదని, ప్రభుత్వం తప్పులు చేయించినా చేసేందుకు ముందుకు రారని పలువురు అధికారులు చెప్పడం విశేషం. భూమి కుంభకోణాలు జరిగి ఉంటే తప్పకుండా బయటకు లాగటంలో సిసోడియా సక్సెస్ అవుతారని పేర్లు చెప్పేందుకు ఇష్టపడని కొందరు సీనియర్ ఐఏస్ లు చెబుతున్నారు. ఈ దర్యాప్తులో కేవలం వైఎస్సార్సీపీ వారే కాకుండా భూ కుంభ కోణాలకు పాల్పడే వారందరి గురించి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read More
Next Story