పోలీసు కస్టడీలో లేడీ డాన్: వణుకుతున్న రాజకీయ నేతలు
x

పోలీసు కస్టడీలో 'లేడీ డాన్': వణుకుతున్న రాజకీయ నేతలు

లేడీడాన్ అరుణను విచారించేందుకు డీజీపీ నేరుగా రంగంలోకి దిగినట్టు సమాచారం. ఆమెను బలిపశువును చేస్తారో బలహీనురాల్ని చేసి చట్టం ముందు నిలుపుతారో తేలాల్సి ఉంది.


జీవితఖైదీ, రౌడీ షీటర్ అవిలేల శ్రీకాంత్ ప్రియురాలు, లేడీ డాన్ నిడిగుంట అరుణను నెల్లూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో ఒంగోలు జైలు వద్ద ఆమెను పోలీసులు కస్టడీ లోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆగస్టు 28వ తేదీ రాత్రి నుంచే ఆమెను విచారిస్తారు. ఇందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

అరుణను విచారించేందుకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నేరుగా రంగంలోకి దిగారు. శ్రీకాంత్, అరుణ కార్యకలాపాలపై ఇప్పటికే ప్రాథమికంగా దర్యాప్తు పూర్తి చేసిన నెల్లూరు, తిరుపతి జిల్లాల పోలీసు అధికారులు నివేదికలను డీజీపీకి అందించారు. ఆమె ఫోన్లలో పలువురు కీలక అధికారులు, రాజకీయ నాయకులు, చోటా మూటా రౌడీలు, కానిస్టేబుళ్లతో ఆమె చేసిన సంభాషణలు, దిగిన ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడీ విచారణలో అవి బయటపడితే ఏ రాజకీయ నాయకుడి బాగోతం బయటపడుతుందోనని భయపడుతున్నారు. దీంతో ఈ విచారణలో ఆమె చెప్పే ప్రతి విషయాన్నీ రహస్యంగా ఉంచాలని పోలీసు బాసులు- విచారణాధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా శ్రీకాంత్, అరుణ పై తీసుకోవలసిన చర్యలపై డీజీపీ పోలీసు అధికారులతో సమీక్షించారు.
అరుణ ఫేస్బుక్ లో పెట్టిన సందేశంపై ఆరా...
అరుణ తన అరెస్టుకు కొన్ని గంటల ముందు ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్టుపై డీజీపీ ఆరా తీశారు. "శ్రీకాంత్ ను వాడుకున్న వాళ్లు ఎందుకు నోరు మెదపడం లేదు, అంటే శ్రీకాంత్ బాధలు పడుతుంటే మీకు ఇష్టం అని మీ మౌనాన్ని మేము అంచనా వేసుకోవాలి, అలాంటప్పుడు ఎందుకు నేను శ్రీకాంత్ మాటవిని నోరు మెదపకుండా ఉండాలి.. ఓపెన్ అయిపోయేతే మేలుకదా..??? ఇంకనైనా స్పందిస్తారా శ్రీకాంత్ మాటకూడా లెక్కచేయకుండా నోరు విప్పేయాలా????మహా అయితే మీరు చంపేస్తారు? అంతే కదా ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బ్రతికే కన్నా దేనికైనా సిద్ధపడి పోవడం మేలు" అని ఆమె పోస్ట్ పెట్టారు.
ఈ పోస్టు పెట్టిన కొన్ని గంటల్లో నే అరుణ అర్ధరాత్రి అద్దంకి వద్ద అరెస్ట్ అయ్యారు. అంటే అరుణ మౌనం వీడితే ఎవరి గుట్టు బయట పడేది? ఆమె వద్ద ఎవరో పెద్ద స్థాయి నాయకులు, అధికారుల కీలక సమాచారం, విడియో, ఆడియో సాక్ష్యాలు ఉన్నాయనేది అర్దం అవుతుంది.
ఇప్పుడు పోలీసు కస్టడీ విచారణలో అవి బయటకు వస్తాయా..? అధికార పార్టీ అనుకున్నవారిని పక్కన పెట్టి వేరే పార్టీ అనుకున్న వారి బాగోతాలు మాత్రమే బయట పెడతారా? వంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రౌడీ షీటర్ శ్రీకాంత్ లేడీ డాన్ నిడిగుంట అరుణ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందోనని ఇప్పుడు సర్వత్రా ఎదురుచూస్తున్నారు.
పెద్ద నాయకుల కోసం ఆమెను బలిపశువును చేస్తారా లేక నిజానిజాలు ప్రజల ముందు పెట్టి అరుణను దోషిగా నిలబెడతారా అనేది మున్ముందు తేలే విషయమే.
రౌడీ షీటర్ శ్రీకాంత్ నేర చరిత్ర..
రౌడీ షీటర్ శ్రీకాంత్ నేర చరిత్ర చాలా పెద్దదే..ఇప్పుడిప్పుడే కొన్ని వెలుగులోకి వస్తున్నా వెలుగు చూడని ఘోరాలు ఎన్నో ఉన్నాయంటున్నారు. సూళ్లూరుపేట లో ఓ కొడుకు తన తండ్రిని హత్యచేయడానికి రూ.50 లక్షలు సుఫారీ తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాంత్ ఆదేశిస్తే ఆయన అనుచరులు అత్యంత సులువుగా నేరాలు, ఘోరాలు చేస్తారని వినికిడి. ప్రతి పనికి ఓ రేటు.. ప్రతి హత్యకు ఓ నోటు ఆయన థీరి.
ముఖ్యంగా శ్రీకాంత్ ఎదుగుదలలో ప్రజా ప్రతినిధులది, ఖద్దరు చొక్కాలదీ, ఖాకీలది కీలక పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాంత్ నేర సామ్రాజ్యం ఒక రోజులో వచ్చింది కాదు కొన్నేళ్లుగా పెరుగుతూ వచ్చింది. చివరకు 22 ఏళ్లకే 2010లో యావజ్జీవిత ఖైదుగా మారాల్సి వచ్చింది. 2025 లో పెరోల్ విషయం వ్యవహారం మెడకు చుట్టుకుని నేరాలు బయట ప్రపంచానికి తెలిసి ఇప్పుడు మళ్ళీ చట్టం ముందు నిలబడ పోతున్నాడు శ్రీకాంత్.
Read More
Next Story