కేటీయార్ కు 27వ తేదీన పెద్ద పరీక్ష
అభ్యర్ధి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించటం కోసం కేటీయార్ పై మూడుజిల్లాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ఇక్కడ గెలవటం రాకేష్ కన్నా కేటీయార్ కే చాలా ప్రిస్టేజ్.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ కు ఈనెల 27వ తేదీన పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. పెద్దపరీక్ష ఏమిటంటే ఎంఎల్సీ ఎన్నిక. వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎంఎల్సీ ఎన్నిక ఈనెల 27వ తేదీన జరగబోతోంది. ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ చేతిలోనే ఉంది. ఇంతకుముందు ఇక్కడినుండి ఎంఎల్సీగా బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా గెలవటంతో ఎంఎల్సీగా రాజీనామా చేశారు. పల్లా రాజీనామాచేసిన నియోజకవర్గానికే ఇపుడు ఎన్నిక జరుగుతోంది. కాబట్టి సిట్టింగ్ సీటును కాపాడుకోవటం బీఆర్ఎస్ కే కాకుండా కేటీయార్ కు ఇంకా పెద్ద పరీక్షగా మారింది. ఎన్నికలో పార్టీ అభ్యర్ధి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించటం కోసం కేటీయార్ పై మూడుజిల్లాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ఇక్కడ గెలవటం రాకేష్ కన్నా కేటీయార్ కే చాలా ప్రిస్టేజ్.
రాకేష్ గెలుపు విషయంలో కేసీయార్ పూర్తి బాధ్యతలను కేటీయార్ పైనే ఉంచినట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే మాజీమంత్రి హరీష్ రావు ప్రచారంలో ఎక్కడా కనబడటంలేదు. ఒక్కసారి కూడా కేసీయార్ ప్రచారం చేయలేదు. దీనిబట్టి చూస్తే అభ్యర్ధి గెలుపుభారం మొత్తం కేటీయార్ పైనే ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ గెలుపుకు కేటీయార్ సింగిల్ అజెండాతోనే ముందుకెళుతున్నారు. అదేమిటంటే ప్రశ్నించే గొంతుకు ఓట్లేసి గెలిపించాలని పదేపదే విజ్ఞప్తిచేస్తున్నారు. తమ హయాంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. మెడికల్ కాలేజీలు పెట్టామని, డీఎస్సీ నిర్వహించి టీచర్ల పోస్టులు భర్తీచేసినట్లు చెప్పుకుంటున్నారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని చెప్పుకోలేక ఫెయిలైనట్లు గుర్తుచేస్తున్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీలపైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆచరణసాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ జనాలను మోసంచేసిందని ఆరోపిస్తున్నారు. బీజేపీ తెలంగాణాకు చేసిందేమీలేదని మండిపడుతున్నారు. అయోధ్యంలో రామాలయం నిర్మించి దాన్నే దేశమంతా ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవాచేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ మీద కేటీయార్ ఎన్ని ఆరోపణలు చేసినా జనాలు పట్టించుకుంటారా అన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే తమ పదేళ్ళ పరిపాలనను కాంగ్రెస్ ఐదునెలల పాలనతో కేటీయార్ పోల్చటమే పెద్ద తప్పు. పదేళ్ళపాలనలో బీఆర్ఎస్ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందో లేదో తెలీదుకాని ఐదు నెలల పాలనలో రేవంత్ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలు ఇచ్చింది మాత్రం వాస్తవం. అలాగే 11 వేల టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో నోటిఫికేషన్ ఆగిపోయింది.
తమ ఐదునెలల పాలనలో హామీల అమలును, ఉద్యోగాల భర్తీని, మెగా డీఎస్సీ నోటిపికేషన్ను కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న ప్రచారం చేసుకుంటున్నారు. పనిలోపనిగా కేసీయార్ పాలనలో అరాచకం జరిగిందంటు ఉదాహరణలతో వివరిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్ధి ప్రేమేందర్ రెడ్డి కూడా ప్రచారాన్ని ధీటుగానే చేసుకుంటున్నారు. అయితే కేంద్రప్రభుత్వం తెలంగాణాకు చేసిన మేలును చెప్పుకోవటంలో వెనకబడ్డారనే ప్రచారం జరుగుతోంది. తన ప్రచారమంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయటానికే సరిపోతోంది. అభ్యర్ధికి మద్దతుగా కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు అభ్యర్ధుల్లోకి తీన్మార్ మల్లన్న బాగా పాపులర్. ఆమధ్య జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయినా సుమారు 40 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అలాంటి మల్లన్న ఇపుడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు.
పై మూడుజిల్లాల్లోని 35 నియోజకవర్గాల్లో 4.61 లక్షల ఓటర్లున్నారు. వీరంతా ఈనెల 27వ తేదీన తమ ప్రతినిధిని ఎన్నుకోబోతున్నారు. బీఆర్ఎస్ తమ సీటును నిలుపుకుంటుందా ? తీన్మాన్ గెలుస్తారా ? ప్రేమేందర్ ఓటర్లను ఆకర్షిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా కేటీయార్ కు 27వ తేదీన జరగబోతున్న ఎన్నిక పెద్దపరీక్షగా మారిందనటంలో సందేహంలేదు.