KTR Delhi|కవితలాగే కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళక తప్పదా ?
తీహార్ జైలులో కవిత ఆరుమాసాలు ఉండటానికి కారణం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)(ED) నమోదుచేసిన కేసులే.
చెల్లెలు కల్వకుంట్ల కవిత దారిలోనే అన్న కల్వకుంట్ల కేటీఆర్ ప్రయాణంచేయక తప్పదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కవిత(Kavitha) దారిఏమిటో కేటీఆర్(KTR) ప్రయాణంచేయటం ఏమిటో ఈపాటికే అర్ధమయ్యుండాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో అరెస్టయిన కవిత తీహార్ జైలు(Tihar Jail)లో ఆరుమాసాలు ఉన్న విషయం తెలిసిందే. తీహార్ జైలులో కవిత ఉండటానికి కారణం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)(ED) నమోదుచేసిన కేసులే. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూపులో కవితదే కీలక పాత్రని, స్కామ్ లో కోట్లది రూపాయల ముడుపులు కవిత అందుకున్నదనే ఆరోపణలతో మనీల్యాండరింగ్(Money Laundering) సెక్షన్లు ఈడీ పెట్టింది. ముందు విచారణ చేసి తర్వాత అరెస్టుచేసి కోర్టు రిమాండ్ ద్వారా తీహార్ జైలుకు తరలించింది.
ఇపుడు కేటీఆర్ వ్యవహారం కూడా అలాగే జరుగుతుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసులో రు. 55 కోట్ల అవినీతి జరగటంలో కీలక సూత్రదారుగా కేటీఆర్ పై ఏసీబీ(ACB) కేసునమోదు చేసింది. ఏసీబీ అలా కేసు నమోదుచేసిందో లేదో వెంటనే ఈడీ రంగంలోకి దిగేసింది. ఏసీబీ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ), విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా)(FEMA) కింద కేటీఆర్ పై ఈడీ ఏ1గా ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) నమోదుచేసింది. కేటీఆర్ మీదే కాదు సీనియర్ ఐఏఎస్ అధికారి, కార్ రేసుకు సంబంధించి నిధులు విడుదలచేసిన అర్వింద్ కుమార్ పై ఏ2గా, నిధుల బదిలీలో కీలకపాత్ర పోషించిన హెచ్ఎండీఏలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డిపైన ఏ3గా ఈడీ కేసులు నమోదుచేసింది.
కవిత విషయాన్ని తీసుకుంటే లిక్కర్ స్కామ్ లో ఈడీ కేసు నమోదుచేసి ఒకసారి విచారణ చేసింది. తర్వాత మళ్ళీ విచారణకు రమ్మంటే హాజరుకాలేదు. హాజరుకాకపోగా విచారణకు ఈడీ జారీచేసిన నోటీసులను చాలెంజ్ చేస్తు సుప్రింకోర్టులో పిటీషన్లు వేశారు. కొంతకాలం ఈడీ నోటీసులు జారీచేయటం, కవిత కోర్టు విచారణను చూపించి విచారణనుండి గైర్హాజరవటం అందరికీ తెలిసిందే. చివరకు లిక్కర్ స్కామ్ ను ఈడీతో పాటు విచారిస్తున్న సిబీఐ రంగంలోకి దిగింది. మార్చి 15వ తేదీన హైదరాబాదుకు సీబీఐ(CBI) వచ్చి కవితను ఇంట్లోనే విచారించి తర్వాత అరెస్టు చేసినట్లు ప్రకటించి ఢిల్లీకి తీసుకెళ్ళింది. ఢిల్లీకి తీసుకెళ్ళిన తర్వాత విచారణలో భాగంగా మళ్ళీ ఈడీ కూడా జోక్యం చేసుకున్నది. లిక్కర్ స్కామ్ లో కవితను సీబీఐతో పాటు ఈడీ కూడా విచారిస్తోంది. ఆరుమాసాల జైలు తర్వాత అతికష్టంమీద కవిత బెయిల్ మీద బయటకు వచ్చారు.
ఇపుడు కేటీఆర్ విషయాన్ని చూస్తే ముందు కేసు నమోదుచేసింది ఏసీబీ. కేసైతే చేసిందికాని విచారణకు నోటీసు ఇంకా జారీచేయలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వెయిట్ చేస్తున్నట్లుంది. శనివారంతో సమావేశాలు ముగుస్తాయి కాబట్టి వెంటనే విచారణకు నోటీసులు జారీచేసే అవకాశాలున్నాయి. ఏసీబీ కేసు నమోదుచేసిందో లేదో వెంటనే ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేసులు నమోదుచేసింది. ఏసీబీ నమోదుచేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో కేటీఆర్ వేసిన పిటీషన్లో పెద్దగా ఊరట దక్కలేదు. పదిరోజులు కేటీఆర్ ను అరెస్టు చేయద్దని, కేసు విచారించవచ్చని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. ఏసీబీ విచారణ ముగియగానే ఈడీ కూడా యాక్టివేట్ అయ్యే అవకాశాలున్నాయి.
ఏసీబీ విచారణ జరిగిన వెంటనే కేటీఆర్ ను విచారించేందుకు ఈడీ కూడా నోటీసులు జారీచేయబోతున్నట్లు సమాచారం. ఏసీబీ విచారణతోనే సరిపెడుతుందా లేకపోతే అరెస్టు కూడా చేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. కేటీఆర్ మీద కేసు నమోదుచేసి విచారణ చేసిన ఏసీబీ అరెస్టుచేయకుండా ఉండదని అందరికీ తెలుసు. ఏసీబీకి అదనంగా ఇపుడు ఈడీ కూడా తోడయ్యింది. కాబట్టి పదిరోజుల తర్వాత కేటీఆర్ అరెస్టులో ఏసీబీ, ఈడీ ఏది స్పీడుగా యాక్ట్ చేస్తుందో చూడాలి. ఏసీబీ అరెస్టుసంగతి పక్కనపెడితే ఈడీ అరెస్టుచేస్తే వెంటనే కేటీఆర్ ను ఢిల్లీకి తీసుకెళుతుంది అనటంలో సందేహంలేదు. మనీ ల్యాండరింగ్, ఫెమా లాంటి కఠినమైన చట్టాల కింద కేసునమోదు చేసింది కాబట్టి ఢిల్లీకి తీసుకెళ్ళి విచారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాదులో కేటీఆర్ ను విచారించాలంటే ఈడీకి లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. అదే ఢిల్లీలో అయితే కేటీఆర్ ను విచారించేందుకు ఎలాంటి సమస్యలుండవు. కాబట్టి కేటీఆర్ ను ఢిల్లీకి తీసుకెళితే అక్కడ ఏమి జరుగుతుందో చూడాలి.