కేసీఆర్ మళ్లీ కారు స్టీరింగ్ పడతారా ?
x

కేసీఆర్ మళ్లీ కారు స్టీరింగ్ పడతారా ?

కేసీయార్ ఇలాగే ఆలోచిస్తే కారు స్టీరింగ్ పర్మినెంటుగా కేటీయార్ చేతికి వచ్చేసినట్లే అనుకోవాలి.


కారుకు ఓనర్ కేసీయారే అయినా ఇపుడు స్టీరింగ్ ఉన్నది మాత్రం కేటీయార్ చేతుల్లోనే. కారుపార్టీకి కేసీయార్ అధినేత అయితే కొడుకు కేటీయార్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే అని అందరికీ తెలుసు. ఇపుడీ చర్చంతా ఏ విషయంలో అంటే ఈనెల 23వ తేదీనుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోయే మూడో సమావేశాలు. మొదటి రెండు సమావేశాలకు కేసీయార్ హాజరుకాలేదు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే కేసీయార్ కు ప్రమాదం జరిగి కాలి తుంటిఎముక విరిగింది. దానికి ఆపరేషన్ చేయించుకుని కేసీయార్ ఇంటికే పరిమితమైపోయారు.

ఇక రెండో సమావేశం జరిగినా కేసీయార్ హాజరుకాలేదు. అందుకనే మూడోది బడ్జెట్ సమావేశాలకైనా హాజరవుతారా అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. అయితే పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే బడ్జెట్ సమావేశాలు కాబట్టి కేసీయార్ తప్పకుండా హాజరవుతారట. బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానంపై ఆదివారం పార్టీ ఎంఎల్ఏలతో కేసీయార్ భేటీ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున 38 మంది ఎంఎల్ఏలు ఎన్నికైనా ఇప్పుడు ఉన్నది 28 మంది మాత్రమే. పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. కాబట్టి సంఖ్యరీత్యా బీఆర్ఎస్ బలం అసెంబ్లీలో బాగా క్షీణించిపోతోంది. బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఎంఎల్ఏలు, ఎంఎల్సీల ఫిరాయింపులు జోరందుకుంటున్న సమయంలోనే బడ్జెట్ సమావేశాలు మొదలవ్వబోతున్నాయి. కాబట్టి కేసీయార్ తప్పకుండా సమావేశాలకు హాజరై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులను ఎండగడతారని కారుపార్టీ నేతలంటున్నారు.

అయితే ఇక్కడ ఒక సందేహం ఏమిటంటే అధికారంలో ఉన్నపుడు కేసీయార్ ఏదైతే చేశారో ఇపుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. కాబట్టి ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీని ఇరకటాంలో పెట్టాలని ప్రయత్నిస్తే చివరకు కేసీయార్, కేటీయార్, హరీషే ఇరకాటంలో పదే ప్రమాదముంది. ఇంతచిన్న విషయం తెలీకుండానే సభలో ఫిరాయింపుల అంశాన్ని కేసీయార్ లేవనెత్తుతారా అన్న సందేహం కూడా వినిపిస్తోంది. ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్ పార్టీ మీద కేసీయార్ రాళ్ళు వేస్తే వెంటనే కాంగ్రెస్ వైపునుండి కేసీయార్ పైన పెద్ద బండరాళ్ళే వచ్చిపడతాయనటంలో సందేహంలేదు. అందుకనే కేసీయార్ ఫిరాయింపుల ప్రస్తావన తెచ్చే అవకాశాలు తక్కువే. మరి సభకు హాజరై కేసీయార్ ప్రస్తావించబోయే అంశాలు ఏమిటనేవి ఇపుడు పెద్ద ప్రశ్నగా మారింది. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెట్టబోయే తానే ఇబ్బందుల్లో పడటం దేనికి అనుకుంటే ఈ సమావేశాలకు కూడా కేసీయార్ హాజరయ్యేది అనుమానమే.

కేసీయార్ ఇలాగే ఆలోచిస్తే కారు స్టీరింగ్ పర్మినెంటుగా కేటీయార్ చేతికి వచ్చేసినట్లే అనుకోవాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ అనధికారికంగా పార్టీకి ప్రెసిడెంట్ అయిపోతే అధ్యక్షుడు కేసీయార్ కాస్త చివరకు పార్టీకి గౌరవాధ్యక్షుడిగా మిగిలిపోతారేమో. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలను నిర్వహించకుండా, అసెంబ్లీకి రాకుండా, పార్టీని క్షేత్రస్ధాయిలోకి తీసుకెళ్ళకుండా మరిక కేసీయార్ ఏమిచేస్తారు ? ఇపుడు పార్టీలో కేటీయార్, హరీష్ రావు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. పార్టీ ఫిరాయిస్తారు అనే అనుమానం ఉన్న ప్రజా ప్రతినిధులతో నాలుగురోజులు కేసీయార్ వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఒకవైపు సమావేశాలు నిర్వహిస్తున్నా మరోవైపు పార్టీని వదిలేసే వాళ్ళు వదిలేస్తునే ఉన్నారు. అందుకనే సమావేశాలను కూడా ఆపేశారు. ఈ నేపధ్యంలోనే కేసీయార్ మళ్ళీ కారు స్టీరింగ్ పట్టుకుంటారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

Read More
Next Story