పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం విడుదల చేశారు. తాను ఐదేళ్ల కాలంలో నిర్మించిన ప్రాజెక్టు నిర్మాణాలను కూడా పనికి రాకుండా జగన్ చేశారని, తన హయాంలో రూ. 11762 కోట్లు ఖర్చు చేసి నిర్మాణం చేపడితే, జగన్ ప్రభుత్వ హయాంలో రూ. 4167 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ప్రాజెక్టును పనికి రాకుండా చేశారని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. జగన్ మూర్ఖత్వం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతినిందని, జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం పనులు ఆపేసి, తన ఇష్టాను సారంగా కాంట్రాక్టర్లను తొలగించి, పొలవరం ప్రాజెక్టు గోదావరిలో కలిసేలా చేశారని శ్వేతపత్రంలో పేర్కొనడం విశేషం. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం విడుదల చేసిన శ్వేతపత్రం రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిశీలించేందుకు వెళ్లినప్పుడు అక్కడ పరిస్థితులను చూస్తే కడుపు తరుక్కుపోయిందని, కళ్ల వెంట నీళ్లు వచ్చాయని శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు అనడం విశేషం.
రూ. 3385 కోట్లు ప్రాజెక్టుకు పెట్టాల్సిన నిధులు జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని శ్వేతపత్రంలో సీఎం వెల్లడించారు. జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? రూ. 4900 కోట్లు నష్టం జరిగింది. ఖర్చు 38 శాతం పెరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 960 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కోల్పోయాం. దీని వల్ల రూ. 3వేల కోట్లు నష్ట పోవలసి వచ్చింది. ప్రాజెక్టు ఆలస్యంతో రైతులకు రూ. 45వేల కోట్ల వరకు నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కానీ, జలవనరుల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు కానీ, ఆ పార్టీకి చెందిన నాయకులు చంద్రబాబుకు ఏమి సమాధానం చెబుతారు? ఏ విధమైన కౌంటర్ ఇస్తారు? అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఏ ఒక్కరు కూడా ఈ శ్వేతపత్రంపై ఇంత వరకు స్పందించడం కానీ, కామెంట్లు కానీ చేయలేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టుపై తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించారని ఎవరైనా అంగీకరించాల్సిందే. అయితే శ్వేతపత్రాల పేరుతో గత ప్రభుత్వం చేసిన తప్పులను బయట పెడుతున్నామని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటూ, పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలు పాలకులను క్షమించే అవకాశం లేదని రాజకీయ మేధావులు అంటున్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం ఏ విధంగా పోలవరం ప్రాజెక్టును విధ్వంస చేసింది, దాని వల్ల ఎలాంటి నష్టం వాటిల్లింది, దాని నుంచి బయట పడాలంటే ఎంత కష్టం అవుతుంది, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి వంటి అనేక అంశాలను చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.