కోటరీని వదిలించుకోకపోతే జగన్ కి ఆ కోటలూ మిగలవా?
x

కోటరీని వదిలించుకోకపోతే జగన్ కి ఆ కోటలూ మిగలవా?

కోటరీ గుట్టు విప్పి ఆ ముఠాను కకావికలం చేసేంత వరకు నిద్రపోయే ప్రసక్తే లేదంటున్నాడు విజయసాయి.


వైఎస్ జగన్మోహన్ రెడ్డీ.. నిన్ను వదలా అంటున్నాడు పాతమిత్రుడైన విజయసాయి రెడ్డి. కోటరీ గుట్టు విప్పి ఆ ముఠాను కకావికలం చేసేంత వరకు నిద్రపోయే ప్రసక్తే లేదంటున్నాడు విజయసాయి. నిజంగానే విజయసాయి రెడ్డి ఆ పని చేస్తాడో లేదో గాని ఆయన మాత్రం మాంచి కసిమీదున్నట్టు ఇటీవలి ప్రకటనలు తెలియజేస్తున్నాయి. తాజాగా చేసిన ఆయన ట్వీట్ రాజకీయవర్గాల్లో కలకలం రేపింది.
ఇప్పటికే ఆయన వైఎస్ జగన్ చుట్టూ ఎన్ని రకాల కోటరీలు ఉంటాయో, ఏయే కోటరీ ఏమేమి చేస్తుందో వివరంగానే చెప్పారు. ఆ కోటరీ నుంచి బయటపడాలని వైసీపీ అధినేత, తన మాజీ బాస్ జగన్ కు సలహా ఇచ్చారు.
జగన్ చుట్టూ మూడు రకాల కోటరీలు ఉంటాయి. ప్రధమ శ్రేణిలో తలపండిన డబ్బున్న రాజకీయ నాయకులు, ద్వితీయ శ్రేణిలో జగన్ పేరును అడ్డం పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా నాలుగు రాళ్లు వెనకేసుకునే వారు, తృతీయ శ్రేణి కోటరీలో జగన్ పార్టీ నుంచి డబ్బులు తీసుకుంటూ చిన్న చిన్న పైరవీలు చేసుకుంటూ బాస్ ముందు అణిగిమణిగి ఉంటూ నక్కవినయాలను పోతుంటే సన్నజీవులు ఉంటాయని చెబుతుంటారు.
ప్రధమ శ్రేణి కోటరీ జోలికి పోకుండా మిగతా రెండు వర్గాల కోటరీలపై చాలామంది ఇప్పటికే విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. ద్వితీయ శ్రేణి కోటరీతో ఎలాంటి ముప్పు ఉంటుందో విజయసాయి రెడ్డి ఇప్పటికే సవివరంగా చెప్పారు. ఇక, ఇప్పుడు ఆయన మొత్తం కోటరీపైన్నే విమర్శలు ఎక్కుపెట్టి ఆ ముఠాను కకావికలు చేయాలనుకుంటున్నారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే తాను పార్టీ నుంచి బయటకు వచ్చేశానని ఇటీవల విజయసాయిరెడ్డి చెప్పారు. ఈనేపథ్యంలో మార్చి 16న విజయసాయిరెడ్డి ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికర మెసేజ్ కనిపించింది.
కోటరీపై జగన్‌ ఆధారపడితే.. చివరకు కోటా మిగలదు, ఆ కోటరీ వదలదు.. అంటూ జగన్ కు సూచనలు సలహాలు ఇచ్చేలా ఓ సరదా కామెంట్ పెట్టారు. ఇందులో ఆయన ఓ పిట్టకథ కూడా చెప్పారు. ‘పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్నికష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా.. ఆహా రాజా.. ఓహో మహరాజా! అంటూ పొగడ్తలతో రాజు కళ్లకు గంతలు కట్టి, కోటరీ తన ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు. రాజ్యం కూడా పోయేది. మహారాజు తెలివైనవాడు అయితే.. మారువేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతుందో తనకు తానుగా తెలుసుకునేవాడు. కోటరీ మీద వేటువేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు.
కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు. కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలోనైనా జరిగేది ఇదే!’ అని విజయసాయిరెడ్డి కథ చెప్పారు.
దీనర్థం అందరికీ తెలిసిందే. రాజు అంటే జగన్ అని, కోటంటే తాడేపల్లి క్యాంప్ ఆఫీసు లేదా బెంగళూరు హౌస్ అని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన ఇంటి నుంచి బయటకు రాలేదు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లి ప్రమాణం చేసి వచ్చారు. ఆ తర్వాత ఆరు నెలల పాటు ఆ వైపు వెళ్లలేదు. మొన్నీ మధ్య ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తొలిరోజు వెళ్లి ఓ పావుగంట ఉండి సభ నుంచి వాకౌట్ చేసి వచ్చారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని భీష్మించారు. ఈ వ్యవహారమై కోర్టుకు కూడా వెళ్లారు.
మరోవైపు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏ కోటరీలైతే ఆయన్ను ఇనుపతెరల మధ్య ఉంచాయని చెబుతున్నారో ఆవే ముఠాలు ఇప్పటికీ అక్కడ తిష్టవేసి ఉన్నాయట. కాకపోతే మీడియా ప్రధాన సలహాదారుగా, ఉపన్యాసాలు రాసిచ్చిన వ్యక్తిగా ఉండే జీవీడీ కృష్ణమోహన్ అనే మాజీ జర్నలిస్టు మాత్రం ఇప్పుడు లేరంటున్నారు. మిగతా వాళ్లందరూ సేమ్ టూ సేమ్. ఇప్పటికీ వాళ్లే తాడేపల్లి క్యాంప్ ఆఫీసును నడిపిస్తున్నారు. వీళ్ల ఆజ్ఞ లేనిదే లోనికి ప్రవేశం దొరకదు.
అందుకే విజయసాయి రెడ్డి జగన్ కోటరీని టార్గెట్ చేశారు. ఆ ముఠాల నుంచి బయటపడమని సలహా ఇస్తున్నారట. జగన్ పాటిస్తారో లేక పార్టీని వదిలిపెట్టి పారిపోయిన వ్యక్తిని పట్టించుకోవాల్సిన అవసరం ఏముందని అంటారో చూడాలి.
Read More
Next Story