ఏపీలో సినిమా రంగానికి కొత్త ఊపిరి పోస్తారా?
x
అరకు వ్యాలీ

ఏపీలో సినిమా రంగానికి కొత్త ఊపిరి పోస్తారా?

సినిమా షూటింగ్‌లకు అనుకూలమైన ప్రాంతాలు, ప్రభుత్వ ఆలోచనలు, రాయితీలు, మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యలు.


గతంలో మద్రాస్ లోనే సినిమా పరిశ్రమ, ఆ తరువాత హైదరాబాద్ కు వచ్చింది. ప్రస్తుతం ఏపీలో అనుకూల పరిస్థితులు ఉన్నా హైదరాబాద్ పైనే సినీ పరిశ్రమ ఆధారపడి ఉంది. అలా కాకుండా ఏపీలో కూడా సినీ పరిశ్రమను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఆంధ్రప్రదేశ్ సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా అవతరించడానికి ప్రభుత్వం విస్తృతమైన ఆలోచనలు చేస్తోంది. టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల ముంబైలో జరిగిన సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్-2025లో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను వెల్లడించారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లను ప్రోత్సహించడానికి ఫిల్మ్ టూరిజం పాలసీని త్వరలో అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పాలసీ ద్వారా తెలుగు సినిమా పరిశ్రమను బలోపేతం చేయడమే కాకుండా, ప్రపంచ స్థాయి స్టూడియోలు, పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఏడు యాంకర్ హబ్ లు

సినిమా షూటింగ్‌లకు అనుకూలమైన ప్రాంతాల విషయానికి వస్తే రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, శ్రీశైలం, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, గండికోట వంటి ఏడు యాంకర్ హబ్‌లను గుర్తించారు. ఇవి హబ్-అండ్-స్పోక్ మోడల్‌లో 21 థీమాటిక్ సర్క్యూట్‌లలో (అడ్వెంచర్, ఎకో, టెంపుల్, ఫిల్మ్ టూరిజం వంటివి) అభివృద్ధి చేయనున్నారు. ఇంకా మారేడుమిల్లి, విశాఖపట్నం బీచ్‌లు, అరకు వ్యాలీ, గోదావరి ప్రాంతాలు, రాజమండ్రి వంటి ప్రదేశాలు సినిమాలకు ప్రసిద్ధ షూటింగ్ స్పాట్‌లుగా ఉన్నాయి. ఉదాహరణకు 'పుష్ప' సినిమా మారేడుమిల్లి ఫారెస్ట్‌లో చిత్రీకరించారు. విశాఖపట్నం సముద్రతీరాలు, కొండలు సినిమాలకు సహజమైన బ్యాక్‌డ్రాప్‌గా ఉపయోగపడుతున్నాయి.

రూ.25,000 కోట్ల ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ల ఆకర్షణ కోసం...

ప్రభుత్వం 'ఆంధ్ర వ్యాలీ' బ్రాండ్ కింద సినిమా, టూరిజం రంగాలను అభివృద్ధి చేయాలని ఆలోచిస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీలు, మోడరన్ స్టూడియోలు, డబ్బింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇవ్వనుంది. సినిమా షూటింగ్ అనుమతులకు సింగిల్ విండో సిస్టమ్‌ను మరింత బలోపేతం చేసి, వేగవంతమైన, పారదర్శకమైన క్లియరెన్స్‌లు అందించనుంది. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను పునరుద్ధరించి, కొత్త ప్రతిభను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్వర్ణాంధ్ర విజన్-2047 కింద ఏఐ, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా మారాలని లక్ష్యం. 2029 నాటికి టూరిజం, సంబంధిత రంగాల్లో రూ.25,000 కోట్ల ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్‌లను ఆకర్షించాలని ఉద్దేశం.

షూటింగ్ లకు ఆకర్షణీయ రాయితీలు

సినిమాలు షూట్ చేస్తే ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఆకర్షణీయంగా ఉన్నాయి. టూరిజం ప్రాజెక్టులకు ల్యాండ్ కొనుగోలు లేదా లీజ్‌పై 100 శాతం స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్ ఉంటుంది. భూమి కన్వర్షన్ చార్జీల మాఫీ, 15 సంవత్సరాల వరకు 100 శాతం ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయం. ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టులకు 25 శాతం వరకు క్యాపిటల్ సబ్సిడీలు, పెద్ద ప్రాజెక్టులకు 10 శాతం సబ్సిడీలు, హాస్పిటాలిటీ యూనిట్లకు ఇండస్ట్రియల్ టారిఫ్‌లలో విద్యుత్ సరఫరా, 5 సంవత్సరాల విద్యుత్ డ్యూటీ మినహాయింపు వంటివి ఉన్నాయి. టూరిజం, హాస్పిటాలిటీకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం ద్వారా మరిన్ని ప్రోత్సాహకాలు అందుబాటులోకి వస్తాయి.

ఫిల్మ్-ఫ్రెండ్లీ రాష్ట్రంగా...

మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ "ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అత్యంత ఫిల్మ్-ఫ్రెండ్లీ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. నంది అవార్డుల పునరుద్ధరణతో సినిమా పరిశ్రమలో కొత్త యుగం ప్రారంభమవుతుంది. తెలుగు సినిమా భారత్‌లో రెండో అతిపెద్ద పరిశ్రమగా 20 శాతం మార్కెట్ షేర్‌తో ఉంది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, కల్కి 2898 ఏడీ వంటి చిత్రాలు ప్రపంచ స్థాయి బెంచ్‌మార్క్‌లు సెట్ చేశాయి. ప్రపంచ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నాం" అని అన్నారు. ఏఐ యుగంలో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల పెరుగుదలపై చర్చల్లో పాల్గొన్నారు.

ఈ పాలసీలు అమలైతే, ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమకు కొత్త ఊపిరి లభించి, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

Read More
Next Story