పెన్షన్‌లు ఇస్తే పండగవుతుందా..?
x

పెన్షన్‌లు ఇస్తే పండగవుతుందా..?

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌ల పండగ జరుగుతోందట. ప్రతినెలా పెన్షన్‌లు ఇచ్చేదే కదా అంటే ఎన్‌టీఆర్‌ భరోసాగా పేరు మార్చారు. టీడీపీ వారు అడావుడి చేస్తున్నారు. ఇదీ వరస...


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జూన్‌ 1 సోమవారం ఊరూరా హడావుడి. ఉదయం ఐదు గంటలకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులతో కలిసి వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ప్రతినెల ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌లను పంపిణీ చేస్తూ ఫొటోలకు ఫోజులు. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ విపరీతమైన ప్రచారం చేసుకునేందుకు ఆరాటం. ఇదంతా చూస్తుంటే ఎప్పుడులేని ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది పలువురిలో చర్చకు దారి తీసింది.

పాలనలో పార్టీ పెత్తనం ఎప్పుడైనా చూశామా...
పింఛన్‌లు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పంపిణీ చేయొచ్చు. ఎందుకంటే వారు ప్రభుత్వంలో భాగం. కానీ పార్టీ కార్యకర్తలు ప్రజా ప్రతినిధుల మాదిరి ఫోజులిస్తూ పింఛన్‌లు పంపిణీ చేయడం పలు విమర్శలకు దారి తీసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్‌ నుంచి పెంచిన పింఛన్‌ ఇస్తామని చెప్పారు. ఆ ప్రకారం ఇచ్చారు. అదేదో చాలా ఎక్కువ ఇస్తున్నట్లు చెప్పుకోవడం కూడా తప్పే అవుతుంది. ప్రతిపక్షంలో 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిని సాదరంగా ఆహ్వానించి ఆయా నియోజకవర్గాల్లో అధికారులు వారి ద్వారా పింఛన్‌ అందించేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ వారెవ్వరూ రాలేదు. ఎందుకంటే పిలిచి అవమానిస్తారేమోననే అనుమానం వారిలో ఉంది. ఇలా చేస్తూ పోతే అధికార పక్షానికి ప్రతిపక్షంగా హక్కుల సంఘాలు, రాజ్యాంగ పరిరక్షకులు, మేధావులు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉంది.
పించన్‌ల పంపిణీలో రాజకీయ వేదికలు
పింఛన్‌లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అందిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా పలు జిల్లాల్లో హాజరైన ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిణీ చేసే చోట రాజకీయ వేదికలు ఏర్పాటు చేశారు. ప్రతిపక్షంపై బాణాలు ఎక్కుపెట్టారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులపై విమర్శల వర్షం కురిపించారు. పింఛన్‌ల పథకం ప్రారంభించింది స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు కాబట్టి ఈ పథకం తెలుగుదేశం పార్టీ ఘనతని చెప్పుకోవడం విశేషం. ఏపనీ చేసుకోవడం చేతకాని వారికి ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని ఇవ్వాలే కాని దానిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడటపైనా విమర్శలు వెల్లువెత్తాయి.
ఉద్యోగులపై టీడీపీ కార్యకర్తల పెత్తనం ఏమిటి?
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యకలాపాలకే పరిమితం. ఎందుకంటే పార్టీని బలోపేతం చేసుకునే దిశలో వారి పాత్ర ఉంటుంది. అంతే కాని పాలనలో కూడా పార్టీ కార్యకర్తల పెత్తనం ఏమిటనేది పలువురు రిటైర్డ్‌ ఉన్నతాధికారులు, మేధావుల ప్రశ్న. ఇది ప్రమాదకరమైన ధోరణి. ఎప్పుడూ ఇటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు మాత్రమే వచ్చాయి. దాడులు, ప్రతి దాడులు ఎక్కడికక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించి నెలరోజులైంది. అంటే నెల రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలన సాగుతోంది. దాడులు ప్రతి దాడులు జరటం భవిష్యత్‌లో దారుణ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.
కక్ష రాజకీయాలకు నాంది...
రాష్ట్రంలో 2024 ఎన్నికలు కక్ష రాజకీయాలకు నాంది పలికాయి. పెన్షన్‌ల పంపిణీ సందర్బంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కక్ష రాజకీయాలను ప్రస్తావిస్తున్నారు. వారు మాట్లాడుతున్న మాటలు రాష్ట్రంలో దాడులకు పురిగొల్పేలా ఉన్నాయి. మాది పరదాల ప్రభుత్వం కాదని, ఎవరైనా పరదాలు కడితే నాలో 1995 ముఖ్యమంత్రిని చూస్తారని చంద్రబాబు హెచ్చరించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పైగా ఈ వేదికపై నుంచే పోలవరం వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు గురించి మాట్లాడటం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే పలు మార్లు ప్రాజెక్టు గురించి మాట్లాడారు. అయినా మళ్లీ అవే మాటలు, అవే వాదనలతో ముందుకు పోతున్నారు.
Read More
Next Story