హిందూ మత సిద్దాంతంతో ముందుకెళతాడా!
x

హిందూ మత సిద్దాంతంతో ముందుకెళతాడా!

ఏపీ ఉప ముఖ్యమంత్రి మాటలు మేధావులకు సైతం బోధ పడటం లేదు. రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాల్లో ఒక్కటి కూడా జనసేనకు లేకుండా పోతున్నాయా?


జనసేన పార్టీ రాజకీయ పార్టీనా? లేక మతాన్ని ప్రమోట్‌ చేసే పార్టీనా అనేది ఇప్పుడు దేశంలో చర్చకు దారితీసింది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీనెయ్యి వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనగానే ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్వరం ఒక్కసారిగా మారింది. తన మనస్సుకు ఈ సంఘటన ఎంతో కష్టం కలిగించిందని, గత ప్రభుత్వ పెద్దలు కల్తీనెయ్యిని లడ్డులో వాడారంటే ఇంత కంటే ఘోరమైన తప్పిదం మరొకటి లేదని అంటూ తాను ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీక్ష తీసుకోవడంతో పాటు ఊరుకున్నారా? అంటే అదీ లేదు. విజయవాడలోని కనక దుర్గమ్మ మెట్లు కడిగి పసుపు కుంకుమ పెట్టి పూజలు చేశారు.

11 రోజులు దీక్ష చేపట్టిన పవన్‌ కళ్యాణ్‌ తన కుమార్తెలతో కలిసి తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు వెళ్లారు. అక్కడ తన చిన్న కూతురుతో తాను క్రిష్టియన్‌ మతానికి చెందిన బాలికను అయినందున డిక్లరేషన్‌ ఇస్తున్నానని చెప్పించి డిక్లరేషన్‌పై పవన్‌ కళ్యాణ్‌ సంతకం పెట్టి టీటీడీ వారికి అందించి మరో సంచలనం సృష్టించారు. అక్టోబరు 3వ తేదీన వెంకటేశ్వరుని దర్శనం అనంతరం దీక్ష విరమించి రాత్రికి తిరుపతిలో వారాహి సభ నిర్వహించారు. ఆ సభలో సనాతన ధర్మం గురించి చెప్పుకొచ్చారు. భారత దేశంలో పుట్టిన వారెవరైనా సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే అటువంటి వారిని క్షమించ కూడదన్నట్లు ఆయన ప్రసంగం సాగింది. సనాతన ధర్మ బోర్డును దేశంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని దీక్ష చేపట్టినప్పుడే చెప్పారు.
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత వారాహి దీక్ష చేపట్టి అప్పుడు కూడా 11 రోజులు వారాహి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీక్షల సమయాల్లో ఆయన ఆ దీక్షలకు సంబంధించిన వస్త్రాలు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలా దీక్షలు, వ్రతాలు, నిష్టలతో జీవితాన్ని గడిపేందుకు పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోందని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
హిందూ మత ఉన్మాదులు కూడా పవన్‌ కళ్యాణ్‌ మాట్లడినంతగా హిందూ మత సిద్ధాంతం, సనాతన ధర్మం గురించి ఎక్కడా చెప్పటం లేదు. ఎందుకంటే ఈ దేశంలో అన్ని మతాలు కులాలు సమానమని మన రాజ్యాంగం చెబుతోంది. లౌకిక ప్రజాతంత్ర రాజ్యాంగం కాబట్టి అన్ని మతాలను పాలకులు సమాన దృష్టితో చూడాలి. అయితే పాలకుడిగా ఉండి పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతున్న తీరును చూసి పలువురు ఆశ్చర్య పోతున్నారు. సనాతన ధర్మం గురించి ఇప్పటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు సైతం సభలు, సమావేశాలు పెట్టి ప్రత్యేకించి మాట్లాడలేదు. కానీ పవన్‌ కళ్యాణ్‌ వారాహి సభ పెట్టి సనాతన ధర్మం గురించి బోధించడమే కాకుండా సనాతన ధర్మం పాటించని వాడు అసలు హిందువే కాదని చెప్పటం కూడా పలువురిని ఆశ్చర్య పరిచింది.
ఎన్నో ఉన్నత ఆశయాలతో స్థాపించిన జనసేన పార్టీ ఉన్నట్లుండి హిందూ మతం, సనాతన ధర్మం వైపు ఎందుకు మళ్లిందనేది ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఇటువంటి మాటలు మాట్లాడలేదు. అయితే తెరచాటు రాజకీయాలు చేసి ప్రత్యర్థిని మట్టికరిపించడంలో దిట్టగా పేరు సంపాదించారు. పవన్‌ కళ్యాణ్‌ పార్టీని హిందూ మతానికి అంకితమిస్తున్న స్థాయిలో మాట్లాడుతున్నారు. పక్కా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలా మారారనేది పలువురు చేస్తున్న విమర్శ. ఎందుకంటే ఎక్కడెక్కడో పురాతన గుడులు, గోపురాలు సందర్శించి దీక్షలు చేస్తూ పార్టీని ఇటీవల నడిపిస్తున్నారు.
దీనికంతటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే కారణమని, ఆంధ్ర రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసేందుకు పవన్‌ కళ్యాణ్‌ను బిజెపి వారు వాడుకుంటున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్‌డిఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ఎలాగైనా సొంతకాళ్లపై నిలబడేందుకు పావులు కదుపుతున్నారు. పొత్తులతో కొంతకాలం మాత్రమే పార్టీని నడప గలమని, ఆ తరువాత సొంతంగా ముందుకు అడుగులు వేయాల్సిందేననే ఆలోచనలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతానికి బిజేపీ లైన్‌ తీసుకుని ముందుకు వెళుతున్నారని, ఎప్పుడైతే బీజేపీ నుంచి తెగతెంపులు చేసుకుంటారో అప్పుడు ఆయన లైన్‌ మారుతుందని రాజకీయ మేధావులు అభిప్రాయ పడుతున్నారు. ఒక్కోసారి కమ్యూనిజానికి, మత విశ్వాసాలకు కూడా పవన్‌ కళ్యాణ్‌ ముడిపెడుతున్నారు. మావోయిస్టులను బలపరిచిన గద్దర్‌ తనతో కౌగలించుకున్న ఫొటోను షేర్‌ చేస్తూ గద్దరు కూడా సనాతన ధర్మం ఎంతో గొప్పదని చెప్పారని ట్విటర్‌లో పేర్కొనడం విశేషం. జీవిత చరమాంకంలో తాను ప్రశాంతతను కోరుకునేందుకు దేవాలయానికి వెళ్లానని గద్దర్‌ కొన్ని సందర్భాల్లో చెప్పారు. సనాతన ధర్మాన్ని గట్టిగా నమ్మిన వారిలో గద్దర్‌ ఒకరని పవన్‌ కళ్యాణ్‌ చెప్పటం విశేషం.
ఆధ్ర రాష్ట్ర ప్రజలు రాజకీయ నాయకులు, పాలకుల మాటలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి నుంచి పోటీలోకి దిగిన జనసేన పార్టీకి నూరు శాతం మెజారిటీ ఇచ్చి గెలిపించారు. ఓట్లు వేసిన వారిలో అన్ని మతాలు, కులాల వారు ఉన్నారు. వీరు ఇప్పుడు ఏమని ఆలోచిస్తున్నారనేది చర్చ జరుగుతోంది. ఇతర మతాల గురించి చెడుగా మాట్లాడక పోయినా హిందూ మతం చాలా గొప్పదని చెబుతున్నారు. ఈ దేశంలో హిందువైన వాడు సనాతన దర్మాన్ని ఆచరించాల్సిందేనని చెప్పటం ప్రధానంగా ఇతర మతాల్లోని వారిలోనూ చర్చకు దారి తీసింది. వచ్చే ఎన్నికల్లో ఇతర మతాల వారు పవన్‌ కళ్యాణ్‌తో ఉంటారా? ఉండరా? అనే చర్చ కూడా మొదలైంది.
సనాతన ధర్మం గురించి ఏ మాత్రం తెలియని కొందరు, తెలిసో తెలియకో కొంత మంది సినీ నటులు కూడా ప్రచారం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. గాంధీ జయంతి సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అణగారిన వర్గాలను, మహిళలను కించపరిచే రీతిలో సనాతన ధర్మం ఉంటుందన్నారు. మన దేశంలో అనేక కులాలు, మతాలు, భాషలు మాట్లాడే వారు కలిసి ఉండటానికి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం, గాంధీజీ సమతా వాదమే కారణమన్నారు. సనాతన ధర్మం దేశానికి అరిష్టం. రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని కాపాడటానికి గాంధీజీ చూపిన మార్గం అనుసరణీయమన్నారు.
అధికారం వచ్చిన తరువాత పవన్‌ కళ్యాణ్‌ వేషం మారింది. భాష మారిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. శుక్రవారం ఉదయం మీడియాతో ఆమె మాట్లాడుతూ ఏమన్నారంటే..
ఉన్నత మైన హోదాలో డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌గా ఉండి ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో అన్ని మతాలను సమానంగా చూడాలి. కానీ ఒక మతమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదేమన్న పద్దతేనా? ఒక మతానికి చెందిన వేషం వేసుకుని మాట్లాడుతుంటే మిగిలిన మతాల వారికి అభత్రతా భావం కలుగదా? జనసేన పార్టీ అనేది ఒక సెక్యులర్‌ పార్టీ అనే ఉద్దేశ్యం మాకుంది. కానీ ఈరోజు మాకు అర్థమవుతోంది, ఇది కూడా ఒక రైటిస్ట్‌ పార్టీ అని. మతం అడ్డుపెట్టకుని రాజకీయాలు చేయడం అన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతం. ఆ సిద్దాంతాన్ని బీజేపీ అనుసరిస్తుందంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్దాంతాన్ని ఎన్నుకున్నారు? అంటే మీరు కూడా బీజేపీలాగా ఆర్‌ఎస్‌ఎస్‌కు డబుల్‌ ఏజెంటా? మోడీ డైరెక్షన్‌లో పవన్‌ కళ్యాణ్‌ యాక్టర్‌గా మారారు. ఇదంతా మోడీ డైరెక్షన్‌లో జరుగుతున్నది.
Read More
Next Story