US DREAM | H-1B వీసా వచ్చేనా? డాలర్ డ్రీమ్ నెరవేరేనా?
x

US DREAM | H-1B వీసా వచ్చేనా? డాలర్ డ్రీమ్ నెరవేరేనా?

ఇండియాలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది. ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్న వేళ వీసా నిబంధనల్లో మార్పులు రానున్నాయి. దీంతో ఇండియన్ విద్యార్థులు కంగారు పడుతున్నారు.


"అమెరికాలో డాలర్లు పండును, ఇండియాలో సంతానం పండును" అంటారు తెలుగు మహాకవి బాలగంగాధర్ తిలక్. ఇండియాలో పుట్టిన చాలా మంది చూపు ఇప్పుడు అమెరికా వైపే ఉంటున్నదనే దానికి ఈ గేయమే పెద్ద సంకేతం.
అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన వస్తూనే సుమారు 80 నుంచి 100 వరకు కొత్త ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్టు సమాచారం. ఇందులో ఏమి ఉంటాయనే దానిపై ఇంకా స్పష్టత లేనప్పటికీ ఇమిగ్రేషన్ విధానంలో మార్పులకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కచ్చితంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పడీ విధానమే భారతీయ ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.

అమెరికాలోని ఇండియన్ వృత్తి నిపుణులు ట్రంప్ ప్రభుత్వం చేపట్టనున్న H1B వీసా సంస్కరణల వల్ల కష్టాలను ఎదుర్కొంటునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న వార్తల ప్రకారం.. ఉద్యోగ ఆఫర్లు రద్దు అవుతాయి, వీసాల మంజూరులో జాప్యం జరుగుతుంది, ఉద్యోగాలలో కోతలు, రిమోట్ అపాయింట్మెంట్లు వంటి సమస్యలు పెరుగుతాయి. దీంతో చాలా మంది ఇబ్బంది పడతారని అంచనా. కొత్త విధానాలు అమెరికన్ కార్మికులను ప్రాధాన్యతగా చూడడం, వీసా అర్హతలను పెంచడం వంటి మార్పులు భారతీయ వలసదారుల ఉద్యోగ భద్రత, భవిష్యత్ అవకాశాలపై ప్రభావం చూపుతుంది.
H1B వీసా సంస్కరణలపై తీవ్రమైన చర్చల నేపథ్యంలో భారత వృత్తి నిపుణులు ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠిన వలస విధానాలను ప్రవేశపెట్టనుందని అంచనా. ఈ అనిశ్చితి నేపథ్యంలో ఇప్పటికే కొందరు ఉద్యోగ ఆఫర్లు రద్దు చేయించుకుంటన్నారు.
గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎన్. అజయ్ (పేరు మార్చాం) ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వారిలో ఒకరు. డిసెంబరులో ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంది. యూఎస్ కి చెందిన ఓ టెక్ కంపెనీ ఆయనకు ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. కానీ, ఉద్యోగ ఆఫర్ రద్దు అయింది. అమెరికా కంపెనీ ఆఫర్ తో ఆ యువకుడు తన ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలివేశారు. ఇప్పుడు "నేను మళ్లీ మొదటికి వచ్చాను" అని 30 ఏళ్ల అజయ్ వాపోతున్నారు.
అమెరికాలో ఉన్నత వేతనాలు పొందుతూ ఎక్కువ మంది భారతీయులు డేటా సైన్స్, AI, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ సీడింగ్ వంటి పనులు చేస్తున్నారు. కొత్త విధానాలు ఈ వలసదారుల భవిష్యత్తు మబ్బులు కమ్ముకునేలా చేశాయి.
టెక్సాస్ లోని డల్లాస్ లో ఓ ఫైనాన్సియల్ కంపెనీకి కన్సల్టెంట్ గా పని చేస్తున్న నవీన్.. H-1B వీసా పొడిగిస్తారో లేదో నని ఆందోళన చెందుతున్నారు. తెలంగాణకు చెందిన ప్రతాప్ ఇప్పటికే అమెరికాలో ఓ కంపెనీకి డేటా అనలిస్ట్ పని చేస్తున్నప్పటికీ కంపెనీ తిరిగి వీసాను పొడిగిస్తుందో లేదో అని గుంజాటన పడుతున్నారు. ఇలా అనేక మంది కొత్త వీసా నిబంధనలతో ముప్పును ఎదుర్కొంటున్నారు.
H1B వీసా మార్పులు వల్ల భారత వృత్తి నిపుణులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారిపై పడుతున్న ప్రభావం ఇంకా తీవ్రతరం అవుతుందనేది స్పష్టమవుతోంది.
అదే సమయంలో అమెరికాలోని కంపెనీలు తమ విదేశీ నిపుణులకు H-1B వీసాలు ఫైల్ చేయాలా వద్దా అని తర్జనభర్జన పడుతున్నాయి. H-1B వీసా ఓ సంక్లిష్ట విధానం. విదేశీ వృత్తి నిపుణులు, కార్మికుల కోసం అమెరికా ఇచ్చే వీసా ఇది.
ప్రెసిడెంట్ ట్రంప్ మళ్లీ రాకతో H-1B వీసాలు పొందడంలో ఇబ్బందులు తప్పక పోవచ్చుననే వాదన వినిపిస్తోంది. అధిక ఖర్చుల కారణంగా అమెరికన్ కంపెనీలు రిమోట్ హైరింగ్‌ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయని భావిస్తున్నారు. అమెరికన్ కంపెనీలు H-1B ప్రోగ్రామ్ పరిపాలనా భారాలు, అనిశ్చితులను నివారించేందుకు రిమోట్ వర్కర్లను ప్రాధాన్యం ఇస్తున్నాయని, ట్రంప్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టడంతో ఇది మరింత స్పష్టం కానున్నదని "న్యూస్‌వీక్" రిపోర్ట్ చేసింది.
ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతుదారులు చెబుతున్న దాని ప్రకారం, విదేశీ పౌరులను తక్కువ వేతనాలతో నియమించడానికి H-1B వీసాలు కారణమవుతున్నాయి.
"మరో ఛాయిస్ లేని పరిస్థితుల్లోనే H-1B వీసాల కోసం వెళ్తారు. అది ఖరీదైన వ్యవహారమే. లాటరీలో అనిశ్చితి ఎక్కువగా ఉంటుంది. అమెరికా విధానం అదే. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న దరఖాస్తులను వడపోత పట్టే విధానం అదే" అని డికిన్సన్ రైట్ అనే లా ఫర్మ్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ ప్రాక్టీస్ గ్రూప్ చైర్ క్యాథలీన్ క్యాంప్‌బెల్ వాకర్ 'న్యూస్‌వీక్‌' రిపోర్టర్ తో చెప్పారు.
H-1B వార్షిక పరిమితి, ఆంక్షలు..
1990లో ఈ H-1B క్యాటగిరీ మొదలైంది. ప్రతి ఏటా జారీ చేసే H-1B వీసాల సంఖ్యపై కాంగ్రెస్(అమెరికన్ పార్లమెంటు) పరిమితి విధించింది. ప్రస్తుతం వార్షిక పరిమితి 65,000 వీసాలు, అదనంగా మరో 20వేల వీసాలను అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థలలో చదివి మాస్టర్స్ డిగ్రీ లేదా డాక్టరేట్ పొందిన విదేశీ నిపుణులకు వీసాలు ఇస్తార. H-1B ప్రోగ్రామ్ కింద అమెరికా మొత్తంగా ప్రతి ఏటా 85,000 వీసాలు ఇస్తుంది. వాటికి వచ్చే దరఖాస్తుల సంఖ్య మాత్రం 7 నుంచి 8 లక్షల వరకు ఉంటుంది. దీంతో అర్హత కలిగిన వారిని లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తారు.
H-1Bలో భారతీయుల వాటా ఎంతంటే...
H-1B వీసాదారులలో భారతీయుల శాతం ఎక్కువగానే ఉంది. 2022లో భారతీయుల వాటా 77% శాతం. 2023లో ఈ శాతం 72.3%గా ఉంది. 2024లో ఈ శాతం 67కి పడిపోయింది. 2024తో పోల్చితే 2025లో మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 38.6% తగ్గింది. రెండు రౌండ్లలో ఇండియాకి కేటాయించిన వీసాలను లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తుంటారు.
H-1B పిటిషన్ దాఖలు చేసే సమయంలో యుఎస్‌సీఐఎస్ (USCIS)కు వివిధ రకాల ఫీజుల కింద 2,805 డాలర్ల నుంచి 4 వేల డాలర్ల వరకు ఉంటోంది. ఈ మొత్తం ఫీజును చాలా సందర్భాలలో ఉద్యోగులే చెల్లిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఖర్చులను ఆయా ఉద్యోగులను హైర్ చేసే కంపెనీలు చెల్లిస్తాయి.
H1 B వీసా విధానంలో కొత్త మార్పులు..
ప్రత్యేక నిపు‍ణత లేదా పనికి సంబంధించి ఇప్పుడు సరికొత్త ప్రమాణాలు తీసుకువచ్చారు. పనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అవసరం. స్కిల్డ్ లేబర్ ను తీసుకునేటపుడు ఆయా సంస్థలు తమ అవసరాలకు అనుగుణమైన ఉద్యోగానికి సంబంధించిన పట్టభద్రులను మాత్రమే తీసుకోవాలి. ఆ తరహా పనులనే చేయించాలి.
ఇండియా లేదా మరే దేశం నుంచైనా విద్యార్థులు F-1 వీసాలపై వెళతారు. ఏడాది పాటు అమెరికాలో చదివిన తర్వాత పార్ట్ టైం చేసుకునేందుకు అనుమతి ఇస్తారు. ఇప్పుడు దీనిపైనా ఆంక్షలు విధిస్తారని సమాచారం. F-1 విద్యార్థులు H-1B స్టేటస్ కి మారే సమయంలో గతంలో ఉండే నిబంధనల్లో కూడా మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. చదివిన చదువుకీ ఉద్యోగానికి మధ్య మరింత అనుసంధానం ఉండేలా కొత్త నిబంధన ఉండనంది. దీంతో భారతీయ విద్యార్థులు అమెరికాలో ఎక్కువ డిమాండ్ ఉన్న ఉద్యోగాలతో నేరుగా సంబంధం ఉన్న డిగ్రీలను ఎంచుకోవాలి. అలాగే వారి పాఠ్యాంశాలు, అనుభవాత్మక శిక్షణ టార్గెటెడ్ జాబ్ అవసరాలకు సరిపోయేలా ఉండాలి. అప్పుడు మాత్రమే అమెరికా వెళ్లే విద్యార్థులు ఆశ నిరాశల మధ్య ఊగిసలాట లేకుండా వాళ్లకిచ్చిన వీసా గడువు ప్రకారం అమెరికాలో ఉండగలుగుతారు.
ప్రత్యేక నైపుణ్యాలకు మెరుగైన అవకాశాలు..
స్పెషాలిటీ ఆక్వుపేషన్ నిబంధనలు ఇప్పుడు మరింత స్పష్టంగా ఉండనునున్నాయి. ప్రత్యేకతగల లేదా కొత్తగా వచ్చే రంగాలలో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులకు మంచి అవకాశాలు లభించవచ్చు. స్పెషాలిటీ రోల్స్‌కు అనుగుణంగా స్కిల్స్ ఉంటే సవరించిన నిబంధనల ప్రకారం H-1B స్పాన్సర్‌షిప్ పొందడం సులభం కావచ్చు.
మొత్తంగా, భారతీయ విద్యార్థులు చదువులు, ఉద్యోగ ప్రణాళికలను మరింత వ్యూహాత్మకంగా, పకడ్బంధీగా ప్లాన్ చేసుకోవాలసిన సమయం వచ్చింది. F-1 నుంచి H-1B స్థితికి మారాలంటే స్పెషాలిటీ ఆక్వుపేషన్ అవసరాలకు సరిపడే కోర్సులను ఎంచుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది.
Read More
Next Story