పాఠం నేర్పిన మానసపుత్రిక
గ్రామ సచివాలయ వ్యవస్థ సీఎం వైఎస్. జగన్ మానసపుత్రిక. చెప్పింది చేయాల్సిందేనని సచివాలయ సిబ్బందిపై వైసీపీ నేతల పెత్తనం మొదటికే మోసం వచ్చినట్లు కనిపిస్తోంది.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
తిరుపతి: రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మానసపుత్రిక. అందులో పని చేసే సిబ్బంది కష్టాలను సీఎం పట్టించుకున్నట్లు కనిపించలేదు. జాబ్ చార్ట్ కంటే.. తమ పార్టీ నాయకులు చెప్పిందే చేయాలన్నట్లు వ్యవహరించారు. అయితే.. "సిబ్బంది అధికార పార్టీ అస్మదీయులని అభిశంసించిన టిడిపి అధినేతలు నాలిక కరుచుకునే పరిస్థితి ఏర్పడింది"
ఉద్యోగులతో చెలగాటమాడే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదనేది చరిత్ర నేర్పిన పాఠం. ఈ కోవలోనే రాష్ట్రంలో డివిజన్, గ్రామ సచివాలయాల సిబ్బందిపై ఒత్తిళ్లు పెరిగాయి. చెప్పింది చేయలేదంటూ, అధికార పార్టీ నాయకుల దాడులకు గురయ్యారు. సర్వీస్ రెగ్యులైజేషన్, ఆర్థిక ప్రయోజనాల కోసం అనేకసార్లు సిబ్బంది ఆందోళనకు దిగారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్గతంగా రగిలిపోతున్న గ్రామ సచివాలయ సిబ్బంది.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఘాటైన సమాధానం చెప్పినట్లు కనిపిస్తోంది. తిరుపతి నగరంలో పలు వార్డు సచివాలయాలను ఫెడరల్ ప్రతినిధి సందర్శించారు. ఆ సందర్భంలో పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని సిబ్బంది తమ భావాలను పంచుకున్నారు. "మూడేళ్లుగా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు, ఉద్యోగాలకు సంబంధం లేని పనులు చేయించడం భరించలేకపోయాం" అని ఆవేదన చెందారు. రాష్ట్రంలో అనేక చోట్ల జరిగిన సంఘటనలను కూడా వారు ఉదహరించారు. సచివాలయ సిబ్బంది అంతర్గతంగా రగలడానికి దారితీసిన కొన్ని సంఘటనకు పరిశీలిస్తే...
మూడు బదిలీలు
నెల్లూరు: టిడిపి మద్దతుదార్ల ఓట్లు తొలగించండి" అనే మాట వినలేదని కావలి సచివాలయ వెల్ఫేర్ అధికారి భాస్కర్‌ను వేధించారు. ఆయనను స్వల్ప వ్యవధిలోనే మూడుసార్లు బదిలీ చేయించారు. భరించలేని ఆయన మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. దీనికంటే నన్ను చంపేయండని దీనంగా మాట్లాడారు.
కడప: ఫరీద్ నగర్లో వైసీపీ నేత అనుచరులు అక్రమ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దీనిపై అభ్యంతరం చెప్పారని డివిజన్ సచివాలయ కార్యదర్శిపై వైఎస్ఆర్ సీపీ నేత దాడి చేశారు.
ఆత్మహత్యాయత్నం
ప్రకాశం జిల్లా : ధాన్యం సేకరణ ప్రారంభం కాలేదు. గోనెసంచులు ఇవ్వాల్సిందే. లేకుంటే నీ అంతు చూస్తామని హెచ్చరికలతో ఏల్చూరు గ్రామ వ్యవసాయ శాఖ సహాయకురాలు ప్రసన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
దివ్యాంగుడిపై దాడి
శ్రీకాకుళం: పెన్షన్ల మంజూరులో తన మాట వినలేదని, దివ్యాంగుడు అనే కనికరం కూడా లేకుండా శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారం డిజిటల్ అసిస్టెంట్ వాసుదేవ్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.
ఉద్యోగి మృతి
2022 డిసెంబర్: విశాఖ జిల్లా 30వ వార్డు డివిజన్లో చెత్త పన్ను వసూలు చేయడంలో లక్ష్యం సాధించలేదని అధికారులు ఒత్తిడి చేశారు. దీంతో పర్యావరణ కార్యదర్శి బి. చంద్రమోహన్ మానసిక ఒత్తిడి భరించలేక మృతి చెందాడు.
ఆఫీసులో విధ్వంసం
అనంతపురం: ప్రభుత్వ భూమిలో కంచె వేయడాన్ని సచివాలయ ఉద్యోగి అభ్యంతరం చెప్పాడు. ధర్మవరం 26వ వార్డులో ఉద్యోగిని చితకబాదాడమే కాకుండా కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన సంఘటన జరిగింది.
2023 : ప్రొద్దుటూరు: సిబ్బంది కుర్చీలో కూర్చోవద్దని సూచించిన శ్రీనివాసనగర్ సచివాలయంలో ఉద్యోగి వంశీకృష్ణపై వైఎస్ఆర్సిపి వార్డు కన్వీనర్ కే. శ్రీనివాసులు దాడి చేశారు.
వీరవిహారం
కర్నూలు: తాను చెప్పినట్టు చేయాల్సిందే. అని మండిగిరి సచివాలయంలో వైఎస్ఆర్సిపి నేత వీర విహారం చేశారు. మీడియాలో ఈ వీడియో వైరల్ కూడా అయింది. అయినా చర్యలు లేవు. ఇవి మచ్చుకు కొన్ని సంఘటనలు మాత్రమే. అధికార పార్టీ నాయకుల దాడులు, వేధింపులు, ఒత్తిళ్లను భరించలేని పట్టణాల్లోని డివిజన్, పంచాయతీ సచివాలయ సిబ్బందిలో దాదాపు 6830 రాజీనామా చేశారని సమాచారం.
గత మూడేళ్ల కాలంలో ఎదురైన అవమానాలతో సచివాలయ సిబ్బంది గుండెల్లో గూడుకట్టుకుని ఉన్న ఆక్రోశం, అవమానభారం ఒక్కసారిగా బద్దలైంది. ఓటు రూపంలో డివిజన్, గ్రామ సచివాలయ సిబ్బంది గుణపాఠం చెప్తారా.. ఈ వ్యవహారాన్ని అంచనా వేయడంలో టిడిపి అధినాయకత్వం పప్పులో కాలు వేసిందా? అంటే వాస్తవిక పరిస్థితి అవుననే సమాధానం చెబుతోంది.
హామీ మేరకు ఉద్యోగాలు..
2019 ఎన్నికల వేళ హామీ మేరకు సచివాలయాల ఏర్పాటుతో వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కింది. వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేశారు. "సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కులం- మతం- ప్రాంతం చూడం" అనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటను క్షేత్రస్థాయిలో నాయకులు కూడా వల్లే వేశారు. ఇందుకోసం..
రాష్ట్రంలో 15,004 వార్డు సచివాలయాల్లో సీఎం ఒక్కో సచివాలయంలో అన్ని విభాగాలకు 11 మంది ఉద్యోగులను నియమించడం ద్వారా 1.34 లక్షల మందికు ఉద్యోగావకాశాలు కల్పించారు. ఏడాది పాటు సమస్య లేకుండా వ్యవహారాలు సవ్యంగా సాగాయి. ఆ తర్వాత వలంటీర్లను తమ చెప్పుచేతుల్లోకి తీసుకోవడం " టిడిపికి విమర్శనాస్త్రంగా" మారింది. సిబ్బందిపై వైఎస్ఆర్సిపి నేతలు, మద్దతుదారుల పెత్తనం పెరిగింది. చెప్పినట్టు చేయలేదని దాడులకు కూడా పాల్పడ్డారు. ఆ తర్వాత నేతలు, ఎమ్మెల్యేల ప్రమేయంతో సిబ్బంది అవమానాలు దిగమింగుకున్నారు. జాబ్ చార్ట్ అమలు కావలసిన చోట అధికార వైఎస్ఆర్సిపి నేతల చార్ట్ అమలు చేశారు. మాట వినని వారిపై దాడులకు తెగబడ్డారు.
పేరుకే.. జాబ్ చార్ట్
వార్డు సచివాలయాల్లో సిబ్బందికి ప్రభుత్వం జాబ్ చార్ట్ ఇచ్చింది. ఆ మేరకు తమకు విధులు నిర్వహించే అవకాశం కల్పించలేదనేది సిబ్బంది ఆవేదన చెందారు. "పారిశుద్ధ్య కార్మికుల పర్యవేక్షణ, కాలువలు శుభ్రం చేయించే" పనుల పర్యవేక్షణకు సైన్స్ పాఠ్యాంశంగా డిగ్రీ ఎందుకు అని కూడా గతంలో ప్రశ్నించారు. 2019 అక్టోబర్లో వీధిలోకి తీసుకున్న తమ సర్వీసులు 2021లో క్రమబద్ధీకరించిన వేతన స్థిరీకరణ చేయడంలో 9 నెలలు ఆలస్యం చేశారు. దీనివల్ల ఒక్కో ఉద్యోగి 90 వంతున 1.34 లక్షల మంది ఉద్యోగులు రు. 1206 కోట్లు ప్రభుత్వ విధానం వల్ల నష్టపోయిన విషయాన్ని కొందరు ఉద్యోగులు ఫెడరల్ ప్రతినిధితో పంచుకున్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఉద్యోగులు ప్రధానంగా గ్రామ సచివాలయ సిబ్బంది గట్టిగానే సమాధానం చెప్పినట్టు కనిపిస్తోంది.