
ఎంఎల్ఏగా గాలి జనార్ధనరెడ్డిపై వేటు తప్పదా ?
మరో షాక్ ఏమిటంటే ఎంఎల్ఏ పదవిని కూడా కోల్పోబోతున్నట్లు సమాచారం
మైనింగ్ కింగ్ గా పాపులరైన గాలి జనార్ధనరెడ్డికి తొందరలోనే మరో షాక్ తగలబోతోందా ? బీజేపీ వర్గాల నుండి అవుననే సమాధానం వినబడుతోంది. గాలికి మరో షాక్ ఏమిటంటే ఎంఎల్ఏ పదవిని కూడా కోల్పోబోతున్నట్లు సమాచారం. ఇనుపఖనిజం అక్రమతవ్వకాల కేసులో సాక్ష్యాధారాలతో నిరూపణ అయినందుకు గాలి(Gali Janardhanareddy)తో పాటు మరో నలుగురికి సీబీఐ కోర్టు(CBI Court) మొన్న 5వ తేదీన ఏడేళ్ళు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. కర్నాటకలోని గంగావతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గాలి ఎంఎల్ఏగా 2023లో గెలిచారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, సెక్షన్ 3 ప్రకారం ఎంఎల్ఏ, ఎంపీలో ఎవరికైనా ఏ కేసులో అయినా కోర్టు 2 సంవత్సరాలకు మించి జైలుశిక్షను విధిస్తే సదరు ప్రజాప్రతినిధి తన పదవిని కోల్పోతారు. జైలుశిక్షకు సంబంధించిన తీర్పు కాపీ అధికారికంగా కోర్టు నుండి అసెంబ్లీ లేదా పార్లమెంటుకు చేరిన తర్వాత అనర్హత ప్రక్రియను స్పీకర్ మొదలుపెడతారు. అనర్హత అంశం కోర్టు తీర్పుచెప్పిన తేదీనుండే అమల్లోకి వస్తుంది.
ఇక్కడ విషయం ఏమిటంటే గాలికి శిక్షపడిన సమాచారం కోర్టు నుండి కర్నాటక అసెంబ్లీకి అధికారికంగా చేరిన తర్వాత ఎంఎల్ఏకు స్పీకర్ నుండి ఒక నోటీసు జారీ అవుతుంది. ఆ నోటీసుకు గాలి ఎలాంటి సమాధానం ఇచ్చినా సరే అనర్హత వేటయితే పడటం ఖాయం. అయితే ఇక్కడ మళ్ళీ మరో మెలికుంది. అదేమిటంటే సీబీఐ కోర్టు తీర్పు చెప్పిన మూడుమాసాల్లోగా గాలి గనుక హైకోర్టు లేదా సుప్రింకోర్టులో అప్పీలు చేసుకుని శిక్ష అమలుపై స్టే తెచ్చుకుంటే అనర్హత వేటుపడదు. ఎందుకంటే సీబీఐ విధించిన శిక్షను పై కోర్టు నిలిపేసింది కాబట్టి. ఒకసారి ఎగువ కోర్టు స్టే ఇచ్చి మళ్ళీ కేసును విచారించి, శిక్ష విధించటమో లేకపోతే కేసును కొట్టేయటమో ఏదో ఒకటిచేస్తుంది. ఒకవేళ సీబీఐ కోర్టు విధించిన శిక్షనే ఎగువకోర్టు కూడా సమర్ధిస్తే అప్పుడు అసెంబ్లీ స్పీకర్ గాలిపై అనర్హత వేటు వేయటానికి అవకాశముంటుంది.
సీబీఐ కోర్టు గాలితో పాటు మరో నలుగురికి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు(OMC Case)లో ఏడేళ్ళు శిక్ష విధించిన తర్వాత వాళ్ళ లాయర్ మాట్లాడుతు కచ్చితంగా తాము ఎగువకోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పారు. కాబట్టి సీబీఐ కోర్టు తీర్పుప్రకారం చంచల్ గూడజైలులో గాలి శిక్షను అనుభవించేందుకు సిద్ధపడతారని అనుకునేందుకులేదు. కాకపోతే గాలిలాయర్ దాఖలుచేసిన పిటీషన్ను ఎగువ కోర్టు అనుమతిస్తుందా లేదా అన్నదే ఆసక్తిగా మారింది. ఒకవేళ గాలి జనార్ధరెడ్డి ఎగువ కోర్టులో పిటీషన్ వేసేంతలోగా సీబీఐ కోర్టు నుండి అసెంబ్లీకి శిక్ష తాలూకు అధికారిక సమాచారం స్పీకర్ కు అందితే నోటీసిచ్చి అనర్హత వేటు వేసేయచ్చు. అయితే గాలి దాఖలుచేసిన పిటీషన్ను ఎగువకోర్టు విచారణకు స్వీకరిస్తే అనర్హత వేటుపై కోర్టు ద్వారానే గాలి స్టే తెచ్చుకునేందుకు అవకాశాలున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.