వారం రోజుల వ్యవధిలో విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మరోసారి సందడికి వేదిక కాబోతోంది. ఐపీఎల్ 2025 టీ–20 క్రికెట్ మ్యాచ్‌ల్లో భాగంగా ఈనెల 24న ఢిల్లీ క్యాపటిల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. ఈ ఐపీఎల్ సీజనులో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. ఆడిన తొలి ఆ మ్యాచ్‌ను గెలుచుకుంది. వైజాగ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ, వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 211 పరుగులు చేసి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. విశాఖ స్టేడియంలోనే ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్–సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ ఆర్ హెచ్) జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆట ప్రారంభమవుతుంది.
ఢిల్లీ మళ్లీ సత్తా చాటుకుంటుందా?
ఆదివారం తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్‌ఆర్‌హెచ్ జట్లు జోరు మీదే ఉన్నాయి. ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి ఢిల్లీ జట్టు హుషారుతో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు విశాఖ స్టేడియం హోమ్ గ్రౌండ్. ఈ హోమ్ గ్రౌండ్‌పై గెలిచిన స్థైర్యంతో ఆదివారం ఎస్‌ఆర్ హెచ్‌ను ఢీకొట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్‌ను కూడా గెలుచుకుంటామన్న ధీమాతో ఉన్న ఈ జట్టు అందుకు తగ్గట్టుగా గట్టిగానే ప్రాక్టీస్ చేసింది.
దూకుడు మీదున్న ఎస్ ఆర్ హెచ్
మరోవైపు ఎస్ ఆర్ హెచ్ జట్టు కూడా మంచి దూకుడు మీద ఉంది. ఈ ఐపీఎల్ సీజనులో రాజస్థాన్ రాయల్స్‌పై ఈనెల 23న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 242 పరుగులు చేసి ఓటమి పాలైంది. దీంతో ఈ సీజనులో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్ కొనసాగుతోంది. అలాగే ఈనెల 27న హైదరాబాద్‌లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 190 పరుగులు చేసింది. అయితే లక్నో 193 పరుగులతో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. అంటే ఇప్పటివరకు ఎస్‌ఆర్ హెచ్ రెండు మ్యాచ్‌లు ఆడగా ఒకటి గెలిచింది. మరో మ్యాచ్‌ను చేజార్చుకుంది.
ఇరు జట్లకూ ప్రతిష్టాత్మకమే..
ఆదివారం విశాఖలో జరిగే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు, ఎస్‌ఆర్ హెచ్‌కూ ప్రతిష్టాత్మకమే. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో గెలిచి రెండో మ్యాచ్‌లోనూ అదే స్టేడియంలో అలాంటి గెలుపు కోసమే తహతహలాడుతోంది ఢిల్లీ క్యాపిటల్స్. అంటే ఆడిన రెండు మ్యాచ్‌లోనూ గెలిచామనిపించుకోవడానికి తాపత్రయ పడుతోంది. ఇక ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఆడిన రెండింటిలో ఒక మ్యాచ్‌లో గెలిచి రెండో గెలుపు కోసం ఉవ్విళ్లూరుతోంది. ఈ జట్టు ఆలవోకగా భారీ స్కోరును సాధిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ స్కోరు లక్ష్యాన్ని ఇవ్వాలన్నది ఎస్‌ఆర్‌హెచ్ వ్యూహంగా ఉంది.
పరుగులు వరద పారించే వైజాగ్ స్టేడియం
వైజాగ్ స్టేడియం అంటే బ్యాటర్లకే కాదు..క్రికెట్ అభిమానులకూ సంబరమే. ఈ మైదానం బ్యాటర్లకు అనుకూలంగా ఉండడం వల్ల పలుమార్లు భారీ స్కోరు నమోదవుతూ ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ స్టేడియంలో గత సీజను 2024 ఫిబ్రవరిలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 272 భారీ స్కోరు సాధించింది. ఈ గ్రౌండ్‌లో ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఇదే అత్యధిక స్కోరు. ఆ తర్వాత ఈనెల 24న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. లక్నో సూపర్‌జెయింట్స్‌పై చేసిన 211 పరుగులే రెండో అత్యధికం. ఇంకా వన్డేలు, టీ–20 మ్యాచ్‌ల్లోనూ ఈ స్టేడియంలో వివిధ జట్లకు చెప్పుకోదగిన పరుగులే లభించాయి. దీంతో ఆదివారం నాటి ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్‌ఆర్‌హెచ్ జట్లు కూడా మంచి స్కోర్లే సాధిస్తారని వైజాగ్ క్రికెట్ అభిమానులు ఆశాభావంతో ఉన్నారు. మొన్న ఈ స్టేడియంలో ఢిల్లీ, లక్నో జట్లు భారీ స్కోరుతో క్రికెట్ ఫ్యాన్స్‌ను రంజింపచేశారు. ఆఖరి వరకు ఈ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. ఆదివారం నాటి మ్యాచ్ కూడా అలాగే థ్రిల్లింగ్‌నిస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉంది అని ఎ వినయ్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పాడు.
అలరించనున్న బ్యాటర్లు..
ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్‌ఆర్‌హెచ్ జట్లలో ఫోర్లు, సిక్సర్లతో అలరించే ఆటగాళ్లకేమీ కొదవ లేదు. ఢిల్లీ జట్టులో అక్సర్ పటేల్ (కెప్టెన్), డూప్లెసిస్, అశుతోష్ శర్మ, స్టబ్స్, విప్రజ్‌లు ఉన్నారు. ఎస్‌ఆర్‌హెచ్ టీమ్‌లో కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్‌శర్మ, ఇషాన్ కిషన్, నితీష్‌కుమార్‌రెడ్డి, షమీలు విజ్రుంభించనున్నారు. శనివారం ఉదయమే వైజాగ్ క్రికెట్ గ్రౌండ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యులు నెట్ ప్రాక్టీస్‌కు వచ్చి సందడి చేశారు. వారిని చూడటానికి క్రికెట్ ప్రియులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. కేరింతలు కొట్టారు. స్టేడియం చుట్టూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యుల ఫోటోలతో కూడిన హోర్డింగ్స్‌ను అమర్చారు.
నితీష్.. స్పెషల్ అట్రాక్షన్..
విశాఖలో ఆదివారం జరిగే మ్యాచ్‌లో వైజాగ్ కుర్రాడు కాకి నితీష్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. ఆల్ రౌండర్ అయిన నితీష్ ఎస్‌ఆర్‌హెచ్ టీమ్‌లో రెండేళ్ల నుంచి ఆడుతున్నాడు. ఇటీవల అస్ట్రేలియాతో ఆడిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 21 ఏళ్ల ఈ నితీష్ తన సొంత నగరం విశాఖపట్నం స్టేడియంలో ఆడుతున్నాడన్న సంగతి తెలిసి, వైజాగ్ క్రికెట్ అభిమానులు నితీష్ ఆట కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆయన ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌ల్లో రాణించాలని కోరుకుంటున్నారు.