
సీఎం చంద్రబాబు మాటలు విద్యుత్ రంగాన్ని స్థిరీకరిస్తాయా?
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగ సాధికారత, సవాళ్లు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంలో తమ ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరిస్తూ, విద్యుత్ ఛార్జీలలో 13 పైసలు తగ్గింపును ప్రస్తావించారు. రూ.4,500 కోట్ల ట్రూ-అప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించడం, 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ.3.70కు తగ్గించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ చర్యలు రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఇతర రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనలు రాష్ట్ర విద్యుత్ రంగాన్ని స్థిరీకరించే ప్రయత్నంగా కనిపిస్తున్నప్పటికీ, వాటి నిజానిజాలు, దీర్ఘకాలిక ప్రభావాలపై రాజకీయ పరిశీలకుల మధ్య చర్చలు ఉన్నాయి.
విద్యుత్ ఛార్జీల తగ్గింపు, ట్రూ-అప్ ఛార్జీల భారం
ముఖ్యమంత్రి చెప్పినట్లు విద్యుత్ ఛార్జీలలో 13 పైసలు పర్ యూనిట్ తగ్గింపు నిజమేనని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్‌సీ) ఆదేశాలు నిర్ధారిస్తున్నాయి. ఈ తగ్గింపు 'ట్రూ డౌన్' మెకానిజం ద్వారా అమలవుతోంది. ఇది 2025 సెప్టెంబర్ నుంచి అమలులోకి వచ్చింది. నవంబర్ 2025 నుంచి 12 నెలల పాటు రీఫండ్ రూపంలో కన్స్యూమర్లకు అందుతుంది. ఇది గృహ, వ్యాపార వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కల్పిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
అదేవిధంగా రూ.4,500 కోట్ల ట్రూ-అప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలనే నిర్ణయం కూడా ఏపీఈఆర్‌సీ ఆమోదించింది. మొత్తం నెట్ ట్రూ-అప్ మొత్తం రూ.4,498 కోట్లుగా ఉండగా, దీనిని డిస్కమ్‌లకు (విద్యుత్ పంపిణీ సంస్థలు) ప్రభుత్వం చెల్లిస్తుంది. తద్వారా కన్స్యూమర్లపై భారం పడకుండా చేస్తుంది. ఇది గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ కాలంలోని లెగసీ డ్యూస్‌లను పరిష్కరించడానికి ఉద్దేశించిందని, ఇది కన్స్యూమర్లకు ఎలాంటి టారిఫ్ హైక్ లేకుండా చేస్తుందని ప్రభుత్వం వివరించింది.
ఈ చర్యలు సానుకూలంగా పరిగణలోకి తీసుకోవాల్సనవే. ఎందుకంటే అవి రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని స్థిరీకరించి, పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడ్డాయి. ఉదాహరణకు స్థిరమైన విద్యుత్ సరఫరా, తక్కువ ధరలు, డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడానికి కారణమయ్యాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 25.3 శాతం ప్రతిపాదిత పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ రిఫార్మ్స్ సహకరించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దీర్ఘకాలిక లక్ష్యాలు, విమర్శలు
2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ.3.70కు తగ్గించాలనే లక్ష్యం ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికల్లో భాగం. ఇది సోలార్, ఇతర పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం ద్వారా సాధ్యమవుతుందని, PM-కుసుం, PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనల ద్వారా 4,792 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చడానికి సహాయపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఈ రిఫార్మ్స్ పట్ల విమర్శలు కూడా లేకపోలేదు. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని నిందిస్తూ, పవర్ సెక్టర్‌లో రూ.1.29 లక్షల కోట్ల నష్టాలకు కారణమని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కానీ ఈ రిఫార్మ్స్ చాలెంజెస్‌ను ఎదుర్కోవాల్సి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఉదాహరణకు పవర్ యుటిలిటీలను ఓవరాల్ చేసి NTPC, SBI నుంచి నిపుణులను నియమించడం సానుకూలమైనప్పటికీ, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు లేదా రంగాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం ద్వారా ఏర్పడే ప్రతికూల ప్రభావాలపై ఉండే ఆందోళనలు, భయాలు పోగొట్టాలి. ఇవి సాధారణంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణాల నుంచి ఉత్పన్నమవుతాయి.
గత ప్రభుత్వం తొమ్మిది సార్లు టారిఫ్ పెంచిందని విమర్శలు ఉన్నాయి. కానీ ప్రస్తుత రిఫార్మ్స్ దీర్ఘకాలికంగా స్థిరత్వాన్ని నిర్ధారించాల్సి ఉంది. అంతేకాకుండా CAG రిపోర్టుల ప్రకారం రాష్ట్ర ఆర్థిక స్థితి సవాలుతో కూడుకున్నదని, ఇది ఈ లక్ష్యాలను ప్రభావితం చేయవచ్చని కొందరు పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం విద్యుత్ రంగంలో తీసుకున్న చర్యలు కన్స్యూమర్లకు తక్షణ ఉపశమనం కల్పించినప్పటికీ, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఆర్థిక స్థిరత్వం, పునరుత్పాదక ఇంధన విస్తరణ, పారదర్శక అమలు అవసరం. రాజకీయ పరిశీలకులు ఈ రిఫార్మ్స్‌ను స్వాగతిస్తున్నప్పటికీ, గత రిఫార్మ్స్ చరిత్రను గమనిస్తూ, ఇవి రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానానికి తిరిగి తీసుకువెళ్తాయా లేదా అనేది సమయమే నిర్ధారిస్తుంది.

