బాబు కేంద్రంలో మళ్ళీ చక్రం తిప్పుతారా!
x

బాబు కేంద్రంలో మళ్ళీ చక్రం తిప్పుతారా!

ఆంధ్రప్రదేశ్‌కు మంచిరోజులు వచ్చినట్లే అనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కావలసిన బలం లేకపోవటంతో మిత్రపక్షాల అవసరం ఏర్పడింది.



(శ్రావణ్ బాబు, సీనియర్ జర్నలిస్ట్)

ఆంధ్రప్రదేశ్‌కు మంచిరోజులు వచ్చినట్లే అనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కావలసిన బలం లేకపోవటంతో మిత్రపక్షాల అవసరం బాగా ఏర్పడింది. అందులోనూ, ఉన్న మిత్రపక్షాలన్నింటిలోకీ అత్యధిక స్థానాలు సాధించిన టీడీపీ అవసరం ఇంకా బాగుంది. ఈ పరిస్థితులతో చంద్రబాబుకు కేంద్రంలో మళ్ళీ చక్రం తిప్పే ఒక గొప్ప అవకాశం అందుబాటులోకి వచ్చింది. మరి ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని, విభజనతో అన్యాయానికి గురైన ఏపీ పునర్నిర్మాణానికి కేంద్రం నుంచి కావలసిన అన్ని విషయాలనూ సాధించుకుంటారా లేదా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

గతంలోనూ కీలకపాత్ర

చంద్రబాబు గతంలో 1996-2004 కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాలలో కీలకపాత్రను పోషించారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవుల భర్తీలో ఆయన మాటే ఢిల్లీలో చెల్లుబాటు అయింది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఎర్రన్నాయుడు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేణుగోపాలాచారి వంటి తెలుగుదేశం ఎంపీలు కీలకమైన మంత్రిత్వశాఖలను చేపట్టారు కూడా. చంద్రబాబు మద్దతు ఉపసంహరించుకోవటంతోనే 1998లో కేంద్రంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కూలిపోయి ఎన్నికలు వచ్చాయి. తదనంతరం ఏర్పడిన వాజ్‌పేయి(ఎన్‌డీఏ) ప్రభుత్వంలోనూ బాబు హవా బాగానే నడిచింది. అయితే ఈసారి ఆయన కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోకుండా, కేవలం స్పీకర్ పదవిని మాత్రం బాలయోగికి ఇప్పించారు. ఆ తర్వాత 2004లో ఇక్కడ రాష్ట్రంలోనూ, అక్కడ కేంద్రంలోనూ ఇటు టీడీపీ, అటు బీజేపీ ఘోరంగా ఓడిపోవటంతో చంద్రబాబు జాతీయ రాజకీయాలలో కనుమరుగయ్యారు. ఇప్పుడు మళ్ళీ బాబుకు ఆ అవకాశం దక్కబోతోంది.

విభజనలో తీవ్రమైన అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో అవసరాలు ఉన్నాయి. హైదరాబాద్ స్థాయి నగరం ఏదీ ఏపీకి లేకపోవటంతో ఆదాయ వనరులకు తీవ్రమైన కొరత ఉంది. ఆ అన్యాయాన్ని పూడ్చటానికి ప్రత్యేకహోదా ఇస్తామంటూ కాంగ్రెస్‌కు నాడు వత్తాసు పలికిన బీజేపీ తదనంతర కాలంలో ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కింది. పోలవరం నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి నామమాత్రపు నిధులే తప్ప పెద్దగా సాయపడలేదు.

ఏపీకి కలిసొచ్చిన అదృష్టం

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీకి ఏపీ అవసరం ఏర్పడటం కలిసొచ్చిన అదృష్టమేనని చెప్పుకోవాలి. మరోవైపు, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవ్విళ్ళూరుతున్న కాంగ్రెస్ పార్టీ, ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామంటూ తమ కూటమిలోకి రావాలని టీడీపీకి ఆఫర్ ఇచ్చింది. అవసరమైతే ఉపప్రధాని పదవికూడా ఇస్తామని నితీష్‌కు, చంద్రబాబుకు ఆశ చూపుతోంది.

1999-2004 కాలంలో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మోదిపై గుజరాత్ నరమేధానికి బాధ్యుడని ఆరోపణలు వచ్చినప్పుడు, ఆయనను ముఖ్యమంత్రి పదవినుంచి తొలగించాలని చంద్రబాబు వాజ్‌పేయికి సూచించాడు. ఆ కోపాన్ని పెట్టుకుని, 2014 నుంచి మొన్నటిదాకా మోది చంద్రబాబును ఎన్నో రకాలుగా అవమానించారు. తెలుగుదేశం ఎన్‌డీఏలో చేరినా కూడా మిత్రపక్షమనికూడా చూడకుండా బాబును కాదని జగన్‌కు అధిక గౌరవం ఇచ్చేవారు. మోదిని కలవటానికి బాబు 21 సార్లు అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వకపోగా, జగన్‌కు మాత్రం అడిగినంతనే ఇవ్వటం చేసేవారు. దరిమిలా బాబు ఎన్‌డీఏ నుంచి బయటకు రావటం, టీడీపీ అధికారాన్ని కోల్పోవటం జరిగాయి. తదనంతర కాలంలో చంద్రబాబు ఎన్‌డీఏలో చేరాలని ఎంత ప్రయత్నించినా సానుకూలంగా స్పందించలేదు. బాబు అరెస్ట్ వెనుక కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల అనుమతి ఉందనే వాదన కూడా ఉంది. అయినా బాబు బీజేపీలో చేరాలని ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి, పవన్ జోక్యంతోనే బీజేపీలోకి తెలుగుదేశాన్ని చేర్చుకున్నారు.

ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అన్నట్లుగా తయారయింది మోది-చంద్రబాబు బంధం. కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బాబు దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు ఈ అవకాశాన్ని ఎంతమేరకు సద్వినియోగం చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు ఏం చేయబోతున్నారు?

చంద్రబాబు నాయుడిది ఇప్పుడు పైచేయిగా ఉంది కాబట్టి ఆయన కేంద్రంనుండి రాష్ట్రానికి కావలసిన డిమాండ్లను కమాండ్ చేసి మరీ సాధించుకోవచ్చు. కనుక అటు రాష్ట్ర ప్రయోజనాలు, ఇటు తన పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆయన కేంద్రాన్ని ఈ హామీలపై పట్టుబట్టే అవకాశం ఉంది.

1. రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై హామీ.

2. రాజధాని నిర్మాణానికి నిధులపై హామీ.

3. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి కేంద్ర సహకారంపై హామీ.

4. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులలో వేగం పెంచి అతనిని కట్టడి చేయించటం.

పై నాలుగే కాకుండా, టీడీపీకి మైనారిటీల ఓట్లను పరిరక్షించుకునేందుకుగానూ, ముస్లిమ్‌లకు రిజర్వేషన్లు తీసేస్తామన్నమాటను బీజేపీ ఇకముందు మాట్లాడకూడదని కూడా చంద్రబాబు అడిగే అవకాశం ఉంది. మరి ఈ హామీలను అన్నింటినీ ఆయన సాధించుకోగలుగుతారా, లేదా అన్నది చూడాల్సిఉంది.

Read More
Next Story