వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యత ఎవరు భుజాలకెత్తుకుంటారు?
మునుపటిలా బొత్స ఉత్సాహం చూపిస్తారా? మరో దిగుమతి నాయకుడిని తెస్తారా? విజయసాయిరెడ్డి నిష్క్రమణతో సర్వత్రా చర్చ.
అధికారం పోయింది. పార్టీలో ఒక్కొక్కరూ చేజారి పోతున్న పరిస్థితి. పార్టీలో పట్టుమని పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా లేని దుస్థితి. పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. ఇలా అంతా అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో వైసీపీకి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి గట్టి ఝలక్ ఇచ్చారు. అనూహ్యంగా ఆయన వైసీపీకీ, రాజ్యసభ పదవికి రాజీనామా చేసేశారు. ఏకంగా రాజకీయాలకే గుడ్బై చెప్పేస్తున్నట్టు ప్రకటించారు. విజయసాయిరెడ్డికి పేరుకే జాతీయ ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ ఆయనకు విశాఖతోనూ, ముఖ్యంగా ఉత్తరాంధ్రతోను ఫెవికాల్ లాంటి బంధం ఉంది. పార్టీ ఆయనకు రెండు దఫాలు ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త పదవిని కట్టబెట్టింది.
పార్టీలో ఎవరి ఇష్టాయిష్టాలతో పనిలేకుండా, ఆయన పట్ల వ్యతిరేకత ఉన్నా పట్టించుకోకుండా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకపక్షంగా విజయసాయిరెడ్డికే ఉత్తరాంధ్ర పగ్గాలు అప్పజెప్పారు. మొదట్లో ఆ బాధ్యతలు అప్పజెప్పినప్పుడే ఆయనపై ఇంటాబయటా ఆరోపణలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. అవి తీవ్ర రూపం దాల్చడంతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావించి 2024 ఎన్నికలకు ముందు విజయసాయిని అతికష్టమ్మీద ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించి దక్షిణ కోస్తాంధ్రకు మార్చారు. ఆయన స్థానంలో జగన్ సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డిని తెచ్చి పెట్టారు. విజయసాయిరెడ్డితో పోల్చుకుంటే సుబ్బారెడ్డికి దూకుడు తక్కువ. సుబ్బారెడ్డి వచ్చాక కూడా చాన్నాళ్లు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీలో విజయసాయిరెడ్డి వర్గం యాక్టివ్గానే ఉండేది.
ఇలా పార్టీ శ్రేణులు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి గ్రూపులుగా చెలామణి అవుతూ వచ్చారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నికల ఫలితాలు వచ్చి వైసీపీ అధికారాన్ని పోగొట్టుకున్నాక జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త పదవి నుంచి సుబ్బారెడ్డిని తప్పించారు. దీంతో ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణకు ఆ పదవిని కట్టబెడతారన్న ప్రచారం జరిగింది. ఆయనకు ఆ పోస్టు ఇస్తే ఉత్తరాంధ్రలో పట్టుకోల్పోయిన వైసీపీని కొంతవరకైనా గాడిలో పెడతారని మెజారిటీ క్యాడరు భావించింది. కానీ అందుకు భిన్నంగా అధినేత జగన్ మళ్లీ విజయసాయిరెడ్డినే నియమించారు.
అప్పటికే విశాఖపట్నంలో సాయిరెడ్డిపై పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు రావడంతో ఆయనపై ఇటు పార్టీలోనూ, అటు ప్రజల్లోనూ వ్యతిరేకత ఉంది. ఇలాంటి నాయకుడిని ఎలా మరోసారి సమన్వయకర్తగా నియమిస్తారంటూ పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. పార్టీ అధికారాన్ని కోల్పోవడం, తనపై ఆరోపణలు, కేసులు, విచారణలు ముప్పేట దాడి మొదలవడంతో ఈసారి విజయసాయి మునుపటిలా దూకుడును ప్రదర్శించకుండా కొంచెం తగ్గినట్టు కనిపించారు. అంతేకాదు.. అంతకుముందులా చీటికీమాటికీ విశాఖపై వచ్చి వాలడం తగ్గించారు. గతంలో సాయిరెడ్డికి, ఇప్పటి సాయిరెడ్డిలో వచ్చిన మార్పును పార్టీ శ్రేణులు గమనించారు. ఇంతలో అనూహ్యంగా పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి, రాజకీయాలకూ గుడ్బై చెబుతున్నట్టు ప్రకటించి విజయసాయి సంచలనం సృష్టించారు. దీంతో పార్టీలో విజయసాయి వ్యతిరేకులు సంతోషంగా ఉన్నా ఆయన అనుచరులు మాత్రం షాక్లో ఉన్నారు.
ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఎవరు?
విజయసాయి నిష్క్రమణతో వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవి ఖాళీ అయింది. ఇప్పుడు ఆ పోస్టులో ఎవరిని నియమిస్తారన్న చర్చ వైసీపీలో అప్పుడే మొదలైంది. అధికారంలో ఉన్నా, పార్టీ బలంగా ఉన్నా ఈ పదవి కోసం పోటీ పడేవారు. కానీ ఇప్పుడు ఆ రెండూ లేకపోవడంతో ఆ పదవి కోసం ముందుకొచ్చే వారు కరువయ్యారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో బొత్స సత్యనారాయణ ఆసక్తి కనబరిచే వారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కూడా ఈ పదవిని చేపట్టడానికి సుముఖంగా లేరని చెబుతున్నారు. పవరూ లేక, పార్టీ బలంగానూ లేకపోతే క్యాడరును సమన్వయం చేయడం కష్టమన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ కాదంటే మళ్లీ వైవీ సుబ్బారెడ్డికే ఉత్తరాంధ్ర పగ్గాలు అప్పగిస్తారా? లేక మరో నాయకుడిని దిగుమతి చేస్తారా? అన్న దానిపై పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విజయసాయి వ్యవహారం సద్దుమణిగే వరకు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పోస్టుపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.