ఆంధ్రప్రదేశ్‌ను డ్రోన్ హబ్‌గా మారుస్తా: సీఎం చంద్రబాబు
అమరావతి డ్రోన్ సమ్మిట్–2024ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ అనేది తమ విధానమన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో ఎక్కడా లేని విదంగా డ్రోన్ హబ్‌గా మారుస్తానని, దాని కోసం కష్టపడి పని చేస్తామని, అలా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ వేదికగా మంగళవారం డ్రోన్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. రెండు రోజులపాటు ఈ సమ్మిట్ జరుగుతుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. డ్రోన్ల వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే టాప్‌లో ఉండేలా చేస్తానని, దానికి ఈ సమ్మిట్ తొలి అడుగు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమం ఇంత వరకు దేశంలో ఎక్కడా జరగలేదని, ఇదే మొదటిది అని అన్నారు. డ్రోన్స్‌కు భవిష్యత్ ఉందని, డ్రోన్స్ అనేవి ఫ్యూచర్ గేమ్ ఛేంజర్స్‌గా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల సంభవించిన విజయవాడ వరదల సమయంలో డ్రోన్‌ల సేవలు కీలకంగా మారాయన్నారు. వరదల్లో రెస్క్యూ టీమ్‌లు కూడా చేరుకోలేని ప్రాంతాలకు ఈ డ్రోన్ల ద్వారానే బాధితులకు ఆహారం, మెడిసిన్స్, తాగునీరు అందజేశామన్నారు. అంతేకాకుండా శాంతిభద్రతల పరిరక్షణలోనూ ఈ డ్రోన్స్ ఉపయోగపడతాయన్నారు. ఎవరైనా తప్పు చేస్తే డ్రోన్స్ ద్వారా చిత్రీకరించే లైవ్ విజువల్స్ సహాయంతో తక్కువ సమయంలోనే నిందితులను పట్టుకుని శిక్షిస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో డ్రోన్ పైలట్ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ఒక వేదిక అవుతుందన్నారు. మరో 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీ తీసుకువస్తామన్నారు. డ్రోన్ సర్టిఫికేట్ ఏజెన్సీని కూడా ఏపీలో ఏర్పాటు చేస్తామన్నారు. దీని కోసం ఓర్వకల్లులో 300 ఎకరాల భూమిని కేటాయిస్తామన్నారు. డ్రోన్ కంపెనీలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
Next Story