
నారాయణ కాలేజీల్లో 10% సీట్లు పేదలకు ఇస్తారా?
చంద్రబాబుకు అసలు బుర్రా, బుద్ధీ ఉందా అని ప్రశ్నించిన వడ్డే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రెచ్చిపోయారు. ప్రభుత్వ భూములను కోటీశ్వరులకు కట్టబెట్టే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబుకసలు బుర్రా బుద్ధీ ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమరావతిలో భూముల్ని కార్పొరేట్లకు అప్పగించారని, ఇప్పుడు పీపీపీ విధానం అంటూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసే అధికారం.. చంద్రబాబుకు ఎక్కడిది? అని ఇవాళ మీడియా ఎదుట ప్రశ్నలు కురిపించారు.
'నిర్మాణం పూర్తయిన మెడికల్ కళాశాలల్లో పీపీపీ విధానం తీసుకురావడం సరైన విధానం కాదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గం. వైద్య, విద్యా రంగాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తే ప్రైవేటు వాళ్లకే లబ్ది జరుగుతుంది. 1972 నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను. చంద్రబాబు.. కోటేశ్వరులకు ప్రభుత్వ భూములు కట్టబెడుతున్నారు. కోట్ల విలువ చేసే భూములను 95 పైసలకు చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నాడు' అని విమర్శించారు.
"P4 విధానాన్ని చంద్రబాబు విరమించుకోవాలి. 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నడపాలి. UHI మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో పెట్టాలి. అమరావతిలో పెట్టేందుకు వీల్లేదు. టూరిజం పాలసీ ప్రకారం 'లులూ' కంపెనీలకు చంద్రబాబు కట్టబెడుతున్నాడు. 'లులూ' మీద ప్రేమతో ఆర్టీసీ స్ధలాన్ని 99 ఏళ్లకు ప్రైవేటు పరం చేశాడు. చంద్రబాబుకు ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసే అధికారం ఎక్కడుంది?. విజయవాడలో లులూ కంపెనీకి ప్రైవేట్ పరం చేసిన దానిపై సుప్రీంకోర్టులో ఫిల్ వేశాను" అని వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పారు.
చంద్రబాబుకీ, ఆయన మంత్రివర్గ సహచరులకు పీ4 పై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు వాళ్ల సంస్థల్లో పేదలకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం బూడిద కంపెనీలో వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయని చంద్రబాబు అనుకూల పత్రికల్లోనే వార్తలు వస్తున్నాయి. గతంలో నీరు చెట్టు-కార్యక్రమంలో ఉన్న బాకీలు నేటి కూడా చంద్రబాబు చెల్లించలేదు. మంత్రి నారాయణ కళాశాలల్లో 10 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వండి. అప్పుడు పీఫోర్ విధానం అమలు చేయండి. గతంలో 75 ఏళ్లలో 2365 మెడికల్ సీట్లు ఉండేవి. ఇప్పుడు ఎన్ని వస్తాయో ప్రభుత్వం వద్ద లెక్కలు ఉంటే బయట పెట్టాలని సవాల్ చేశారు.
Next Story