విజయవాడ కృష్ణలంకకు చెందిన చిల్లేటి చంద్రశేఖర్ తన కుటుంబంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలనుకున్నారు. దాని కోసం లక్షల్లో వచ్చే జీతాన్ని వదులుకున్నారు. అజిత్‌సింగ్‌నగర్ 19వ లైన్ తోటావారి వీధిలో ఒక డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ఆవులు. గేదెలు కలిపి 50 వరకు సమకూర్చుకున్నారు. డైరీ ఫామ్‌ను డెవలప్ చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. రాత్రింబవళ్లు శ్రమించారు. కాలం కలసి రావడంతో వ్యాపారం వృద్ధిలోకి రావడం మొదలైంది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఇక కష్టాలు తీరుతాయనుకున్నారు. బహుశా చంద్రశేఖర్ ధృఢ సంకల్పం భగవంతుడికీ, ప్రకృతికీ కూడా నచ్చినట్టు లేదు. కనికరం లేకుండా పోయింది. దీంతో తన ఆశలన్నీ గల్లంతయ్యాయి. నలుగురికి ఉపాధి కల్పించాలనే తన ఆశయాలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. తన డైరీ ఫామ్‌నే కాదు.. ఏకంగా తనను కూడా పొట్టన పెట్టుకున్నాయి. తన కుటుంబానికి తీరని శోకం మిగిల్చాయి. విజయవాడలో పోటెత్తిన బుడమేరు వదలు నిలువునా మంచేశాయి.
అసలేం జరిగిందంటే..
చంద్రశేఖర్ తన ఇద్దరు సోదరులతో కలిసి ఏడాదిగా డైరీ ఫామ్‌ను నిర్వహిస్తున్నారు. తమ డైరీ ఫామ్ ఉన్న ప్రాంతానికి బుడమేరు వరద ప్రవాహం వచ్చిందని సెప్టెంబరు 1వ తేదీ ఆదివారం తెల్లవారు జామున తన సోదరుడు శ్యామ్ సుందర్ ఫోన్ చేసి చంద్రశేఖర్‌కు చెప్పాడు. ఒక్కసారిగా కుదుపుకు గురైన చంద్రశేఖర్ తన బైక్ మీద కృష్టలంక నుంచి అజిత్‌సింగ్‌నగర్‌కు చేరుకున్నారు. అప్పటికే ఆ పాంత్రంలోకి బుడమేరు వరద ప్రవాహాం ఉధృతంగా సాగుతోంది. సింగ్‌నగర్ ఫ్లైఓవర్ వద్దకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. తన డైరీఫామ్ వద్దకు చేరుకోవాలంటే అక్కడ నుంచే రావలసి ఉంటుంది. ఈతలో నైపుణ్యం కలిగిన చంద్రశేఖర్ అంత వరద ప్రవాహాన్ని కూడా లెక్క చేయుండా ఈదుకుంటూ తన డైరీ ఫామ్ వద్దకు చేరుకున్నారు. వరద ఉధృతి పెరగడంతో అప్పటికే ఆ ప్రాంతంలో 12 అడుగులకుపైగా వరద ప్రవహిస్తోంది. శ్యామ్‌సుందర్‌తో పాటు మరో సోదరుడిని, తన డైరీ ఫామ్‌లో పని చేసే మరో ఇద్దరు వర్కర్లతో కలిసి ఆవులు, గేదెలను కాపాడుకునే ప్రయత్నం చేపట్టారు. వాటికి కట్టి ఉన్న తాళ్లను తీసేశారు. ఈ క్రమంలో తన సోదరులు, వర్కర్లు వరద ప్రమాదపు అంచున ఉన్నట్లు చంద్రశేఖర్ గమనించారు. తన ఇద్దరు సోదరులు, ఆ ఇద్దరు వర్కర్లు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోవడం చంద్రశేఖర్ గమనించారు. క్షణం ఆలస్యం చేయకుండా వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు రంగంలోకి దిగారు. అనుకున్నట్టుగానే వారిని సురక్షితంగా బయటకు పంపగలిగారు.
నలుగురిని కాపాడిన చంద్రశేఖర్ తనను తాను ఎలా రక్షించుకోవాలని ఆలోచనలు చేశారు. మరో వైపు వరద ఉధృతి పెరుగుతుందో. పశువుల కొట్టం పైకి ఎక్కితే సేవ్ అవుతానని, తర్వాత ఈదుకుంటూ వెళ్లి పోవచ్చని భావించారు. తన శక్తినంతా కూటగట్టుకున్నారు. ఆ పశుల కొట్టంపైకి ఎక్కేందుకు ప్రయత్నం చేశారు. దురదృష్టం వెంటాడింది. తన ప్రయత్నం పట్టు తప్పింది. పట్టు దొరక్క జారిపడిన చంద్రశేఖర్ పక్కనే ఉన్న సిమెంట్ స్థంభాన్ని ఢీకొట్టారు. దెబ్బ బలంగా తగలడంతో తలకు తీవ్ర గాయమైంది. దాని నుంచి తేరుకోలేక పోయారు. దెబ్బను భరించలేక వాలి పోయిన చంద్రశేఖర్ వరద నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయాడు. తర్వాత చంద్రశేఖర్ జాత తెలియకుండా పోయింది. ఇదంతా క్షణాల మీద జరిగి పోయింది. రెండు రోజుల తర్వాత చంద్రశేఖర్ ఆచూకీ తెలిసింది. అప్పటికే ప్రాణాలు పోగొట్టుకున్న చంద్రశేఖర్ తన డైరీ ఫామ్‌కు 500 మీటరల్ల దూరంలో చెట్ల మధ్య శవమై తేలుతూ కనిపించారు.
రెండు రోజుల తర్వాత..
ఈ దుర్ఘటన సెప్టెంబరు 1 ఆదివారం జరిగితే రెండు రోజుల తర్వాత అంటే మంగళవారం ఆచూకీ తెలిసింది. దాదాపు రెండు రోజుల పాటు వరద నీటిలోనే ఉండి పోవడంతో చంద్రశేఖర్ బాడీ బాగా కుళ్లి పోయింది. డెడ్ బాడీని టచ్ చేయడానికి కూడా వీల్లేకుండా పోయింది. ఎక్కడ పట్టుకుంటే అక్కడంతా చర్మంతో పాటు ఊడి వస్తోందని, చివరికి శవాన్ని కూడా ముట్టుకునే అదృష్టం లేకుండా పోయిందని చంద్రశేఖర్ దగ్గరి బందువు చెన్నకేశవరావు కన్నీటి పర్యంతమయ్యారు.
ఉన్నత విద్యావంతుడు
చంద్రశేఖర్ ఉన్నత చదువులు చదివారు. ఎంటెక్ వరకు చదువుకున్నారు. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా కూడా పని చేశారు. లక్షల రూపాయల జీతాన్ని పొందారు. కానీ చంద్రశేఖర్‌కు అది తృప్తినివ్వలేదు. అంతకంటే మంచి పని చేయాలనుకున్నారు. తనతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలని భావించారు. దీనికి కోసం ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకున్నారు. అందులో భాగంగా డైరీ ఫామ్‌ను నెలకొల్పారు. తన ఇద్దరు సోదరులతో పాటు తాను నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.
స్వతహాగా చంద్రశేఖర్ మంచి ఈతగాడు. చిన్న నాటి నుంచి కృష్టా నదిలో ఈతకెళ్లేవారు. గతంలో సంభవించిన కృష్ణా వరదల సమయంలో చాలా కీలకంగా వ్యవహరించారు. కృష్టలంక ప్రాంతంలో సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. వరద బాధితులకు సేవలు అందించారు. అయినా బుడమేరు వరదల్లో తనను తాను రిక్షించుకోలేక పోయారని చెన్నకేశవులు కన్నీటి పర్యంతమయ్యారు.
చంద్రశేఖర్‌కు ఇప్పుడు 32 ఏళ్లు ఉంటాయి. చిన్న వయసులోనే మరణించడంతో ఆ కుటుంబం దు:ఖ సముద్రంలో మునిగి పోయింది. మంచి ఈతగాడయ్యుండి కూడా ప్రాణాలను కాపాడుకోలేక పోయరనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. చంద్రశేఖర్‌కు ఏడాది క్రితం వివాహమైంది. చంద్రశేఖర్‌కు తన భార్య వెన్నుదన్నుగా ఉండేది. ఎంతో సపోర్టు చేసింది. డైరీ ఫామ్ పెట్టడంలో కానీ, దానిని డెవలప్ చేయడంలో కానీ చంద్రశేఖర్‌ను వెన్నుతట్టి ప్రోత్సహించింది. చంద్రశేఖర్ భార్య ఇప్పుడు నిండు చూలాలు. 8 నెలల గర్భిణీ. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఇలాంటి దుర్ఘటన చేసుకుంది. ఈ పరిస్థితుల్లో చంద్రశేఖర్ తమకు దక్కకుండా పోయాడని, కుటుంబానికి తీరని శోకం మిగిలిందని ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధికి చెబుతూ చెన్నకేశవరావు కన్నీళ్లు పెట్టుకోవడం కలచివేసింది. కంట తడి పెట్టించే ఇలాంటి విషాదకర ఘటనను భరించడం ఎవరికైనా కష్టమే. ప్రభుత్వం ఈ బాధిత కుటుంబాన్ని ఏ మేరకు ఆదుకుంటుందో వేచి చూడాలి.