జగన్ బటన్‌లు ఎందుకు పని చేయలేదు?
ఐదేళ్ళపాటు బటన్‍లు నొక్కి, నొక్కి లక్షల కోట్ల ప్రభుత్వ సొమ్మును ధారాళంగా (అప్పనంగా) పంచినా ఉపయోగం లేకుండా పోయింది.
-శ్రావణ్ బాబు, సీనియర్ జర్నలిస్ట్
ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు ప్రజలే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పాలకులు, వివిధ పార్టీల నాయకులు, ఉన్నతాధికారులు, ఆర్థికవేత్తలు, పాత్రికేయులు ఈ ఫలితాలను ఆసక్తిగా చూస్తున్నారు. దీనికి కారణం - దేశంలోనే ఎక్కడా లేని స్థాయిలో ఏపీలో సంక్షేమ పథకాలద్వారా లబ్దిదారులకు డబ్బును పంపిణీ చేసిన ఈ రాష్ట్రంలో సంక్షేమ మంత్రం ఏ మేరకు ఫలిస్తుంది అనే ఆసక్తి ఏర్పడటం.
జగన్ గ్రాండ్ ప్లాన్స్ తల్లకిందులు!
జగన్మోహన్ రెడ్డికి ఏదైనా గ్రాండ్ లెవెల్‌లో చేసే అలవాటు. అందుకే ఆయన తన తండ్రి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసినా తీసుకోలేదు. ఆయన లక్ష్యం పెద్దది. ముఖ్యమంత్రి పీఠానికి తక్కువగా దేనినీ అంగీకరించే తత్వం కాదు. అదే ధోరణిలో, అధికారంలోకి వచ్చిన తర్వాత తను దాదాపు 30 ఏళ్ళపాటు ముఖ్యమంత్రి పదవిలో ఉండి రికార్డ్ సృష్టించాలని జగన్ కలలు కన్నారు. దానికోసం మళ్ళీ గ్రాండ్ ప్లాన్స్ వేశారు. వెల్ఫేర్ స్కీములద్వారా నిరంతరం జనానికి డబ్బు పంచటంద్వారా వారి ఓట్లను బుట్లలో వేసుకోవచ్చని ఒక పథకం వేశారు. పోలింగ్ సమయంలో అభ్యర్థులు ఎన్నికలకు ముందురోజు ఓటర్లకు డబ్బు పంచినట్లుగా, జనానికి పథకాల ద్వారా ప్రభుత్వ పైకాన్ని పంపిణీ చేసి వారి ఓట్లను బుట్టలో వేసుకోవచ్చని పథక రచన చేశాడు. దీనికోసం అనేక స్కీములు రూపొందించాడు. జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ పెన్షన్, వైఎస్ఆర్ కాపు నేస్తం, పేదలకు ఇళ్ళు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, రైతు భరోసా వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టాడు. పదిహేను రోజులకో, నెల రోజులకో ఒకసారి ఏదో ఒక స్కీము పేరుతో బటన్‌లు నొక్కుతూ ప్రభుత్వ పైకాన్ని లబ్దిదారులకు విరజిమ్మాడు.
దురదృష్టవశాత్తూ జగన్ పథకం పారలేదు. తానొకటి తలిస్తే ప్రభువు మరొకటి తలచాడు. ఐదేళ్ళపాటు బటన్‍లు నొక్కి, నొక్కి లక్షల కోట్ల ప్రభుత్వ సొమ్మును ధారాళంగా (అప్పనంగా) పంచినా ఉపయోగం లేకుండా పోయింది. లబ్దిదారులు కూడా అతనికి ఓటు వేయలేదని స్పష్టమయిపోయింది. బాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ రద్దయిపోతాయని సిద్ధం సభలలో జగన్ ఎంత మొత్తుకున్నా లబ్దిదారులు పట్టించుకోలేదు.
లబ్దిదారులు ఎందుకు లాయల్టీ చూపలేదు
జగన్ కేవలం సంక్షేమ పథకాలే ఓట్లు రాలుస్తాయని నమ్ముకున్నారు. అయినా లబ్దిదారులు ఎందుకు లాయల్టీ చూపలేదు? దీనికి కారణం సింపుల్. ఎక్కడెక్కడి నిధులన్నీ(చివరికి తనకు ఖచ్చితంగా ఓటు వేసే ఎస్‌సీలకు చెందిన ఎస్‌సీ సబ్ ప్లాన్ నిధులతో సహా) పథకాలకు మళ్ళించటంతో పరిపాలనలో తీవ్రమైన అసమతౌల్యం ఏర్పడింది. అభివృద్ధి కుంటుపడింది. పథకాలకు డబ్బు మళ్ళింపుతో ఏర్పడిన లోటును పూడ్చటంకోసం విపరీతంగా పన్నులు పెంచేశాడు. మద్యం ధరలైతే ఆకాశాన్ని అంటాయి.
ఒకవైపు పది రూపాయలు చేతిలో పెట్టి, మరోవైపు వందరూపాయలు వెనకనుంచి గుంజుకుంటున్నాడన్న వాదన కిందిస్థాయిదాకా జనంలోకి వెళ్ళిపోయింది. ఏపీ ప్రజలు సహజంగానే చైతన్యవంతులు. అందులోనూ సమాచార విప్లవం రాజ్యమేలుతున్న ప్రస్తుతకాలంలో ఇలాంటి విషయాలు ప్రజల దృష్టికి రాకుండాపోయే అవకాశం లేదు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు జనం డబ్బునే జగన్ పంచుతున్నాడని, జనంపై ప్రేమతో కాదని అనే వాదన బలంగానే వ్యాపించింది. మరోవైపు, పరిపాలనలో అసమతుల్యతను పూడ్చటంకోసం జగన్ కొత్త ప్లాన్ వేసి, లబ్దిదారుల సంఖ్యను వివిధ సాకులతో కుదించటం కూడా లాయల్టీపై ప్రభావం చూపింది. ఇంటిలో రెండు ఫ్యానులు ఉండటం, కరెంట్ బిల్ ఫలానా మొత్తం దాటటం వంటి సాకులను చూపుతూ వాలంటీర్లు లబ్దిదారుల సంఖ్యను కుదించారు. దీనితో అప్పటిదాకా పథకాలను పొందినవారు రివర్స్ అయ్యారు. ఉన్న పథకాలు ఊడబెరకటంతో వారికి కోపం ఉండటం సహజం. వారు జగన్‌పై తమ ఆగ్రహాన్ని లోలోపల దాచుకోకుండా బయటకు ప్రదర్శించటంతో వారి ప్రభావం మరికొందరిపై కూడా సహజంగానే పడుతుంది. అయితే జగన్ పట్ల విశ్వాసపాత్రత అస్సలు లేదని కూడా అనలేము. తప్పకుండా లాయల్ ఓటర్లు ఉన్నారు. కానీ, సమాజంలోని వివిధ వర్గాలు వైసీపీపై ఏర్పరుచుకున్న అసహ్యం చూసి వారు కూడా ప్రభావితం అయిఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
గేమ్ ఛేంజర్‌గా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
లబ్దిదారులు విశ్వాసపాత్రత చూపించకపోవటం కాకుండా జగన్ ఓటమికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని రెండు బలమైన వర్గాలు - కాపులు, ప్రభుత్వోద్యోగులు వైసీపీకి వ్యతిరేకంగా మారటం ఒక ప్రధాన కారణం. జనాభాలో దాదాపు 20-25 శాతం ఉన్న కాపులలో - పోసాని కృష్ణమురళి వంటి వైసీపీ నేతలు మెగా ఫ్యామిలీని అమ్మలక్కల బూతులు తిట్టినందున, జగన్‌పై తీవ్రంగా ఆగ్రహావేశాలు నెలకొని ఉన్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రే పవన్‌ను ప్యాకేజ్ స్టార్, నాలుగు పెళ్ళాలు అంటూ దుర్భాషలాడటంతో వారిలో కసిపెరిగింది. మరోవైపు, జీతాల చెల్లింపులో జాప్యంతోపాటు ఎన్నికలముందు తమకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కటంతో ప్రభుత్వోద్యోగులవంటి మరో పెద్ద వర్గాన్ని జగన్ దూరం చేసుకున్నాడు. ఇక ప్రభుత్వ టీచర్‌లు, ప్రభుత్వ పెన్షనర్‌లు, పోలీసులు, మిడిల్ క్లాస్ ప్రజానీకం, యువత, నిరుద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, సర్పంచ్‌లు వంటి అనేక వర్గాలు కూడా వివిధ కారణాలవలన వైసీపీ ప్రభుత్వంపై విముఖతతో ఉన్నాయి.
ఇక జగన్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడటం, మితిమీరిన అహంభావంతో మంత్రులను, ఎమ్మెల్యేలను కీలుబొమ్మలులాగా ట్రీట్ చేయటం తానే , తనను తాను ఒక ప్రవక్తలాగా బిల్డప్ ఇవ్వటం వంటి కారణాలు కూడా వైసీపీ ఈ స్థాయిలో మట్టికరవటానికి దారితీశాయి. ముఖ్యంగా జగన్ స్వయంగా చంద్రబాబుపై, రఘురామకృష్ణంరాజుపై తన కక్షను తీర్చుకోవటానికి జైలులో పెట్టటం, హింసించటం ఒక తప్పుడు సంకేతాన్ని పంపింది. అధినేతే అలా కక్షపూరిత రాజకీయాలు చేయటంతో కిందిస్థాయి నాయకులు ఊరుకుంటారా! రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యర్థులపై వైసీపీ నాయకుల దాడులతో చెలరేగిపోయారు. ఈ అరాచకం సమాజంలోని అనేకవర్గాలను వైసీపీనుంచి దూరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి దారుణంగా మారటం జగన్ ఓటమికి మరో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. జనం బయటకు రాగానే ఎదుర్కొనే ఈ సమస్య సైలెంట్‌గా చాలా ప్రభావాన్నే చూపింది. ఇక ల్యాండ్ టైటిలింగ్ చట్టం వైసీపీ ప్రభుత్వానికి లాస్ట్ నెయిల్ ఇన్ ది కాఫిన్‌గా మారి జగన్‌ను ఇంటికి పంపింది.
జగన్ చేసిన మంచి పనులు లేవా?
తప్పకుండా జగన్ కొన్ని మంచి పనులు చేశాడు. ముఖ్యంగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా పరిపాలనను మైక్రో లెవెల్‌లో వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టాడు. అయితే వాలంటీర్లుగా సొంత పార్టీ కార్యకర్తలను నియమించటంతో అది విమర్శలకు తావిచ్చింది. ఈ నియామకాలపై సరైన మార్గదర్శకాలు, విధి విధానాలు లేకపోవటంతో కొన్ని అవకతవకలు కూడా చోటుచేసుకున్నాయి.
మరోవైపు, పాఠశాలలలో, ప్రాథమిక వైద్య కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించటం వంటి పనులు కూడా ప్రశంశలు అందుకున్నాయి. అయితే సమస్య ఏమిటంటే, ఈ రెండు విషయాలలో, నిధుల కొరత కారణంగా లక్ష్యాల సాధన పూర్తిగా జరగలేదు. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పటికీ తగినంత స్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవటంతో చాలా పాఠశాలలను హైస్కూల్‌లలో మెర్జ్ చేసేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 400 పాఠశాలల్లో ప్రస్తుతం సింగిల్ టీచర్‌లతో నెట్టుకొస్తున్నారు. మరోవైపు ప్రాథమిక వైద్య కేంద్రాలలో కూడా అలాగే వైద్య సిబ్బంది కొరత నెలకొని ఉంది. నిధులన్నీ సంక్షేమ పథకాలకు మళ్ళించటంతో వేరే అభివృద్ధికి అవకాశమే కలగలేదు.