అమరావతి రైతుల మీద కేసులెందుకు ఎత్తేయలేదు
x

అమరావతి రైతుల మీద కేసులెందుకు ఎత్తేయలేదు

రాజధాని నిర్మాణం కోసం రెండో విడత భూసమీకరణ చేపట్టాలనే ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రంగా వ్యతిరేకించారు.


అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూ సమీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు వక్తలు తీవ్రంగా తప్పబట్టారు. రాజధానిపైన, రాజధాని భూములపైన సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ‘అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక’ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు, రిటైర్డ్ ప్రొఫెసర్ డా. సి. రామచంద్రయ్య, సామాజిక కార్యకర్త వసుంధర, అమరావతి రైతు బుచ్చి తిరుపతిరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్. బాబురావు సహా పలు ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. మొదటి విడత భూములిచ్చన రైతులకే ఇంత వరకు న్యాయం చేయలేదు ఇక రెండో విడత భూములు ఎందుకు అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. అమరావతి భూ సమీకరణపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వరకు భూములు ఇచ్చిన రైతులకు సీఎం చంద్రబాబు ఇప్పటికీ న్యాయం చేయలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ రెండో విడత పేరుతో భూములు తీసుకోవడం సరైందేనా అని చంద్రబాబును నిలదీశారు. అంతేకాకుండా అమరావతి ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసులు ఇప్పటికీ ఎందుకు తీసేయలేదని కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు.

అమరావతి కోసం కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు రూపొందిస్తున్న అసంబద్ధ ప్రణాళికల వల్ల ఎవరికి ఉపయోగం అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో అమరావతిలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న భారీ ప్రాజెక్టులపై కూడా వడ్డే శోభనాద్రీశ్వరరావు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. 24 ప్లాట్‌ఫారమ్‌లతో రైల్వేస్టేషన్ కడతామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. కనీసం రెండు లక్షల జనాభా కూడా లేని ఈ రాజధాని అమరావతి ప్రాంతానికి ఆ స్థాయి స్టేషన్ అవసరమా అని ప్రశ్నల వర్షం కురిపించారు. 5వేల ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, ఇంకా భారీ ప్రాజెక్టులు.. ఇవన్నీ ఎవరి కోసం అని నిలదీశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన న్యాయం చేయాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపైన, కూటమి ప్రభుత్వంపైన ఉందని, అయితే సీఎం చంద్రబాబు చర్యలు చూస్తుంటే అమరావతి అభివృద్ధి పేరుతో భారీగా అప్పులు తెచ్చి వెచ్చిస్తున్నారని, ఇవన్నీ ఎక్కడికి మళ్లించుతున్నారు, ఈ భారమంతా ఎవరు భరించాలని మండిపడ్డారు. ఈ భారీ వ్యయం మీద, తెస్తున్న అప్పుల మీద ఆయన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.

ఐకానిక్ బ్రిడ్జ్‌లు, భారీ ప్రాజెక్టులు… ఇవన్నీ అవసరమా అని ప్రశ్నించారు. అమరావతిలో బ్రిడ్జ్‌లు, అవుటర్ రింగ్ రోడ్ వంటి భారీ ప్రాజెక్టులపై వడ్డే విరుచుకుపడ్డారు. అమరవతిలో ఐకానిక్ బ్రిడ్జ్‌ల పేరుతో హంగామా చేస్తున్నారు. బ్రిడ్జ్‌ల నిర్మాణం అంటే పంటకాలువలపై చెక్క వంతెన కట్టడం లాంటిదేమీ కాదు. జనాభా ఎంత ఉంది… ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశానికి హాజరైన నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా రెండో విడత భూ సమీకరణపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. రాజాధాని పేరుతో అమరవాతిలో ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలపైన, భూసమీకణలపైన, రాజధాని రైతులకు చేస్తున్న అన్యాయంపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More
Next Story