మద్యంలో మిథున్ రెడ్డి ఎందుకు టార్గెట్ అయ్యాడు?
x
YSRCP MP Midhun Reddy

మద్యంలో మిథున్ రెడ్డి ఎందుకు టార్గెట్ అయ్యాడు?

మాజీ ముఖ్యమంత్రితో వైఎస్ జగన్ తో ఎంపీ మిథున్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు. ఆర్థికంగా వైఎస్సార్సీపీని ఆదుకుంటున్నాడు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణం విషయంలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి ఏపీ ప్రభుత్వానికి టార్గెట్ కావడం తీవ్ర చర్చగా మారింది. ఆయనకు కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సిట్ అధికారులు తిరిగి కోర్టును ఆశ్రయించి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మిథున్ రెడ్డి అరెస్ట్, బెయిల్ పై విడుదల, మంగళవారం హైదరాబాద్, బెంగళూరు, ఏపీలోని తన సొంత గృహాల్లో సిట్ పోలీసులు తనిఖీలు చేయడం కూడా చర్చకు దారితీసింది.

జులై 2025లో జరిగిన ఈ అరెస్ట్ గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై ప్రస్తుత టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు చేపట్టిన దర్యాప్తు ఫలితమని చెప్పవచ్చు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా ఉండటమే ప్రభుత్వ టార్గెట్ కు ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఈ కుంభకోణం వెనుక రాజకీయ శత్రుత్వం, అవినీతి ఆరోపణలు, ఆర్థిక లావాదేవీలు ముడిపడి ఉన్నాయనేది విశ్లేషకుల మాట.

వైఎస్ఆర్సీపీ మద్యం విధానమే కుంభకోణానికి మూలం

2019-2024 మధ్య వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానం ఈ కుంభకోణానికి మూలం. ఆటోమేటిక్ ఆర్డర్ ఫర్ సప్లై (ఓఎఫ్ఎస్) వ్యవస్థను మాన్యువల్ ప్రక్రియలతో మార్చడం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్)లో విధేయులను నియమించడం ద్వారా కిక్‌బ్యాక్‌లు సేకరించారని ఆరోపణలు ఉన్నాయి. డిస్టిలరీ యజమానుల నుంచి 12-20 శాతం కిక్‌బ్యాక్‌లు వసూలు చేసి నగదు, బంగారు రూపంలో రూ. 50 నుంచి 60 కోట్లు నెలవారీగా సేకరించారని చార్జిషీట్ వెల్లడిస్తోంది. ఈ నిధులు ఎన్నికల ఖర్చులకు, భూములు, బంగారం, లగ్జరీ ఆస్తుల కొనుగోళ్లకు వినియోగించారని ఆరోపణ. మద్యం నాణ్యత తగ్గించి, ధరలు రెట్టింపు చేయడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు రెట్టింపు, నాణ్యత తక్కువగా ఉండటం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది.

కాన్స్పిరేటర్‌గా మిథున్ రెడ్డి పై ఆరోపణలు

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ని ఈ కుంభకోణ చార్జ్‌షీట్‌లో 'A-4' (కీ కాన్స్పిరేటర్)గా పేర్కొన్నారు. అంటే మాస్టర్‌మైండ్ కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (A-1) నుంచి వచ్చిన కిక్‌బ్యాక్‌లను విజయ్ సాయి రెడ్డి (A-5)తో కలిసి జగన్‌కు చేర్చడంలో ముఖ్య పాత్ర పోషించాడని ఆరోపణ. ఇది అతన్ని కేసులో రెండు లేదా మూడో స్థాయి కాన్స్పిరేటర్‌గా చూపిస్తుంది. కానీ మాస్టర్‌మైండ్ కాదు.

హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో 2019 చివర్లో జరిగిన సమావేశంలో డిస్టిలరీ యజమానులను బెదిరించి కిక్‌బ్యాక్‌లు వసూలు చేశారని వెల్లడైంది. మిథున్ రెడ్డి ఈ లావాదేవీల్లో మధ్యవర్తిగా పనిచేశాడని, రూ. 250-300 కోట్లు ఎన్నికల నిధులుగా మార్చారని చార్జిషీట్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు అతని అంటిసిపేటరీ బెయిల్ పిటిషన్లను తిరస్కరించడం ఆరోపణల తీవ్రతను సూచిస్తోంది.

హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పిన ప్రకారం మిథున్ రెడ్డి అరెస్ట్ 'కాంక్రీట్ ఎవిడెన్స్' ఆధారంగా జరిగింది. ప్రైమా ఫేసీ మెటీరియల్ లేకుండా కోర్టులు రిమాండ్ మంజూరు చేయవని అన్నారు. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి, ఈసీఐఆర్ ఫైల్ చేసింది.

మిథున్ రెడ్డి ఇళ్లలో సిట్ సోదాలు

వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఇళ్లలో ఏపీ సిట్‌ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌, బెంగళూరులోని ఆయన నివాసాల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ప్రశాసన్‌నగర్‌, యూసుఫ్‌గూడ గాయత్రీహిల్స్‌లోని మిథున్‌రెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కొండాపూర్‌లోని ఆయన కార్యాలయంలోనూ తనిఖీలు జరిగాయి. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా సిట్‌ బృందం ఈ సోదాలు చేపట్టింది.

ఒకరితో శత్రుత్వం మరొకరిని టార్గెట్ చేసేలా చేసిందా?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డి సన్నిహితుడిగా, వైఎస్ఆర్‌సీపీలో కీలక స్థానంలో ఉండటమే అతన్ని ప్రధాన లక్ష్యంగా మార్చింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆరోపణలపై ప్రస్తుత ఎన్డీఏ సర్కారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటీ) దర్యాప్తు చేపట్టింది. ఇది రాజకీయ ప్రతీకారం కాదని హోం మంత్రి అనిత చెప్పినప్పటికీ, వైఎస్ఆర్‌సీపీ నేతలు దీనిని 'వెండెట్టా పాలిటిక్స్'గా అభివర్ణిస్తున్నారు.

మిథున్ తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పేర్కొన్న ప్రకారం ఇది ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ చేస్తున్న కుట్ర. జగన్‌తో మిథున్ కు సన్నిహిత సంబంధాలు ఉండటమే ఈ ఆరోపణలకు కారణమని ఆయన అంటున్నారు. గతంలో విమానాశ్రయ మేనేజర్‌పై దాడి ఆరోపణలు కూడా నిరాధారమని నిరూపణ అయినట్టుగా, ఈ కేసు కూడా తప్పుడుదని పెద్దిరెడ్డి వాదిస్తున్నారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ అరెస్ట్ వైఎస్ఆర్‌సీపీని బలహీనపరచడానికి టీడీపీ వ్యూహాత్మక చర్య. జగన్‌ను పరోక్షంగా టార్గెట్ చేయడానికి మిథున్ వంటి సన్నిహితులను ఉపయోగిస్తున్నారని కొందరు అంటున్నారు. చార్జిషీట్‌లో జగన్ పేరు ఆరోపితుడిగా లేకపోయినా, కిక్‌బ్యాక్‌లు ఆయనకు చేరాయని పేర్కొనడం దీనికి సాక్ష్యం. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది.

దర్యాప్తులో పారదర్శకత ఉందా?

ఈ మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ అధికార దుర్వినియోగాన్ని పట్టి చూపించింది. మిథున్ రెడ్డి అరెస్ట్ ఆరోపణల ఆధారంగా జరిగినా, రాజకీయ శత్రుత్వం లేకుండా దర్యాప్తు జరుగుతుందా? లేదా? అనేది ప్రధాన మైన చర్చ. ఇది ఒక్క రాజకీయ నాయకుడి సమస్య కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశం. కోర్టు తీర్పు వచ్చే వరకు ఇది చర్చనీయాంశంగా మిగిలిపోతుంది.

Read More
Next Story