
’అప్పలరాజును ఎందుకు నిర్బంధించారు‘?
అప్పలరాజు విషయంలో పునఃపరిశీలన చేయాలని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌కు బహిరంగ లేఖ రాశారు.
అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శి ఎం. అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా నిర్బంధ చర్యలు తీసుకోవడంపై మాజీ కేంద్ర కార్యదర్శి, ప్రముఖ సామాజిక కార్యకర్త ఈఏఎస్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌కు బహిరంగ లేఖ రాశారు.
లేఖలో శర్మ ఏమని పేర్కొన్నారంటే..
అనకాపల్లి రైతు సంఘం జిల్లా కార్యదర్శి M అప్పలరాజు నిరంతరం, స్థానిక గ్రామ ప్రజల తరఫున కృషి చేస్తూ, వారి ఉద్దేశాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వస్తున్న కార్యకర్త. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా నిర్బంధించింది అని విన్నాను. చాలా బాధాకరమైన విషయం గా భావిస్తున్నాను.
నక్కపల్లి ప్రాంతంలో రసాయన పదార్థాలు ఉత్పత్తి చేస్తూ, చుట్టుపక్కల కాలుష్యం వెదజల్లిన కొన్ని పరిశ్రమల కారణంగా, స్థానిక జలవనరులకు నష్టం కలిగిన సందర్భంగా, స్థానిక ప్రజలు, ఎన్నిసార్లు, అధికారులను కలిసి, ఆ పరిశ్రమల కార్యకలాపాల మీద నియంత్రణ చేయడం అవసరమని విజ్ఞప్తి చేసినా, వారి పట్ల అధికారులు ఉదాసీనత చూపించిన సమయంలో, బాధితులు వారి వ్యతిరేకత తెలియ పరచడం జరిగింది. వారి ఉద్దేశాలతో ఏకీభవించి, వారికి తోడునీడగా, అప్పలరాజు నిలబడడం, ఏ చట్టం క్రింద నిషేధించ బడిందో, ప్రభుత్వం ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉంది.
అదే విధంగా, నక్కపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పరిశ్రమ స్థాపించడానికి స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. పరవాడ ఫార్మాసిటీ, బ్రాండిక్స్, సెజ్ లలో రోజు రోజు జరుగుతున్న ప్రమాదాల గురించి తెలియనివారు లేరు. ఆ ప్రమాదాల్లో ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ప్రమాదం జరిగిన ఒక స్థానిక రసాయన పరిశ్రమ ను కొన్ని నెలల క్రింద దర్శించి, బాధిత కుటుంబాలకు తమ సానుభూతిని తెలియ చేయడాన్ని ప్రజలు హర్షించారు. బల్క్ డ్రగ్స్ పరిశ్రమ కూడా అటువంటి పరిశ్రమే అని ప్రభుత్వం గుర్తించాలి. ఆ పరిశ్రమ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసే వారి మీద చర్యలు తీసుకోవడం, ప్రజాస్వామ్య వ్యవస్థకు హాని కలిగించటం అవుతుందని భావిస్తున్నాను.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP) ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఆ స్టీల్ ప్లాంట్, ఉత్తరాంధ్ర ప్రజల ఉద్యమాల వలన, స్థానిక పార్లమెంట్ సభ్యుల నిరసన వలన వచ్చిన వ్యవస్థ. వేలాదిమంది స్థానిక ప్రజలకు, ముఖ్యంగా SC/ST/OBC కుటుంబాలకు, VSP కారణంగా జీవనోపాధి లభించింది. అటువంటి వ్యవస్థకు ఒక ఖనిజ గనిని కేంద్రం సహాయంతో సమకూర్చి, బలపరచడం బదులు, రాష్ట్ర రాజకీయ నేతలు, అనకాపల్లి లో ఒక ప్రైవేట్ స్టీల్ కంపెనీకి విస్తృతంగా భూములను సమర్పించి, ఆ కంపెనీకి, స్థానిక మత్స్యకారులకు నష్టం కలిగించే ఒక పోర్టును కూడా ప్రసాదించి, ఆ కంపెనీ పట్ల వ్యామోహం చూపించిన సందర్భంగా, స్థానిక ప్రజలు వ్యతిరేకత చూపడం సహజమైన విషయం. ఇటువంటి స్థానిక ప్రజలకు అండదండగా నిలవడం, ఏ చట్టం కింద నిషేధించబడింది?.
ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ఎన్నుకోబడ్డ రాజకీయ నేతలు, ప్రజాస్వామ్య విధానాలను కించపరచడం, శాంతియుతంగా ప్రజా స్వామ్య విధానాలకు అనుగుణంగా వ్యతిరేకత వ్యక్తం చేసే వారి మీద చర్యలు తీసుకోవడం సబబుగా లేదని మీకు, మీ ప్రభుత్వానికి తెలియ చేస్తున్నాను. మీరు విషయాలను దృష్టిలో పెట్టుకుని, అప్పలరాజు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తారని ఆశిస్తున్నాను. అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ను ఈఏఎస్ శర్మ తన లేఖలో కోరారు.
Next Story

