బీహార్ కంటే ఆంధ్రాలో ఓట్లెక్కువ, ఎందుకు?
x

బీహార్ కంటే ఆంధ్రాలో ఓట్లెక్కువ, ఎందుకు?

ఉత్తర ప్రదేశ్, బీహార్ కన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చిన్నవి. ఓటర్ల శాతం చూస్తే మాత్రం ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉంది, ఎందుకిలా?


2029 ఎన్నికల నాటికి ఎంపీ ఎమ్మెల్యే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు చాలా సీట్లను కోల్పోయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నది పలువురు విశ్లేషకుల వాదన. ప్రస్తుత ఓటర్ల శాతం చూస్తుంటే అది నిజమేమోనేమో అనిపిస్తుంది.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్ సభలో కర్నాటకకు చెందిన ఓ కాంగ్రెస్ సభ్యుడు తీవ్రమైన వ్యాఖ్య చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరతాయని చెబుతారు. ఆయన ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందనే విషయాన్ని పట్టించుకోకుండానే అధికార బీజేపీకి చెందిన పలువురు ఆ ఎంపీపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు కొన్ని విషయాలు చూస్తుంటే ఆయనన్న మాట నిజమే కదా అనిపిస్తుంది.

2024 ఎన్నికల్లో ఓట్లేసేవాళ్లు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటే ఉత్తరాది రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నారు. ఆశ్చర్యమనిపించివచ్చు గాని అది నిజమేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓట్ల వివరాలు చెబుతున్నాయి.

ఆంధ్రలో ఓటర్లు 4కోట్ల 10 లక్షలు...

దేశ జనాభా 140 కోట్లు. ఇందులో ఓటర్లు 97 కోట్లు. అంటే సుమారు 69.2 శాతం మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ లో మొత్తం ఓటర్లు 15 కోట్ల 30 లక్షలు. ఆ రాష్ట్ర మొత్తం జనాబా 23.8 కోట్లు. అంటే 64.4 శాతం మంది ఓటర్లుగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 76.5 శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా 5 కోట్ల 30 లక్షల మంది. ఓటర్లు 4 కోట్ల పది లక్షల మంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలలో ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. ఇలా ఎందుకుంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశం. అదే బీహార్ లో ఓటర్ల శాతం మరీ తక్కువ. అక్కడ కేవలం 59.6 శాతం మంది ఓటర్లే ఉన్నారు. ఏపీ కన్నా సుమారు 20 శాతం తక్కవ ఉన్నారు.

మరి కారణాలు ఏమిటంటే...

ఆంధ్రప్రదేశ్ లో సుమారు 76.5 శాతం మంది ప్రజలు ఓటర్లుగా ఉంటే బీహార్ లో ఆ సగటు శాతం తక్కువగా అంటే 60 శాతానికి మించలేదు. ఆయా రాష్ట్రాలలో జనాభా ఎక్కువగా ఉన్నా ఓటర్లు తక్కువగా ఉండడం ఏమిటీ ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, కేరళలో తక్కువగా ఉండడమేమిటీ.. ఓటు హక్కు వయసును బట్టి ఇస్తుంటారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావొచ్చు. దక్షిణాది రాష్ట్రాలు బాగా కుటుంబ నియంత్రణ పాటిస్తాయి. ఫలితంగా సంతానోత్పత్తి తగ్గిపోయింది. పుట్టే వాళ్ల సంఖ్య తక్కువై పెరిగే వాళ్ల సంఖ్య ఎక్కువ కావడంతో ఓటింగ్ పెరిగింది. పెద్దలు అంటే వయోజనులు ఎక్కువ కావడం వల్ల ఓటింగ్ శాతం పెరిగింది. అదే ఉత్తరాది రాష్ట్రాలలో 18 ఏళ్ల లోపు యువత ఎక్కువగా ఉండడంతో అప్పటికే ఓటు ఉన్న వారు తప్ప కొత్తగా ఓటింగ్ పెరగడం లేదు.

సరిగ్గా ఈ విషయాన్నే ఆవేళ పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యుడు లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా కుటుంబ నియంత్రణ, ఆర్థిక పొదుపు పాటించి ఎక్కువ పన్నులు కడుతున్నందుకు దక్షిణాది రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి ఆ రాష్ట్రాల ఆర్ధిక వనరులకే గండి కొడతారా, జీఎస్టీలో వాళ్ల వాటా వాళ్లకు ఇవ్వరా అని ఆ కాంగ్రెస్ సభ్యుడు ప్రశ్నిస్తారు. దీన్ని తప్పుగా భావించి దేశాన్ని చీల్చాలని చూస్తారా అంటూ బీజేపీ వాళ్లు ఆయనపై మండిపడ్డారు. కుటుంబ నియంత్రణ పాటించినందున జనాభా తగ్గి పార్లమెంటు సీట్ల పునర్ వ్యవస్థీకరణలో 2029లో సీట్లు పెరక్కపోగా ఉన్నవి తగ్గేలా ఉన్నాయంటున్నారు.

తెలంగాణలో పరిస్థితి మరింత విస్మయం కలిగిస్తోంది. తెలంగాణలో ఏకంగా 86.3 శాతం మందికి ఓట్లుంటే ఆంధ్రాలో 76. 5 శాతం మందికి, తమిళనాడులో 80.4 శాతం మందికి, కర్నాటకలో 79 శాతం మందికి, కేరళలో 75.6 శాతం మందికి ఓట్లు ఉన్నాయి. అంటే తెలంగాణలో దేశంలోనే ఎక్కువ శాతం ఓట్లున్న రాష్ట్రంగా ఉంది. ఇది గర్వకారణమే అయినా 18 ఏళ్ల లోపు వయసున్న పిల్లల శాతం తగ్గడం ఆందోళన కలిగించే అంశం. తెలంగాణ మొత్తం జనాభా 3.8 కోట్ల మందయితే 3.3 కోట్ల మందికి ఓట్లున్నాయి.


Read More
Next Story