మోదీ మాటలను తెలుగు వాళ్ళు విశ్వసించడం లేదా ?
నరేంద్రమోడి మాటలను జనాలు విశ్వసిస్తున్నారా ? ప్రత్యర్ధులపై మోడిచేస్తున్న ఆరోపణలను జనాలు ముఖ్యంగా తెలుగుప్రజలు పట్టించుకుంటున్నారా ? నమ్ముతున్నారా ?
ప్రధానమంత్రి నోటివెంట ఒక మాట వచ్చిందంటే ఎలాగుండాలి ? జనాలపై తిరుగులేని ప్రభావం చూపించాలి. ప్రధాని చెప్పిన మాటకు మళ్ళీ తిరుగుండకూడదు. అలాగే ఎవరిపైనైనా ప్రధాని ఆరోపణచేశారంటే జనాలంతా దాన్ని నూరుశాతం విశ్వసించాలి. మరి నరేంద్రమోడి మాటలను జనాలు విశ్వసిస్తున్నారా ? ప్రత్యర్ధులపై మోడిచేస్తున్న ఆరోపణలను జనాలు ముఖ్యంగా తెలుగుప్రజలు పట్టించుకుంటున్నారా ? నమ్ముతున్నారా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే తెలుగు ప్రజలు మోడి మాటలను విశ్వసించటంలేదని, ఆరోపణలను పట్టించుకోవటంలేదని అర్ధమైపోతోంది. దీనికి కారణం ఏమిటంటే మోడిని కూడా జనాలు సగటు రాజకీయ నేతగా మాత్రమే చూస్తున్నారు.
దీనికి మూడు ఉదాహరణలున్నాయి. అవేమిటంటే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించినపుడు చంద్రబాబునాయుడుపైన మోడి అనేక ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలాగ వాడుకుంటున్నట్లు అనేక చోట్ల ఆరోపణలు చేశారు. విచిత్రం ఏమిటంటే పోలవరంను చంద్రబాబు ఏటీఎంలాగ వాడుకుంటున్నది నిజమే అయితే మరి మోడి ఎందుకని విచారణ చేయించటంలేదు ? అని జనాల్లో చర్చలు జరిగాయి. ఎందుకంటే పోలవరం జాతీయప్రాజెక్టు పైగా ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం నిధులతోనే జరుగుతోంది. కాబట్టి కేంద్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణ చేయించవచ్చు. అయితే చంద్రబాబు మీద ఆరోపణలకు మాత్రమే మోడి పరిమితమయ్యారుకాని విచారణకు మాత్రం ఇష్టపడలేదు. అందుకనే మోడి ఆరోపణలను జనాలు పట్టించుకోలేదు. ఫలితంగా బీజేపీకి అప్పటి ఎన్నికల్లో నోటాకన్నా తక్కువ ఓట్లొచ్చాయి.
ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణాలో పర్యటించినపుడు కేసీయార్ మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీయార్ కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని పదేపదే ఆరోపించారు. మోడీతో పాటు అమిత్ షా, కేంద్రమంత్రులు కూడా ఇవే ఆరోపణలు చేశారు. నిజంగానే కేసీయార్ కుటుంబం కాళేశ్వరంలో భారీ అవినీతికి పాల్పడుంటే ఒక ఎంపీతో ఫిర్యాదు చేయించి దర్యాప్తుకు ఆదేశించే అవకాశముంది. కాని మోడీ మాత్రం చేతల్లో కాకుండా కేవలం నోటికిమాత్రమే పనిచెబుతున్నారు. అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలను మాత్రమే చేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించారు. అయితే ఏపీ జనాల్లాగే తెలంగాణా జనాలు కూడా మోడి ఆరోపణలను పట్టించుకోకుండా అధికారాన్ని కాంగ్రెస్ కు అప్పగించారు.
ఇపుడు పార్లమెంటు ఎన్నికల్లో మోడి తన ఆరోపణలను రేవంత్ రెడ్డిపైన మొదలుపెట్టారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తు పెద్దఎత్తున నిధులను ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి పంపుతున్నట్లు ఆరోపించారు. జహీరాబాద్ లో జరిగిన బహిరంగసభలో రేవంత్ ప్రభుత్వంపైన అనేక ఆరోపణలు చేశారు. తాను చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే వెంటనే ఏదోరూపంలో ప్రత్యర్ధులపై విచారణ చేయించకుండా మోడి వదిలేరకం కాదని అందరికీ తెలుసు. అలాంటిది ప్రత్యర్ధులపై ఆరోపణలుచేస్తు జనాలను మాయచేసి బీజేపీకి ఓట్లేయించుకోవాలన్న మోడి ప్రయత్నాలను జనాలు పసిగట్టినట్లున్నారు. మరి తొందరలో జరగబోయే ఎన్నికల్లో జనాల తీర్పు ఎలాగుంటుందో చూడాలి.