జగన్ ఇలాకాలో టీడీపీ పాగా వేసేందుకేనా ఈ మహానాడు?
x

జగన్ ఇలాకాలో టీడీపీ పాగా వేసేందుకేనా ఈ మహానాడు?

ఆవేళ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సైకిల్ తిరక్కుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు టీడీపీ అదే వ్యూహాన్ని అనుసరిస్తోందా?


జగన్ ఇలాకాలో టీడీపీ హవా చూపించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. కడపలో మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడును భారీ స్థాయిలో విజయవంతం చేయాలని టీడీపీ నిర్ణయించింది. మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడులో పార్టీ విధివిధానాలను చర్చించడంతో చేయబోయే రాజకీయ తీర్మానం చాలా కీలకమైందిగా భావిస్తున్నారు.
2024 ఎన్నికలకు ముందు పార్టీ అనుసరించిన విధానానికి సత్ఫలితాలు వచ్చిన తర్వాత జరుగుతున్న అతిపెద్ద మహాసభ ఇది. ఈ మహానాడుకు ఇరుగు పొరుగు రాష్ట్రాల పార్టీ నేతలు హాజరవుతున్నారు. సుమారు 23 వేల మంది ప్రతినిధులు పాల్గొనే మహానాడులో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. ఇప్పుడు అందరి దృష్టి చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ పై కేంద్రీకృతమై ఉంది. రాష్ట్రంలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. తొలిసారి ఈ డిమాండ్ కూడా కడప నుంచే వచ్చింది. అటువంటి చోటే మహానాడు జరగబోతోంది.

మహానాడుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నారా లోకేశ్ ను ఢిల్లీకి పిలిపించుకుని మూడు గంటల పాటు గడపడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏమి చర్చించి ఉంటారనేది టాక్ ఆఫ్ ది డేగా ఉంది. బీజేపీ పొత్తును కొన్ని వర్గాలు ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలు హర్షించడం లేదనే వాదనల నేపథ్యంలో కూడా ఈ మహానాడు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
ఈ మహానాడు తర్వాత టీడీపీలో భారీ మార్పులు జరుగుతాయని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీని ఒక పక్క ఎదుర్కొంటూనే మరోపక్క జనసేన పార్టీతో సత్ సంబంధాలు నెరపడం ఎలా అనేది కూడా చర్చించనున్నారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో చోటు లేకుండా చేయాలన్న ప్లాన్ సాగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో సాగిన ఆ వ్యూహంలో ఆనాడు వైసీపీ కొంత మేరకు సక్సెస్ అయినా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అది పారలేదు. ఇప్పుడు అదే తరహా వ్యూహాన్ని టీడీపీ అమలు చేయబోతున్నట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కడప జిల్లాలో టీడీపీకి పట్టు ఉందని నిరూపించుకోవడంతో పాటు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి సుదీర్ఘకాలంగా అండగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించేలా వ్యూహం ఉండనుందని చెబుతున్నారు. అందులో భాగంగానే మహానాడు కనీవినీ ఎరుగనంత భారీ స్థాయిలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
కడప మహానాడును ‘ఇంతకుముందు ఎప్పుడూ జరుగలేదు.. ఇక ముందూ జరగదు’ అన్న రీతిలో నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పకనే చెప్పారు. ‘సమయం తక్కువ ఉన్నా సరే గడువులోపు ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఇంత అద్భుతమైన వేదిక దొరకలేదు. 125 ఎకరాల్లో సువిశాలమైన మైదానం. పార్కింగ్‌కు ఎలాంటి సమస్య ఉండదు. తొలి రెండ్రోజుల్లో ప్రతినిధుల సభ జరుగుతుంది.
23 వేల మందికి ఆహ్వానం పంపించాం. వీరందరికీ అవసరమైన వసతి సిద్ధం చేశాం. పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్‌లో చేయాల్సినవి, సీమలో జరిగిన అభివృద్ధిపై చర్చిస్తాం. మంత్రి లోకేశ్‌ రూపొందించిన ‘మై టీడీపీ’ యాప్‌ను ఆవిష్కరిస్తాం. మహానాడులో లోటుపాట్లు లేకుండా 13 కమిటీలు.. సమన్వయం, వేదిక నిర్వహణ, కో-ఆర్డినేషన్‌ క్యాంపు కమిటీ, రవాణా, పార్కింగ్‌, ఆహారం, వసతి, తొక్కిసలాట లేకుండా పర్యవేక్షణ కమిటీ, రక్తదానం, వలంటీర్‌, రిజిస్ట్రేషన్‌, పారిశుద్ధ్యం, పుష్పాలంకరణ కమిటీలను ఏర్పాటు చేశాం’ అని వివరించారు.
5లక్షల మందితో బలప్రదర్శన
చివరి రోజున 5 లక్షల మందితో కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభ నిర్వహించాలని.. చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని సంకల్పించారు. ఈ మహానాడుకు ఎవరైనా ఇతర పార్టీల నుంచి సౌహార్థ్ర ప్రతినిధులు హాజరవుతారా లేదా అనే దానిపై పార్టీ నేతలు స్పష్టత ఇవ్వలేదు. ర్యాలీకి జనసమీకరణ కోసం అన్ని జిల్లాల నాయకత్వానికి ఆదేశాలు వెళ్లాయి. వందలాది వాహనాలను సమకూర్చుతున్నారు. బహిరంగ సభకు జనసమీకరణపై నాయకులు దృష్టి పెట్టారు. కడప చుట్టుపక్కల జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి ప్రజలను సమీకరించాలని నిర్ణయించారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి 2.10 లక్షల మందిని.. మిగతావాటిలో ఒక్కో నియోజకవర్గం నుంచి 5-10 వేల మందిని తరలించాలని భావిస్తున్నారు.
Read More
Next Story