
శ్రీవారి ఆవులతో రాజకీయ ఆటాడుతున్నారా?
టీటీడీ గోవులపై ఒక్కసారిగా ఇంత ప్రేమ ఎందుకు ముంచుకువచ్చిందీ? ఇదంతా ఆవులపై మమకారంతోనా? రాజకీయ ప్రయోజనంతోనా? అనేది భక్తులకు అర్థం కాకుండా ఉంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గోవుల సంరక్షణ మాటున రాజకీయ క్రీడ నడుస్తోంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గోశాల రాజకీయ చదరంగంలో పావుగా మారింది. దీంతో గో సంరక్షకులు ఎవరో, మూగ జీవాలపై భక్తి ఎవరికి ఉందో అర్థం కాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్వీ గోశాలలో గో మరణాలు ఇప్పుడు జాతీయ సమస్య అయింది. ఇప్పుడు ఏకంగా మాజీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి ఈ వ్యవహారమై కేసు వేస్తానంటున్నారు. పరస్పర ఖండన మండనలతో తిరుపతిలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపణలతో మొదలైన గోవుల మరణాల వ్యవహారం ఇప్పుడు పార్టీల మధ్య గొడవగా మారింది. గోశాలను సందర్శించేందుకు తనకు అనుమతి ఇవ్వడం లేదంటూ వైసీపీ నేత భూమన తిరుపతిలోని తన స్వగృహం ఎదుట బైఠాయించగా గురువారం ఉదయం తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆరణి శ్రీనివాసులు గోశాల వద్దకు వెళ్లారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా గోశాలను సందర్శించారు. అక్కడి నుంచే భూమన కరుణాకర్‌రెడ్డికి వారు ఫోన్ చేశారు. అసత్య ఆరోపణలు చేయడం కాదని, క్షేత్రస్థాయికి రావాలని సవాల్ చేశారు. మరోపక్క టీటీడీ సభ్యుడు భాను ప్రకాశ్‌రెడ్డి వైసీపీ నేత భూమనపై తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
పోలీసులు చెప్పిందేమిటంటే...
ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, కలికిరి మురళీమోహన్ భూమనకు ఫోన్ చేశారు. పోలీసులు సూచనల మేరకు ఐదుగురితో రావాలని ఆయన్ను కోరారు. భూమన కూడా గోశాల వద్దకు వస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. గోశాలకు గుంపులుగా రావద్దని రాజకీయ పార్టీల నేతలకు తిరుపతి పోలీసులు సూచించారు. కూటమి ప్రజాప్రతినిధులు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సవాళ్ల నేపథ్యంలో పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. శాంతిర్యాలీ పేరుతో భారీగా కార్యకర్తలతో కాకుండా గన్‌మెన్‌లతో గోశాలను సందర్శించవచ్చన్నారు.
భూమనను గృహనిర్బంధం చేయలేదు: తిరుపతి ఎస్పీ
గోశాల సందర్శనకు వెళ్లేందుకు భూమనకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. ఆయన్ను గృహనిర్బంధం చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల నేతలు ఒకేసారి వెళ్లకూడదని సూచించామన్నారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందితో భూమన వెళ్లవచ్చని సూచించినట్లు ఎస్పీ తెలిపారు.
తిరుమలను 3 నెలల వ్యవధిలో 3 వివాదాలు చుట్టుముట్టాయి. నెయ్యి వివాదం, తొక్కిసలాట చావుల రగడ ముగియక ముందే గోమేధం చుట్టూ రాజకీయం కమ్ముకుంటోంది. తిరుమల తిరుపతిలోని ఎస్వీ గోశాలలో మూడు నెలల వ్యవధిలో అధికారుల నిర్లక్ష్యంతో వందకి పైగా ఆవులు చనిపోయాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి.
ఈ ఆరోపణలను ఖండిస్తూ ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె.శ్యామలరావు ప్రెస్ మీట్లు పెట్టి కరుణాకర్ రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. టీటీడీలో అన్ని పాపాలకు 2019 నుంచి 2024 ఏప్రిల్ వరకు అధికారంలో ఉన్న వైసీపీ పాలన కారణమని తిప్పికొట్టారు. నిజానిజాలకన్నా ప్రత్యర్థిపై పైచేయి సాధించడం ఎలా అనే దాని చుట్టూతానే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆరోపణలు, వాటికి ఇస్తున్న జవాబులన్నీ రాజకీయంగానే ఉంటున్నాయి. వాస్తవాంశాల జోలికి ఎవరూ వెళ్లినట్టు కనిపించడం లేదు. భూమన చేసింది తప్పుడు ఆరోపణ అయితే ఆ విషయాన్ని శాస్త్రీయ, వాస్తవ ఆధారాలతో నిరూపించి ఎండగట్టడానికి బదులు భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని అనడం- తమను తాము సమర్ధించుకునేందుకు సరిపోతుందే గాని భక్తులకు సంతృప్తికరమైన జవాబులు దొరకడం లేదు.
ఆధ్యాత్మికంగా గోవుకున్న ప్రాధాన్యత దృష్ట్యా టీటీడీ 1956లో శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్ ఏర్పాటైంది. 1956 వరకు పశు సంరక్షణ కేంద్రంగా నడిచింది. ఆ తర్వాత గోశాల, 2004 నుంచి S.V. గోసంరక్షణ శాలగా మారింది. టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పిన ప్రకారం ఈ గోశాలలో ప్రస్తుతం 2,700 వరకు గోవులున్నాయి. స్వామి వారి నైవేద్యం తయారీకి ఈ గోశాల నుంచే పాలు, వెన్న, నెయ్యి వెళుతుంది. ఆధునిక సౌకర్యాలున్న గోశాల ఇది. ఇక్కడున్న పశు సంపదను రక్షించేందుకు 5 వైదులు, ఇతర సిబ్బంది ఉన్నారు. భక్తులు ఈ గోశాలకు గోవుల్ని విరాళంగా కూడా ఇస్తుంటారు.
ప్రతి నెలా 15 ఆవుల మరణం సహజమేనట..
ప్రతి నెలా సగటున 15 ఆవులు వయోభారంతో, వ్యాధులతో చనిపోతాయని ఈవో శ్యామలరావు చెప్పారు. 2024లో 179 గోవులు చనిపోగా 2025 ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో 43 గోవులు మృతి చెందాయన్నారు. చనిపోయిన గోవులు వయోభారం, వ్యాధుల కారణంగా సహజ మరణాలేనని, ఈ ఏడాది ఇప్పటి వరకు 59 లేగ దూడలు జన్మించాయని శ్యామలరావు చెప్పారు. వాస్తవాలు ఇలా వుంటే టిటిడి బోర్డు మాజీ అధ్యక్షులు బి. కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు.
తిరుమల గోశాలలో ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
గోవులు అంటే కేవలం జంతువులు కాదన్న సుబ్రహ్మణ్యస్వామి గోశాలలో ఆవుల మృతి వెనుక కుట్ర ఉండొచ్చునన్న అనుమానాలను వ్యక్తం చేశారు. గోవుల మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి అని విమర్శించారు. టీటీడీ వ్యాపార ధోరణి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. గోశాలలో గోవుల మృతిపై త్వరలోనే తాను కోర్టును ఆశ్రయిస్తానని ఆయన ప్రకటించారు. గోవు అంటే కేవలం జంతువు మాత్రమే కాదని, కోట్లాది మందికి దైవమని అన్నారు. గోశాలలో గోవుల ఆలనాపాలన పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని చెప్పారు.
వయసు మళ్లడం వల్లే గోవులు చనిపోతున్నాయని టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యంగా మాట్లాడుతోందని, వయసు మళ్లారని మీ కుటుంబ సభ్యులను కూడా వదిలేస్తారా? అని స్వామి టీటీడీ ఈవోను ప్రశ్నించారు.
ఇది పక్కా కామెడీ వ్యవహారం- సీపీఐ రామకృష్ణ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కేంద్రంగా తిరుపతిలో పక్కా కామెడీ రాజకీయాలు నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. లడ్డూలు, గోవుల చుట్టూ ఎంతసేపు రాజకీయం తిప్పుతారని ఆయన ప్రశ్నించారు. ఆవులు వయస్సు మీరి, అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం ఆనవాయితీ అని టీటీడీ ఈవో అంటున్నారు. దీనిపై టీటీడీ పూర్వపు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చర్చకు పట్టుపడితే.. కూటమి పార్టీలు స్వీకరించి ఆయన సూచనలు తీసుకుంటే, లేదా అందరూ చర్చించి చర్యలు తీసుకుంటే సరిపోయేదానికి ఇంత రాద్ధాంతం ఎందుకన్నారు రామకృష్ణ. ఆవుల మృతి సంఘటనపై తిరుపతిలో కూటమి పార్టీల నేతలు, వైసీపీ వాళ్లు పరస్పరం ఛాలెంజ్‌లు చేసుకోవడం, రాళ్లు విసురుకుంటూ పక్కా కామెడీగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ పరువును దిగజారుస్తున్నారని దుయ్యబట్టారు.
దేవాదాయ మంత్రి ఏమన్నారంటే...
టీటీడీని అపవిత్రం చేసేందుకు వైసీపీ నాయుకులు కంకణం కట్టుకున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. టీటీడీ అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసి, పాలకవర్గాన్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
‘వైసీపీ నాయకులు తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు, ముక్కోటి ఏకాదశి పర్వదినాల సమయంలో దుష్ప్రచారానికి దిగారు. సరిగ్గా ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణోత్సవం వేళ గోశాలపై అభాండాలు వేశారు. కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై నిందలు మోపడమే పనిగా పెట్టుకున్నారు’ అని ఆనం మండిపడ్డారు.
సీపీఐ నేత నారాయణ ఏమన్నారంటే...
గోశాలను సందర్శించాను, అక్కడ ఎలాంటి సమస్యలూ లేవు, అంతా సజావుగానే ఉంది. గోవుల సహజ మరణాలపై కూడా టీటీడీ, ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారు అని సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్ కె.నారాయణ అన్నారు. ప్రతి విషయాన్నీ వివాదం చేసి రాష్ట్రం పరువు ప్రతిష్టలను దిగజార్చవద్దని నారాయణ హితవు పలికారు.
భక్తుల నమ్మకాన్ని పట్టించుకోవాలా? వద్దా?
భక్తి, బాధ్యత, రాజకీయాలు — ఈ మూడింటి మధ్య టీటీడీ తడబడితే అది కేవలం అధికారులపైన్నే కాక, భక్తుల నమ్మకాన్ని దెబ్బ తీసినట్టవుతుంది. ప్రశ్నించేవారికి సమాధానం కావాలి. అది వాస్తవాలతో ఇమిడి ఉండాలి.
Next Story