కరువు ప్రాంతాలంటే, నిధులకూ కరువే: అయినా రాయలసీమలో నిశబ్దం
x

కరువు ప్రాంతాలంటే, నిధులకూ కరువే: అయినా రాయలసీమలో నిశబ్దం

అయితే, హక్కుల కోసం ఉద్యమించే స్థితిలో రాయలసీమ ప్రజలు, నేతలు ఉన్నారా?

కరువు పీడిత రాయలసీమ ఏమి కోరుతున్నది? నీటి అవసరాలు గుర్తించడం, ఈ సమస్య పరిష్కారానికి ప్రాజెక్టు లను ప్లాన్ చేయడం, వాటి నిర్మాణానికి నిధులు విడుదల చేయడం, ప్రాజక్టులకు నికర జలాల కేటాయించడం, అంతఃరాష్ట్ర నీటి వివాదాలను పరిష్కరించుకోవడం, పరిష్కార మార్గాలు వెదకడం చాలా అవవసరం. అన్నింటికి మించి పాలక ప్రభుత్వ వైఖరి కూడా సానుకూలంగా ఉండాలి. లేదంటే ఉద్యమ కార్యాచరణే మార్గం. ఇపుడు రాయలసీమకు ఇవన్నీ సమస్యలే. అందుకే ఉద్యమం తక్షణాసరం అవుతున్నది. కానీ ఎక్కడ అలికిడి లేదు.


రాయలసీమ ప్రాంతాల్లో కురిసే వర్షం మీదే వ్యవసాయం, జీవన అవసరాల మనుగడ సాధించలేదు . కృష్ణ జలాలు వస్తేనే రాయలసీమ మనుగడ అని అంతా గుర్తించారు. రాయలసీమ ఎగువన, కృష్ణ దిగువన ఉంటుంది . లోయర్ కృష్ణ కు ఎగువలో ఉంటుంది. తప్పనిసరిగా ఎగువ కృష్ణ నుండి ఎగువ పెన్నా నదికి నీరు తరలించాలి.

శ్రీశైలం జలాశయం నుంచి అనంతపురం చిత్తూరులకు నీరు తరలించాలంటే లిఫ్ట్ చేయాలి. భారీ ఖర్చుతో కూడుకున్న పని, గ్రావిటీ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎగువ కృష్ణ ని పెన్నా నది వ్యవస్థ కు అనుసంధానం చేస్తే తప్పని సరిగా రాయలసీమ నీటి సమస్య నుండి బయటపడగలదు. ఇందుకు కర్ణాటక, మహారాష్ట్ర లు అంగీకరించాలి. లేకపోతే మన వాటా నీళ్లు ఈ కాలువకు కేటాయించవచ్చు. కనీసం వరద నీళ్లు తరలించవచ్చు


అంతర్రాష్ట్ర నీటి వివాదాల చట్టం 1956 ప్రకారం ఏర్పాటయిన బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా నీటిలో 75% నీటి లభ్యత ఆధారంగా మొత్తం 2130 టిఎంసిలుగా లెక్కగట్టారు. ఇందులో మహారాష్ట్రకు 585 టిఎంసిలు, కర్ణాటకకు 734 టిఎంసిలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ప్రాజెక్టుల వారీగా 811 టిఎంసిలు కేటాయించారు. రాష్ట్ర విభజనానంతరం తెలంగాణాకు 260.43 టిఎంసిలు, కోస్తాంధ్ర 366.87టియంసిలు, రాయలసీమకు 133.77 టిఎంసిలు ఉన్నాయి. ఇందులో కెసి కెనాల్ ౩౯కు.9 టిఎంసిలు, తుంగభద్ర లో లెవల్ కెనాల్ కు 29.5 టిఎంసిలు, తుంగభద్ర హై లెవెల్ కెనాల్ కు 32.5 టిఎంసిలు, బైరవాని తిప్ప 4.9 టిఎంసిలు, గాజులదిన్నెకు 2.0 టిఎంసిలు, మైనర్ ఇరిగేషన్ కు 13.9 టీఎంసీలు అంటే మొత్తం 122.7 టిఎంసిలు కేటాయించారు. కె.సి కెనాల్ ఆధునీకరణ ద్వారా 11 టిఎంసిలు, పునరుత్పత్తి ద్వారా 8 టిఎంసిలు కలిపి మొత్తం 19 టిఎంసిలు శ్రీశైలం కుడి కాలువ (ఎస్.ఆర్.బి.సి)కి కేటాయించారు.


తుంగభద్ర నుంచి కె.సి కెనాల్ కు రావాల్సిన 10 టిఎంసిలు పెన్నా అహోబిళం (పి.ఏ.బి.ఆర్) కు కేటాయించి అందుకు బదులుగా శ్రీశైలం నుంచి 10 టిఎంసిలు పోతిరెడ్డిపాడు ద్వారా చివరి ఆయకట్టుకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి సర్దుబాటు చేసింది.


చెన్నై తాగునీటి వాటా కింద ఉమ్మడి రాష్ట్ర వాటాగా 5 టిఎంసిలు కేటాయించింది. నిర్మాణంలో ఉన్న గాలేరు- నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజక్టులను విస్మరించారు. అయితే, మిగులు జలాలను వాడుకునే వెసులుబాటును దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు కల్పించింది.

2004లో ఏర్పాటయిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలు కూడా లెక్కగట్టి మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తూ నిర్మాణంలో ఉండి, విభజన చట్టంలో గుర్తించిన రాయలసీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయకుండా ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ చేసింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణలో ఉండగా బచావత్ ట్రిబ్యునల్ తీర్పు విరుద్దంగా కర్ణాటకలో బీజేపీ తిరిగి అధికారాన్ని చెరపట్టాలన్న స్వార్థ రాజకీయం కోసం అనుమతిలేని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది.


బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు యధావిధిగా అమలు చేయాలని, తెలంగాణా ఎన్నికల్లో లబ్ది పొందాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ప్రాజెక్టుల వారీగా చేసిన నీటి కేటాయింపులను పున:సమీక్ష చేసేందుకు వివాదాస్పద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కట్టబెడుతూ రాయలసీమపై మరణ శాసనం చేసింది.


ఒక వైపు కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాలు ఎగువన అనుమతుల్లేని అక్రమ ఎత్తిపోతల పథకాలతో నీటిని తోడేస్తూ తమకు కేటాయించిన నీటిని పూర్తిగా వాడుకున్న తర్వాత దిగువకు విడుదల చేసేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాయి. శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులకు వస్తే కానీ రాయలసీమకు నీటిని తరలించే ముఖద్వారం పోతిరెడ్డిపాడు నీరు అందదు, శ్రీశైలం కనీస నీటిమట్టం 834 అడుగులకు రాకముందే విద్యుత్ అవసరాల పేరుతో అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రభుత్వాలు నీటిని తోడేసుకుపోతున్నాయి.


తుంగ భద్ర హెచ్ఎల్ఎ్స, ఎల్ఎల్సి,కెసి కెనాల్, ఎస్ఆర్బిసికి రావాల్సిన నికర జలాలు కూడా అందడం లేదు. మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులు గాలేరు-నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, వెలిగొండ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పోలవరం పూర్తిస్థాయిలో నిర్మించి కృష్ణా డెల్టా స్థిరీకరించి తద్వారా శ్రీశైలం క్యారీ ఓవర్ నీళ్ళను సీమ ప్రాజెక్టులకు సర్దుబాటు చేసే ఆలోచన కూడా ఆవిరి చేస్తూ పోలవరం సామర్థ్యం తగ్గించే కుట్ర జరుగుతుంది.


నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి, కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు తాగునీరు, కనీసం ఒక్క పంటకు సాగునీరు అందించి ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం నదుల అనుసందానం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ నీటి వివాదాలు జఠిలం చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలను కాలరాస్తుంది. కళ్ళముందే అన్యాయం జరుగుతున్నా నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి.


ఈ నేపద్యంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, పంట కాల్వల పూర్తి చేయడానికి నిధులు, నీటి కేటాయింపులు చేసి, నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం ద్వారా ప్రతి గ్రామానికి త్రాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు సాధన కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపుదిద్దెందుకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా ప్రజలు ప్రాజెక్టుల సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేయాలి. చేసే స్థితిలో ఉన్నారా?


Read More
Next Story