ఇందుకేనా  ఉస్మానియా బిస్కెట్ అంత పాపులరైంది
x

ఇందుకేనా ఉస్మానియా బిస్కెట్ అంత పాపులరైంది

నోట్లో పెట్టుకుని పంటితో కొంచెం కొరకి నాలుకమీద పెట్టుకోగానే వెంటనే కరిగిపోతుంది. కొంచెం ఉప్పుగా కొంచెం తియ్యగా ఉంటుంది. అదే ఉస్మానియా బిస్కట్.


నోట్లో పెట్టుకుని పంటితో కొంచెం కొరకి నాలుకమీద పెట్టుకోగానే వెంటనే కరిగిపోతుంది. కొంచెం ఉప్పుగా కొంచెం తియ్యగా ఉంటుంది. అదే ఉస్మానియా బిస్కట్. అవును బిస్కెట్ కొరకగానే కాస్త ఉప్పగా మరికొంచెం తియ్యగా ఉండటమే ఉస్మానియా బిస్కెట్ స్పెషాలిటి. గుల్లగా (క్రిస్పీ) ఉంటుంది కాబట్టే జనాలందరు ఈ బిస్కట్ తినటానికి ఇంతగా ఇష్టపడుతున్నారు. రోజుకు కొన్ని లక్షల బిస్కట్లను తినేస్తున్నారంటేనే ఈ బిస్కెట్ ను జనాలు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్ధమైపోతుంది.

ఉస్మానియా బిస్కెట్ అంటే హైదరాబాద్ లో తెలీని వాళ్ళుండరు. అలాగే బిస్కెట్ గురించి విననివాళ్ళు తెలంగాణాలో ఉండకపోవచ్చు. ఉస్మానియా బిస్కెట్ పేరుతోనే కొన్ని వందల బేకరీలు బిస్కెట్లను తయారుచేస్తున్నారంటేనే బిస్కెట్ కున్న క్రేజ్ అర్ధమైపోతోంది. ఏ నలుగురు ఇరానీ చాయ్ దుకాణం దగ్గర లేదా టీ బంకుల దగ్గర గుమిగూడినా చాయ్ తో పాటు ఉస్మానియా బిస్కెట్ ఉండితీరాల్సిందే. జనాలు ఇంతగా ఇష్టపడుతున్న ఈ బిస్కెట్లు అసలు ఎప్పుడు తయారైంది ? ఎవరికోసం తయారైందన్నది కాస్త ఇంట్రెస్టింగ స్టోరీయే. ఈ బిస్కెట్లకు చాలా పెద్ద చరిత్రే ఉంది. అదేమిటంటే నిజాం ప్రభువుల్లో చివరి, ఏడవ నిజామైన మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ హయాంలోనే బిస్కెట్ల తయారీ మొదలైంది. అందుకనే దీనికి ఉస్మాన్ బిస్కెట్లనే పేరు స్ధిరపడిపోయింది. ఇంతకీ నిజాం ఏమిటి బిస్కెట్ల తయారీని మొదలుపెట్టడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా ? నిజానికి బిస్కెట్లను తాను తినటానికి నిజాం తయారీ మొదలుపెట్టించలేదు.

అప్పట్లో అంటే 1940 ప్రాంతంలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్ మాత్రమే ఇచ్చేవారు. రోగులు తొందరగా కోలుకోవాలని డాక్టర్లు పాలు, బ్రెడ్ మాత్రమే అందించేవారు. అయితే ప్రతిరోజు బ్రెడ్డునే తింటుంటే ఎవరికైనా మొహం మొత్తుతుంది. అలాంటిది రోగులగురించి చెప్పేదేముంది. ఒకసారి ఆసుపత్రిని సందర్శించిన నిజాం రోగులు పాలు, బ్రెడ్ తీసుకోవటాన్ని చూశారు. ప్రతిరోజు పాలు, బ్రెడ్ ను మాత్రమే రోగులకు ఇస్తున్నట్లు తెలుసుకున్నారు. అప్పుడే బ్రెడ్ స్ధానంలో రోగులకు ఇంకేదైనా బలవర్ధకమైన ఆహారాన్ని ఇస్తే బాగుంటుందని అనిపించింది. అనిపించటమే ఆలస్యం తన కోటలోకి వెళ్ళి వైద్యులతో మాట్లాడారట. అప్పుడే ఈ బిస్కెట్ ఇవ్వటంపై చర్చ జరిగిందట. అప్పటికప్పుడే వంటవాళ్ళని పిలిపించి బిస్కెట్ల తయారీపై చర్చించారట. వంటవాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేకంగా ఒక బేకరీ ఏర్పాటుచేసి బిస్కెట్ల తయారీని నిజాం మొదలుపెట్టించారు.

మొదట్లో నిజాం కోటలోనే బిస్కెట్ల తయారీ మాదలైనా తర్వాత ప్రత్యేకంగా అబీడ్స్ లో ఒక బేకరీని ఏర్పాటుచేశారట. అక్కడినుండే జనరల్ ఆసుపత్రిలో రోగులకు ప్రతిరోజు బిస్కెట్లు వెళ్ళేవి. ఉప్పగా, తియ్యగా, గుల్లగా, కొరకంగానే నాలుకమీద నుండి గొంతులోకి జారిపోయే బిస్కెట్లు రోగులకు తెగనచ్చేసింది. ఈ బిస్కెట్లను కేవలం రోగులకు మాత్రమే అందించేవారు. అయితే తమకోసం ఆసుపత్రికి వచ్చే కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులకు కూడా రోగులు బిస్కెట్లను ఇచ్చేవారు. కొద్దిరోజుల్లోనే బిస్కెట్లరుచి గురించి ఆ నోటా ఈ నోటా నగరమంతా పాకిపోయింది. దాంతో కొంతకాలానికి ఉస్మానియా బిస్కెట్ల పేరుతో కొన్ని బేకరీలు ప్రత్యేకంగా ఏర్పాటయ్యాయి. అంటే కొద్దికాలంలోనే ఉస్మానియా బిస్కెట్లు జనాల్లోకి బాగా చొచ్చుకుపోయాయి.

బిస్కెట్ల తయారీని నిజాం ప్రభువు ఉస్మానియా మీర్ ఆలీఖాన్ మొదలుపెట్టారు కాబట్టి బిస్కెట్లు కూడా ఉస్మానియా బిస్కెట్ల పేరుతోనే బాగా పాపులరైపోయింది. ఎప్పుడైతే ఉస్మానియా బిస్కెట్లు బాగా పాపులరైపోయాయో ఇరానీ చాయ్ అందించే దుకాణాలు బేకరీల నుండి ఈ బిస్కెట్లను కొనుగోలు చేసి జనాలకు మరింత దగ్గరచేశాయి. ఉస్మానియా బిస్కెట్ల పేరుతో నగరంలో కొన్ని వందల బేకరీలు తయారుచేస్తున్నా నాంపల్లిలోని సుభాన్ బేకరీయే ఒరిజినల్ ఉస్మానియా బిస్కెట్లు దొరికేచోటుగా పాపులరైంది. మైదా, వెన్న, ఉప్పు, పంచదార తదితరాల మిశ్రమాన్ని కలిపి బిస్కట్లను తయారుచేస్తున్నారు.

ఇదే విషయమై తెలంగాణా ఫెడరల్ తో చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ముని మనవడు(గ్రేట్ గ్రాండ్ సన్) నవాబ్ మీర్ నజఫ్ ఆలీఖాన్ మాట్లాడుతు తనకు నాలుగేళ్ళ వయసున్నపుడు నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ బిస్కెట్ల తయారీని ప్రారంభించారని చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రిలోని రోగులు తొందరగా కోలుకోవాలని బిస్కెట్ల తయారీని మొదలుపెట్టినట్లు తెలిపారు. మొదట్లో రోగులకు మాత్రమే బిస్కెట్లు ఇచ్చినా తర్వాత రోగుల కోసం వచ్చేవారు కూడా తినటంతో బిస్కెట్లు చాలా పాపులరైనట్లు చెప్పారు. తాను విదేశాలకు వెళ్ళేటపుడు రెగ్యులర్ గా ఈ బిస్కెట్లను తీసుకెళ్ళి అక్కడి ప్రముఖులకు గిఫ్ట్ గా ఇస్తానన్నారు. ఢిల్లీలోని 17 దేశాల రాయబారులకు తాను చాలాసార్లు ఉస్మానియా బిస్కెట్లను బహుమతులుగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. నగరంలో వందలాది బేకరీలు ఈ బిస్కెట్లను తయారుచేస్తున్నాయని అయితే అవన్నీ నిజమైన ఉస్మానియా బిస్కెట్లు కావని చెప్పారు.

నాంపల్లిలోని సుభాన్ బేకరీ ఓనర్ సయ్యద్ ఇర్ఫాన్ మాట్లాడుతు నిజాం గ్రేట్ గ్రాండ్ సన్ తమ బేకరీలోనే ఉస్మానియా బిస్కెట్లను కొంటారని చెప్పారు. అమెరికా, కెనడ, బ్రిటన్, గల్ఫ్ దేశాలకు తాము బిస్కెట్లను ఎగుమతిచేస్తున్నట్లు చెప్పారు. తమ తాతలు ఏర్పాటుచేసిన ఈ బేకరీని కాలానుగుణంగా కాస్త ఆధునీకరించినట్లు చెప్పారు. మైదా, పంచదార, ఉప్పు, వెన్న లాంటి పదార్ధాల మిశ్రమంతో బిస్కెట్లను తయారుచేస్తున్నామన్నారు. బిస్కెట్ల తయారీలో వాడే పదార్ధాల వివరాలను చెప్పటానికి నిరాకరించారు. ఒకే బిస్కెట్లో తీపి, ఉప్పదనం కలిసుండటమే ఉస్మానియా బిస్కెట్ల ప్రత్యేకతగా ఇర్ఫాన్ చెప్పారు.

Read More
Next Story