DOLLAR DREAM | కరుగుతున్న డాలర్ కల, పార్ట్ టైం ఉద్యోగాలకు ఎసరు!
1980ల నాటి డాట్ బస్టర్స్ ఉద్యమం తిరిగి మొదలవుతుందా? ట్రంప్ 'మాగా' బృందం ఇండియన్లను ఎందుకు వ్యతిరేకిస్తోందీ, అమెరికా కల ఆవిరుతున్నట్టేనా?
అమెరికాలో భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ (DOLLAR DREAM) కరిగిపోతున్నాయి. అమెరికాలో చదువుకోవాలని, డబ్బు సంపాదించాలని అనుకునే విద్యార్థుల కలలపై కొత్తగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. 2023-2024 విద్యాసంవత్సరంలో భారతీయ విద్యార్థులకు ఇచ్చిన ఎఫ్-1 వీసాలలో ఇప్పటికే కోత పడింది. 2022తో పోల్చుకుంటే సుమారు 80 వేల వీసాలు తగ్గాయి. ఇప్పుడు తాజాగా అమెరికాలో పని అనుభవాన్ని పొందడానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రాంపైనా, ఆ తర్వాత అక్కడే ఉండి ఉద్యోగాల్ని చేసుకునేందుకు వృత్తిపరమైన హెచ్-1బీ వీసాలపైనా వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఈ కార్యక్రమంపై ట్రంప్ అనుచరులైన స్థానికులు ప్రారంభించిన -మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)- ఉద్యమం ఊపందుకుంది. మాగా ఉద్యమకారులు భారతీయులకు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఓపీటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
భారతీయుల విజయాన్ని అమెరికాలోని కొందరు తెల్ల జాతీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. భారతీయుల తెలివైన చర్యల్ని సహించలేకపోతున్నారు.
1958లో కేవలం 12,000 మంది భారతీయులు మాత్రమే ఉన్నప్పుడు లోకల్ అమెరికన్లకు ఇండియన్స్ విచిత్రంగా కనిపించేవారు. ఇప్పుడు భారతీయులు అమెరికాలో ప్రాముఖ్యత సంపాదించుకున్నారు. అమెరికా జనాభా సుమారు 33 కోట్లనుకుంటే వారిలో 1.5% శాతం మంది భారతీయులు. అయినప్పటికీ వారు పెద్ద పెద్ద కంపెనీలకు CEOలు, శాస్త్రవేత్తలు, అంతరిక్ష యాత్రికులు, ఒపీనియన్ మేకర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఎదుగుతున్నారు. అత్యధిక సగటు ఆదాయాన్ని సంపాయించే జాతుల్లో మొదటి వరుసలో ఉన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ తర్వాత ఉపాధ్యక్షునిగా ఎన్నికైన జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి తొలి హిందూ రెండవ మహిళ. చిత్రమేమిటంటే ఇప్పుడు ట్రంప్ బృందం ప్రారంభించిన మాగా ఉద్యమకారుల్లో ఈ భార్యాభర్తలూ ఉన్నారు. అయినా ట్రంప్ MAGA బృందానికి నాయకత్వం వహిస్తున్న తెల్ల జాతీయవాదులకు మింగుడు పడడం లేదు.
ఇందుకు నిదర్శనమే ట్రంప్‌కు గట్టిగా మద్దతిచ్చే లారా లూమర్ చేసిన ట్వీట్. "వర్ధమాన దేశమైన భారత్ నుంచి దాడి జరుగుతోంది" అంటూ లారా ట్వీట్ చేయడం, దానికి పలువురు హర్షం వ్యక్తం చేయడం అమెరికాలోని శ్వేతజాతీయుల విపరీత మనస్తత్వాన్ని చూసిస్తోంది. నిజానికి అమెరికా వలసల దేశం. అటువంటి చోట ఈ తరహా సంకుచిత ఆందోళనలు మొదలు కావడం, దానికి పాలకులు మద్దతు ఇవ్వడం, తరచూ ఇండియన్ అమెరికన్లపైనా, భారతీయ విద్యార్థులపైనా దాడులు జరగడం మామూలైంది. కొత్త సంవత్సరం రాక సందర్భంగానూ మాగా ఉద్యమకారుల కార్యచరణ చర్చనీయాంశమైంది.
మరోపక్క, ట్రంప్, ఎలన్ మస్క్ లాంటి వారు నైపుణ్య వలసలు (quality immigration) అంటూ సరికొత్త నినాదాన్ని తలకెత్తుకున్నారు. ప్రతిభావంతులైన ప్రోగ్రామర్లు, ఇతర వైట్ కాలర్ ఉద్యోగులకు అనుమతించే H1-B వీసాలకు మద్దతు తెలిపారు. మస్క్ H1-Bని "ఇంజనీరింగ్ ప్రతిభలో టాప్ 0.1%"ను ఆకర్షించడానికి ఉపయోగపడే పాయింట్‌గా అభివర్ణించారు. దానిని రక్షించేందుకు తాను "యుద్ధానికి సిద్ధం" అని హెచ్చరించారు.
ఈ ప్రభావం భారతీయ విద్యార్థులపై ఎక్కువగా పడనుంది. అధికారంలోకి వస్తే హెచ్-1బీ వీసాల జారీ విధానాన్ని సంస్కరిస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాగా నేటివిస్టులు- ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) దృష్టి సారించారు. ఎఫ్-1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు మామూలుగా వారి మొదటి విద్యా సంవత్సరం పూర్తి తర్వాత ఓపీటీలో పాల్గొనవచ్చు. చదువు పూర్తి అయిన తర్వాత స్టెమ్ (ఎస్‌టీఈఎం) గ్రాడ్యుయేట్లు మూడేళ్ల వరకూ అమెరికాలో ఉండి పని అనుభవం పొందే అవకాశం ఉంది.
తొలుత స్వల్పకాలిక వర్క్ పర్మిట్ కోసం ఉద్దేశించిన ఈ ఓపీటీ ఇప్పుడు పూర్తిగా దుర్వినియోగమవుతోందని, అమెరికాలో ఉద్యోగంతో పాటు హెచ్-1బీ వీసా పొందడానికి ఇదొక సాధనంగా మారిపోయిందని మాగా నేటివిస్టులు ఆరోపిస్తున్నారు. పని అనుభవం కోసం ఓపీటీలో చేరడానికి చాలామంది విదేశీ విద్యార్థులు ప్రత్యేకించి భారత్ నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు అమెరికాలో చదవడానికి వస్తుంటారు. ఓపీటీలో ఉన్నప్పుడే కొందరు విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ తమ అవసరాలకు సరిపడా డబ్బు సంపాయించుకుంటుంటారు. అదిప్పుడు లోకల్స్ కి నచ్చడం లేదు. తమకున్న నాన్ స్కిల్డ్ ఉద్యోగాలను కూడా భారతీయులే చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఓపీటీ కే ఎసరు పెడితే ఆ తర్వాత హెచ్-1బీ వీసాల వరకు పోయే అవకాశం ఉండదని మాగా ఉద్యమకారులు భావిస్తున్నారు. అత్యంత నైపుణ్యం ఉన్న వాళ్లను మాత్రమే ఇచ్చే హెచ్-1బీ వీసాలు దక్కాంటే ఆయా దేశాల్లోని కంపెనీలే వాళ్ల ఉద్యోగులకు మంచి ట్రైనింగ్ ఇచ్చి అమెరికాకు పంపుతాయి తప్ప అక్కడే నైపుణ్యం సంపాయించి హెచ్-1బీ వీసాల దాకా పోయే అవకాశం ఉండదు. అందుకే ట్రంప్, ఎలాన్ మస్క్ లాంటి వాళ్లు చాలా తెలివిగా క్వాలిటీ ఇమిగ్రేషన్ కి మద్దతు ఇస్తున్నారన్న విమర్శలూ వినవస్తున్నాయి.
ఓపీటీ ప్రోగ్రాం వ్యవధి ముగిసేలోగా హెచ్-1బీ వీసా దక్కితే అమెరికాలో 3 నుంచి 9 ఏళ్ల వరకూ ఉండే అవకాశం ఉంటుంది. అలా హెచ్-1బీ వీసాలు పొందిన వారిలో కొందరు గ్రీన్ కార్డులు పొంది చివరకు అమెరికా పౌరులుగా మారుతున్నారు. అయితే ఇవేవీ చట్టవిరుద్ధమైనవి కావు. అమెరికా చట్టాల ప్రకారమే ఉంటాయి. అయినా సరే భారతీయులపై మాగా నేటివిస్టులు అక్కసు వెళ్లగక్కుతున్నారు.
కాంగ్రెషనల్ రిసెర్చ్ సర్వీస్ (సీఆర్‌ఎస్) నివేదిక ప్రకారం 2023లో అమెరికాలో 14,90,000 మంది ఎఫ్-1, ఎం-1 వీసాలు కలిగిన విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో 3,44,686 (23 శాతం మంది) ఓపీటీ ద్వారా పనిచేయడానికి అనుమతి పొందారు. ఈ కారణంగా అమెరికన్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని మాగా నేటివిస్టులు మండిపడుతున్నారు. ఓపీటీని రద్దు చేస్తే గ్రాడ్యుయేషన్ తర్వాత విదేశీ విద్యార్థులు పని అనుభవం పొందకుండానే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా ప్రతి ఏటా 85,000 హెచ్-1బీ వీసాలు మాత్రమే ఇస్తుంది. దీనివల్ల అమెరికా జనాభాలో గణనీయమైన మార్పేమీ ఉండదు. ఈ వాదనతో మాగా నేటివిస్టులు అంగీకరించడం లేదు. భారతీయుల వల్లనే తమకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని వాదిస్తున్నారు. భారత్ లోని కొన్ని కంపెనీలు, సంస్థలు హెచ్-1బీ వీసాలు ఇప్పిస్తామంటూ కొందర్ని ప్రేరేపిస్తున్నాయి. ఇండియాలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (GCC) పెరుగుదలే ఇందుకు నిదర్శనం. USలో H1-B వీసాల కోసం దరఖాస్తులు పెరగడానికీ, ఉపాధి అవకాశాలు తరగడానికి సంబంధం ఉండదు. హెచ్-1బీ వీసాలపై పరిమితులు ఉంటాయి. వీటి కోసం అప్లికేషన్లు పెట్టేవాళ్లందరూ భారతీయులే కాదు. ఒక్కో దేశానికి ఒక్కో కోటా ఉంది. దాని ప్రకారమే ఇస్తుంటారు. ఈ విషయాన్ని లూమర్, ఆమె అనుచరులకు వివరించడం కష్టమే. వారు "విదేశీ మూలం" ఉన్న వారందరూ వెళ్లిపోవాలని కోరుకుంటున్నారు.
ఈ తరహా ఉద్యమకారులు తెలుసుకోవాల్సిందేమిటంటే.. స్థానిక అమెరికన్లు సరిగ్గా విజయవంతం కాకపోతే దేశంలో కల్లోలం బయలుదేరుతుంది. ఒకజాతిని మరోజాతి ద్వేషించుకుంటుంది. వ్యతిరేక భావనలు మరింత ఎక్కువ అవుతాయని చరిత్ర చెబుతోంది.
1980లలో, "డాట్ బస్టర్స్" అనే విద్వేష గుంపొకటి న్యూ జెర్సీ సిటీలోని ఇండియన్లపై దాడి చేసింది.'డాట్' అంటే హిందూ మహిళలు పెట్టుకునే బొట్టు. దీన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆ దౌర్జన్య, హింసాకాండలో ఇద్దరు ముగ్గురు ఇండియన్లు చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. అప్పటి జెర్సీ సిటీ మేయర్ ఆంథోని ఆర్ కూచ్చి మాటల్లో "అత్యంత కష్టపడి" సంపాదించిన భారతీయుల సంపదే ఆ దాడులకు కారణం.
ఈ పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం తక్షణం స్పందించాలి. మాగా ఉద్యమకారుల వాదనను కొట్టిపడేయడమో లేక భారతీయ వ్యతిరేక భావనగానో చూసి ప్రతికార చర్యలకు దిగకుండా అక్రమ వలసల్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి. 2022నాటి లెక్కల ప్రకారం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారిలో భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. అందువల్ల 'డంకీ రూట్ల' అమెరికాలో ప్రవేశించే అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం తగదు. ట్రంప్ పాలకవర్గంతో లాబీయింగ్ చేయడం ద్వారా కేంద్రప్రభుత్వం MAGA భావజాలాన్ని ఎదుర్కోవాలి. అప్పుడు మాత్రమే భారతీయుల పట్ల మాగా ఆందోళనకారుల్లో వ్యతిరేక భావనను తగ్గుతుంది.
Next Story