ముప్పై ఏళ్ల ‘దండోరా’ పార్టీ రూపం తీసుకుంటే...?
x

ముప్పై ఏళ్ల ‘దండోరా’ పార్టీ రూపం తీసుకుంటే...?

మాదిగలకు ‘జాతి’ పట్ల ఉన్న భావోద్వేగపు అనుబంధాన్ని నిరర్ధకమైన శక్తిగా వృధా చేయడం కాకుండా, తమ రాజకీయ ఉనికిని ప్రదర్శించే ఇంధనంగా వాడుకోవచ్చు.



వర్గీకరణను ఆమోదిస్తూ 1 ఆగస్టున సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నవారు కూడా మంద కృష్ణ మాదిగ వర్గీకరణ అంశంతో ’24 ఎన్నికల ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దగ్గర కావడాన్ని అంగీకరించడం లేదు. ఆ విషయంలో వారు భిన్నఅభిప్రాయాలతో ఉన్నారు. నిజానికి బిజెపి 2019 ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్ లో కూడా ఇలాగే 23 శాతం మంది వున్న ‘ఎస్సీ’ల మీద కన్నేసి, వారిలో మరీ వెనుకబడిన ఉపకులాలను కొన్నిటిని చాకచక్యంగా తన వైపు ఆకట్టుకుంది.

మనవద్ద కూడా ‘ఎం.ఆర్.పి.ఎస్.’ అధ్యక్షుడు కృష్ణ మాదిగ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది కూడా ఏ ఒక్కరోజు పరిణామమో కాదు. ఎం. వెంకయ్యనాయుడు కృష్ణతోగానీ, లేదా కృష్ణ – నాయుడుతో గానీ 2019 ఎన్నికల ముందు నుంచి సామరస్య పూర్వకంగా ఉండడం, ప్రధాన మీడియా సంగతి ఏమోగానీ, ఆ విషయం ‘సోషల్ మీడియా’కు అయితే తెలుసు! అది, ఈ ఏడాది ఎన్నికల ముందు ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడానికి దారితీసి ఉండవచ్చు.

ఇదే కాలంలో వర్గీకరణ విషయంపై ఎస్సీలలో ఎవరివైపూ నోరువిప్పని కొప్పుల రాజు వంటి మాల రిటైర్డ్ ఐ.ఏ.ఎస్., అధికారి కాంగ్రెస్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ కావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మంద కృష్ణ మాదిగకు బిజెపి వైపు చూడడం తప్ప మరో మార్గం లేకపోయి వుండవచ్చు. అయినా గతంలో కొన్నిసార్లు ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి కృష్ణ తన రాజకీయ ఆకాంక్షను వ్యక్తం చేసినా, ఏ ప్రధాన రాజకీయ పార్టీల్లోనూ చేరిన చరిత్ర లేదు. ఇక ఆయన స్వంత రాజకీయాలకు ‘దండోరా’ ఉద్యమానికి సంబంధం ఉందని ‘ఎం.ఆర్.పి.ఎస్’. సభ్యులు కూడా అనుకోవడం లేదు.

మూడు దశాబ్దాల పాటు సాగిన ‘దండోరా’ ప్రయాణంలో పదేళ్ళ క్రితం మన రాష్ట్రం రెండుగా విభజించబడింది. అంటే, ఒక రాజకీయ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ‘మ్యాప్’ పైన విభజన గీత గీయబడింది. దాంతో ఈ గీత లోపల వున్న ప్రజలు రెండుగా వేరయ్యారు. ఈ వర్గీకరణ వివాదంలోని కులాల వారికి ఇప్పుడు ‘తెలంగాణ’ – ‘ఆంధ్రప్రదేశ్’ అనే రెండు భిన్నమైన నైసర్గిక గుర్తింపులు ఏర్పడ్డాయి. అంటే ఇందులో- ‘ప్రజలు’ ‘ప్రాంతము’ ‘కులము’ కాకుండా ‘రాజకీయము’ అనే అంశం కూడా కలిసి, మొత్తం నాలుగు వేర్వేరు అంశాలు ఇందులో ఇప్పుడు కనిపిస్తున్నాయి.

వీటిలో మొదటి రెండు ‘ప్రజలు’ ‘ప్రాంతము’ కంటికి కనిపించేవి, మిగతా రెండు ‘కులము’ ‘రాజకీయము’ కంటికి కనిపించనివి. అంటే, 1994లో ఒక ఆలోచనగా మొదలయిన ‘దండోరా’ ఉద్యమం, కాలక్రమంలో కంటికి ‘కనిపించే’ మరో రెండింటిని తనతో కలుపుకుని, ముప్పై ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ సజీవంగా ఉంది. ఒక ‘ఆలోచన’కు ఇంతటి బలం ఉన్నప్పుడు, దానికుండే చలనశక్తి నిశబ్ధంగా ఉండదు కదా. ఈ ముప్పై ఏళ్ల ‘కాలం’లో లో ఈ ‘ఆలోచన’ చుట్టూ అనంతమైన భావధార ఏర్పడడం మొదలయింది.

ఆ ‘ప్రజలు’ వారి ‘ప్రాంతము’ చుట్టూ ఆ భావధార వలయంలా తిరుగుతూ, వారి సాంస్కృతిక జీవన వైవిధ్యాన్ని, కుల చరిత్రను, కుల చిహ్నాలను, వ్యవసాయ ప్రధాన సమాజంలో పలు ఉత్ప్పత్తి కులాల మధ్య పరస్పర సంబంధాలను ఆవిష్కరిస్తూ, అనంతమైన మాదిగ సాహిత్యాన్ని ఈ ‘కాలం’ ఆవిష్కరించింది. మళ్ళీ ఇందులో రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఇలా ప్రాంతీయ రూపాన్ని సైతం అది సంతరించుకుంది. కేవలం ‘దండోరా’ ఎంతోమంది యువతను కళాకారులు, కవులు, రచయితలుగా చేసింది. ఇదే ‘దండోరా’ కాలంలో వెల్లువెత్తిన తెలంగాణ ఉద్యమంలో గేయ కళాకారుల్లో నూటికి ఎనభై మంది మాదిగ వారే అంటారు కవి పొనుగోటి కృపాకర్ మాదిగ.

నిజానికి ‘కారంచేడు’ (1985) ‘చుండూరు’ (1991) సంఘటనలు తర్వాత తెలుగులో దళిత సాహిత్యం ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. ‘చిక్కనవుతున్న పాట’ దళిత కవితా సంకలనం (1994) లో వచ్చినప్పుడు మాదిగలు కంటే మాల కవులు ఎక్కువమంది ఉన్నారు. దీనికి త్రిపురనేని శ్రీనివాస్, జి. లక్ష్మి నరసయ్య సంపాదకత్వం బాధ్యతలు చూసారు. ప్రధాన సంపాదకుడుగా లక్ష్మి నరసయ్య తిరిగి ‘పదునెక్కిన పాట’ (2015) వెలువరించే సమయానికి సంపాదక వర్గంలో డా. ఎండ్లూరి సుధాకర్, వంటి మాదిగ, శిఖామణి, చల్లపల్లి స్వరూప రాణి, పైడి తెరేష్ బాబు వంటి మాలలు మరికొందరు బి.సి. కవులతో కలసి బృందంగా పనిచేసారు.

ఇటువంటి సాహిత్య ముఖచిత్రం నేపధ్యంలో ‘దండోరా’ పోరాటానికి జనరల్ సెక్రటరీ కూడా అయిన కృపాకర్ మాదిగ ఇప్పటికీ మాదిగల సాంస్కృతిక జీవనంపై లోతైన అధ్యయనం చేస్తున్నారు. నిజానికి మాలల ‘ఏ.బి.సి.డి’ల నిరాకరణ మాదిగల చేత వారి చరిత్ర, సాంస్కృతిక జీవనం లోతుల్లోకి వెళ్లేట్టుగా వారిని పురికొల్పింది. అందుకు వారు తమ చిహ్నాలను వెదికారు. డప్పును తమ ‘లోగో’ చేసారు. వారు తమ ఆహారం ప్రత్యేకం అన్నారు, కులీన సమాజంతో ఒక ‘స్టిగ్మా’గా చూడబడుతున్న ‘బీఫ్’ను తాము ఇష్టంగా తినడాన్ని తమ సాంస్కృతిక చిహ్నంగా చెప్పుకుంటూ, 2008 డిసెంబర్ లో ఏకంగా ‘కైతునకల దండెం’ పేరుతొ 200 మంది మాదిగ కవుల కవిత్వ సంకలనాన్ని జూపాక సుభద్రతో కలిసి కృపాకర్ మాదిగ ప్రచురించారు.

సుప్రసిద్ధ కధా రచయిత డా. వి. చంద్రశేఖర రావు ‘దండోరా’ ఉద్యమం నేపధ్యంగా 2012లో ‘నల్ల మిరియం చెట్టు’ నవల రాసారు. కరువు జిల్లాగా పేరుపడ్డ ప్రకాశం జిల్లాలోని కడప-కర్నూలు సరిహద్దు ప్రకాశం మాదిగల జీవనాన్ని దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి ‘గంగ జాతర’, ‘మా ఎర్ర ఓబన్న పల్లె’, ‘చంద్రవంక’ నవలల్లో సజీవంగా నిక్షిప్తం చేసారు. కొత్తగా వస్తున్న దళిత సాహిత్యకారుల్లో మాలలు కంటే మాదిగలు ఎక్కువమంది ఉంటున్నారు. అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు, ‘దండోరా ఉద్యమ కాలంలో వచ్చిన కొత్త మాల కవులు సంఖ్య కంటే, మాదిగ కవులు కొన్ని రెట్లు అధికంగా వచ్చారు’ అంటారు కృపాకర్. నిజమే కావొచ్చు సామాజిక సంఘర్షణ వున్నప్పుడు ఎక్కడైనా భావాల ఉద్వేగం నిరంతరం రగులుతున్న కొలిమిలా మండుతూనే ఉంటుంది.

అయితే, మాదిగలకు తమ ‘జాతి’ పట్ల ఇటువంటి భావోద్వేగపు అనుబంధం (‘బాండ్’) ఉన్నప్పుడు, దాన్ని వారు నిరర్ధకమైన శక్తిగా వృధా చేయడం కాకుండా, తమ రాజకీయ ఉనికిని ప్రదర్శించే ఇంధనంగా వారు దాన్ని వాడుకోవచ్చు. మాలలు చాలా కాలంగా అంబేద్కర్ పేరు చెబుతూ, ‘రాజ్యాధికారం’ అంటునే వారు అన్ని పార్టీలోనూ వుంటున్నారు. ఇప్పటికీ తమకంటూ ఒక స్వంత పార్టీ ఆలోచన వారు చేయలేదు. అందుకు తగిన సాంస్కృతిక నేపధ్యాన్ని ఇప్పటికీ వాళ్ళు నిర్మించుకోలేకపోయారు. అవకాశం వుండి ఉంటే వారు ఆ పని చేసివుండేవారు. కానీ మాదిగలు ఒక అనివార్యతతో ఆ పనిని ఇప్పటికే పూర్తి చేసారు.


Read More
Next Story